ట్రావెలోకం
సప్త స్వరాలు ఆలపించే 'సప్తగుండాల'
తెలంగాణలో
రెండు మూడు మినహా పెద్దగా జలపాతాలు లేవు అనుకునే వారికి ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లో ఒకేచోట ఏడెనిమిది
అందమైన జలపాతాలున్నాయంటే ఆనందం, ఆశ్చర్యం కలుగక మానవు.
ఈ జలపాతాలను చేరుకునే క్రమంలో చేసే 30-40 కి.మీ అటవీ ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఐబీ తాండూరు నుంచి కుడివైపుకి తిరిగి 5 కి.మీలు ప్రయాణించిన తరువాత వచ్చే '3 ఇంక్లయిన్' నుండి అటవీ మార్గం ప్రారంభమై సప్తగుండాల వరకు లోయలు, ఘాట్ రోడ్లు, మూలమలుపుల్లో వింతలు, విశేషాలను వీక్షిస్తూ ప్రయాణించడం ఒక మరపురాని మధురానుభూతి. పచ్చని అడవుల మధ్యలో విసిరేసినట్లున్న పల్లెల అందాలను ఆగి మరీ చూడవలసిందే. ప్రకృతి పొదుగులో ఒదిగినట్లున్న ఈ గ్రామాలు నాలుగు రకాలుగా కనిపిస్తాయి. కొన్ని గుట్టలపైనుండి కిందికి జాలువారినట్లుగా కనిపిస్తే మరికొన్ని గుట్టలపైనే తిష్టవేసినట్లు కనిపిస్తాయి. కొన్ని పచ్చని చెట్ల మధ్య ఎర్రని గడుల తివాచీ (బెంగుళూరు గూన కప్పిన ఇళ్ళు) పరిచినట్లుగా కనిపిస్తే, ఇంకొన్ని గుట్టల మధ్యలో చొచ్చుకుని ప్రకృతి ఔన్నత్యాన్ని మానవ నిర్మిత నిమ్నత్వాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఈ గుట్టలన్నీ సత్మాల కొండల సౌందర్యాలకు ప్రతీకలు. ఇక్కడ వీటి సరాసరి ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 1800 అడుగులుండడంతో వాతావరణం చల్లగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఊటీని తలపిస్తుంది.
తమ అవసరాలకు సరిపడా సాగుభూమి లేకపోవడంతో రైతులు గుట్టలపైనే కొంత అనువైన ప్రదేశాన్ని చదును చేసి వ్యవసాయం చేస్తుంటారు. గుట్టల ఏటవాలుల్లో ఏపుగా పెరిగిన రకరకాల చెట్ల మధ్య వారు వేసిన పంట చేలు అందంగా కనిపిస్తాయి.
ఎగుడు దిగుడుగా ఏర్పడిన కొండలను వెంట వెంటనే ఎక్కుతూ, దిగుతూ, మూలమలుపులు తిరుగుతూ పచ్చని చెట్ల మ«ధ్య వడివడిగా నల్లని త్రాచుపాములాగా సాగే సింగిల్ రోడ్‌పై చేసే ప్రయాణం కూడా అంత అందంగా, ఆహ్లాదంగా ఉంటుందని ఇక్కడ ప్రయాణించాకే తెలిసింది. ఈ రోడ్‌పై వాహనాల ట్రాఫిక్ ఉండదు. వనచరాల ట్రాఫిక్ మాత్రమే ఉంటుంది. పక్షుల రావాలు, నెమళ్ళ కీరాలు, కోతి-కొండెంగల గెంతులు ఇక్కడి సహజ దృశ్యాలు. ప్రత్యేకంగా చెప్పుకోవలసింది గుర్రాల గురించి. ఇక్కడ పల్లీయులు సమీపంలో ఉన్న పెద్ద గ్రామాలకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికైనా, ఇతరత్రా సంబంధాలు నెరపడానికైనా, దూరంలో ఉన్న పంట చేలకు వెళ్ళాలన్నా వారి వాహనం గుర్రమే. అది వారికి నాలుగుకాళ్ళ బైక్ లాగా ఉపయోగపడ్తుంటుంది.
ఇలా ప్రయాణ మార్గంలో కన్పించే ఎన్నో వింతలు విశేషాలన్నింటినీ ఫోటోలు, వీడియోలు తీసుకోవాలనిపిస్తుంది. అందుకై ఆగిన ప్రతి ప్రదేశంలో కూడా పక్కనే పరికిపండ్లు, ఉసిరికాయల చెట్లు మనల్ని ఊరిస్తాయి-తినమని. ఆ పక్కగా పారే పిల్లకాలువలు, వాగువంకలు చిన్న చిన్న జలపాతాలై సవ్వడి చేస్తాయి. వాటిలో కొన్ని సన్నగా పారితే మరికొన్ని పరుచుకుని పారుతాయి. ఇంకొన్ని జంప్ చేస్తాయి, దొర్లుతాయి. వీటిల్లో పెద్ద వరద కాలువ (వాగు) ఒకటి గోండుగూడకు అరకిలోమీటరు దూరంలో ఘాట్ దగ్గర మలుపు తిరిగి పిట్టగూడ-లింగాపూర్ గ్రామం మధ్య గుండా అడవుల్లోకి ప్రవేశించి తనలో మరికొన్ని పిల్ల కాలువలను కలుపుకుని మొదటిసారిగా మనకు 12 అడుగుల ఎత్తు జలపాతంగా దర్శనమిస్తుంది. ఆ తరువాత దట్టమైన అడవుల్లో ప్రవేశించి మరో ఆరు జలపాతాలుగా దుముకుతుంది. వీటిల్లో రెండవదైన పెద్దమిట్ట జలపాతం అన్నిటికంటే పెద్ద జలపాతం కాగా మూడవదైన నడిపిమిట్ట జలపాతాన్ని సాహసంతో మాత్రమే చూడగలం. ఆ తరువాత జలపాతాలనైతే అత్యంత సాహసం మీద మాత్రమే చూడగలం. అంతగా కాకులు దూరని కారడవిలో ఉంటాయవి.
పెద్దమిట్ట జలపాతం
లింగాపూర్ నుండి రోడ్ పక్కగా పంట చేల మధ్యలో సుమారు కిలోమీటరు నడిచిన తరువాత వస్తుంది పెద్దమిట్ట జలపాతం. అయితే అరకిలోమీటరు దూరం నుంచే ఈ జలపాతపు శబ్దాలు వినిపిస్తాయి. ఇక దగ్గరికొచ్చేందేమోనని వడివడిగా అడుగులు వేస్తే మాత్రం అల్లంత దూరంలో కూడా అగుపించదు. సరేనని నిదానంగా నడవడం మొదలుపెట్టాక సడన్‌గా కనిపించి కనువిందు చేస్తుంది. 50 అడుగుల ఎత్తు నుండి 70 అడుగుల వెడల్పుతో టేబుల్ మీద నుండి పడుతున్నట్లుగా సమాంతర ప్రదేశం నుండి దుముకుతుంది ఈ జలపాతం. చూడడానికి ఆనకట్టపై నుండి దుముకుతున్నట్టుగా ఉంటుంది. అయితే ఇది సృష్టి సౌందర్యం. సహజం. ఈ జలపాతం కింద వంద మీటర్ల వ్యాసంతో ఒక గుండం ఏర్పడింది. ఈ గుండం చుట్టుప్రక్కల ప్రాంతమంతా జారుడుగా ఉండడంతో దాని తూర్పు ఒడ్డున నిలబడే పడమర నుండి పడుతున్న జలపాతపు సోయగాలను చూడాలి. ఆ జలపాతపు తుంపర్లు మన చెంపలకు తగిలి మనల్ని తుంటరి చేష్టలకు ఉసిగొల్పుతాయి.
నడిపిమిట్ట జలపాతం
పెద్దమిట్ట జలపాతం నుండి సుమారు ఒక ఫర్లాంగు దూరం వాగు నీళ్ళలో, రాళ్ళలో, చెట్ల మధ్యలో నడిచాక నడిపిమిట్ట జలపాతం వస్తుంది. అంతదాకా వానపాములా మందగమనం సాగించిన వాగు ప్రవాహం ఒక్కసారిగా నాగుపామై పడగవిప్పి బుసలు కొట్టినట్టుగా జలపాతమై దుముకుతుంది. 70 అడుగుల ఎత్తు నుండి దూకే ఈ జలపాతం కేవలం ఏడు అడుగుల ఇరుకు సందు నుండి పారడం వల్ల దీని హోరు ఎక్కువ. ఈ జలపాతపు దూకుడే కనిపిస్తుంది కాని ఆ తరువాత అది ఎటు పోతుందో కనిపించదు. జలపాతపు తుంపర్ల వల్ల ఇక్కడి బండలు పాకుడుబట్టి జారుతున్నాయి. అయినా ఆ జలపాతపు జోరు తనను చూడమని టెంప్ట్ చేస్తుంటే ఒకర్ని పట్టుకుని ఒకరం పాకుకుంటూ ప్రయాణించి 70 అడుగుల లోతైన లోయలో హొయలు పోతున్న దాని సోయగాలను చూడడం రవిగాంచని చోటును చూశామన్న ఆనందాన్నిస్తుంది.
చింతలమాదారం జలపాతం
సుంగాపూర్ కూడలి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో చింతలమాదారం గ్రామ పరిసరాల్లో మరో జలపాతం ఉంది. సుంగాపూర్ దాటి చింతలమాదారం వైపు ప్రయాణం ప్రారంభం కాగానే మనకు దట్టమైన అడవులే కాదు దట్టమైన గుట్టలు కూడా కనిపిస్తాయి. వాటి మధ్య 'అసలు దారి ఉందా, లేదా' అనుకుంటూ నిదానంగా వెళ్తుండగా మనం ప్రయాణిస్తున్న రోడ్ అకస్మాత్తుగా ఘాట్‌రోడ్‌గా మారి గుట్టలను చుడుతూ పైకి తీసుకెళ్తుంది. అలా మనం పైకి వెళ్తున్నకొద్దీ గుట్టల మధ్య పచ్చని లోయలు చిక్కనవుతూ, మనకు దూరమవుతూ 'దూరపు లోయలు పచ్చన' అన్న చందాన మనల్ని ఆనందింపజేస్తాయి.
చింతలమాదారంలో దారినపోయే ఏ ఆసామిని అడిగినా ఆయన వెంటనే మనల్ని తన ఇంటి వెనకాల నుండి పంట చేల మధ్యగా ఒక పర్వతం వైపు చూపిస్తాడు. అలా ఒక ఫర్లాంగు దూరం నడిచిన తరువాత జలపాతపు హోరు వినిపిస్తూ మనల్ని కవ్విస్తుంది- తనవైపు త్వరత్వరగా రమ్మని. మనం ఎంత వడివడిగా అడుగులు వేస్తూ పోతే అంత వడివడిగా వర్షం పరుగెత్తుకొస్తున్నట్టుగా ఆ జలపాతపు దూకుడు శబ్దం విన్పిస్తుంది. సమీపించాక కూడా అది దాగుడుమూతలాడుతుంది. గుట్ట అడ్డంగా ఉండడం వల్ల అది మనకు కన్పించదు. మరో గుట్ట మీద నుంచి జలపాతం దూకే గుండం దగ్గరికి వెళ్ళాలి. సగం విప్పిన తెల్లని గొడుగును బోర్లించినట్టు 60 అడుగుల ఎత్తు నుండి దూకే ఈ జలపాతం చుట్టూ కమ్ముకున్న కొండలు, అడవుల మధ్య చేసే అరుదైన శబ్దాలను ఆస్వాదించడం అదృష్టవంతులకే సాధ్యం. దూకుతున్న జలపాతపు మల్లెల తెల్లదనాన్ని, గుండం నీటి పారదర్శక స్వచ్ఛతను చూసి, తాగి, అరిచి ఆనందిస్తేనే ఈ జీవితానికి సార్థకత అనిపిస్తుంది. జలపాతం పక్కగా దాని ఎత్తులో సగం వరకున్న గుట్టనెక్కి అక్కడున్న చెట్టు కింద నిల్చొని జలపాతాన్ని తాకుతూ పొందే ఆనందాన్ని తమ గుండెల్లో దాచుకోవాలనుకునేవారు వచ్చే వర్షాకాలంలో తప్పనిసరిగా ఇక్కడికి ప్రయాణించాల్సిందే.
- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94406 87250
No comments:
Post a Comment