Friday 16 May 2014

Telangana summer resorts written by Dr. Dyavanapalli Satyanarayan and published in Namasthe Telangaana daily on 11.5.2014
మన చల్లని విడుదులు
Updated : 5/11/2014 2:58:58 AM
Views : 750
coolplaceమంట పుట్టించే ఈ వేసవి గాడ్పుల నుంచి సేద దీరడానికి కొండంత చల్లదనం కావాలి. అందుకని ఏ కూర్గ్, ఊటి, కొడై కెనాల్, కులూ మనాలి వంటి దూరతీరాలకే వెళ్లాలా? ఒక్కసారి తెలంగాణలోని ఈ చల్లని ప్రదేశాలను సందర్శించి చూడండి. ఆహా అని మీరు ఆనందించకుండా ఉండరు.

తెలంగాణలోనూ చల్లని పర్యాటక స్థలాలు లేకపోలేదు. ఎత్తైన గుట్టలు, జలపాతాలు, నదులతో అలరారే మన దక్కన్ పీఠభూమి ఎత్తుగా ఉంటుంది. పైగా నల్లమల పర్వతాలు, దండకారణ్య పర్వత సానువులు కూడా తెలంగాణలో ఉండటంతో అద్భుత ప్రకతికి లోటు లేకుండా పోయింది. ఎత్తయిన గుట్టలకు, వాటి పై నుండి దూకే జలపాతాలకు, వాటి మధ్య నుండి పారే నదులకు మన దగ్గర చోటు లేకపోతే కదా, వేరే ప్రాంతాలను ఆశ్రయించాలి.

రామాయణంలో అరణ్యకాండ, సుందరకాండ సుందరమైనవి. కారణం అవి అడవుల్లో నడిచే కథాంశాలు. సుందరకాండ శ్రీలంకలో జరిగితే అరణ్యకాండ ఎక్కువగా దండకారణ్యంలో, అదికూడా తెలంగాణలోని దండకారణ్యంలో జరిగింది. తెలంగాణ దండకారణ్యం గోదావరి నదికి ఇరువైపులా విస్తరించిన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో నెలకొని ఉంది. ఇది రాముడు, సీత, లక్ష్మణుడు ఆహ్లాదకరంగా సంచరించిన నేల. రావణాసురుడి బంధుగణంతో వారు యుద్ధాలు చేసిన నేల. ఈ ప్రాంతపు పర్వత సానువులు, వాటి మధ్య పారే నదులు, వాగులు వంకలు, అక్కడక్కడ అవి జలపాతాలుగా మారే వైనం, వాటిపైన కట్టిన ఆనకట్టలు- ఇవన్నీ ప్రకతి సౌందర్యంతోపాటు చల్లదనాన్ని కూడా ఇచ్చేవిగా ఉన్నాయి. అయితే, వీటిల్లో ఈ ఎండాకాలంలో సందర్శనీయ ప్రదేశాలూ కొన్ని లేకపోలేదు. వాటి గురించే ఈవారం కవర్‌స్టోరీ.

పొచ్చెరలో విశాలమైన స్నానకుండం:ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ నుండి 8 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొచ్చెర జలపాతం వస్తుంది. ఇది చిన్నదే అయినా దీని నీటిలో స్నానం చేసే వీలుండటం ఇక్కడి ప్రత్యేకం. దీని కింద ఏర్పడిన విశాలమైన కుండం అందాలు ఆస్వాదించాల్సిందే.

కాళేశ్వరంలో పవిత్ర స్నానాలు:మంథని నుంచి సుమారు 50 కిలోమీటర్లు కాళేశ్వరం వరకు పచ్చని కొండలు, కోనల గుండా సాగే ప్రయాణం ఆహ్లాదకరమైన అనుభూతిని మిగులుస్తుంది. కాళేశ్వరం గోదావరిపాణహిత నదుల సంగమ ప్రదేశంలో ఉన్న త్రిలింగ క్షేత్రం. ఇక్కడి ప్రధానాలయంలో ఒకే పానవట్టంపై ముక్తేశ్వర-కాళేశ్వర అనే రెండు శివలింగాలున్నాయి.
ముక్తేశ్వర లింగం మీద పోసిన అభిషేక జలం దాని మధ్యలో ఉన్న రంధ్రం గుండా గోదావరిపాణహిత నదుల్లోకి పారి ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమం చేస్తుంది. యాత్రికులు ఇక్కడా పవిత్ర స్నానాలు చేయవచ్చు. ఈ క్షేత్రంలో ఇంకా ఎన్నో ప్రాచీన ఆలయాలు వాస్తు శిల్ప సౌందర్యాలతో అలరారుతున్నాయి.

మినీ నయాగరా బొగత:మల్లూరు తరువాత గోదావరి నది వరంగల్, ఖమ్మం జిల్లాలను వేరు చేస్తుంది. ఖమ్మం జిల్లా వైపునే బొగత జలపాతం ఉంది. స్థానిక గోదావరి ఉపనది వర్షాకాలంలో చాలా ఉధతంగా పారి మినీ నయాగరా జలపాతంలా దూకుతుంది. అప్పుడు ఒడ్లపై నుండి మాత్రమే దాని అందాన్ని చూడగలం. ఈ ఎండాకాలంలోనైతే జలపాతం మీద ప్రవాహంలోనూ, కింద గుండంలోనూ కేరింతల మధ్య స్నానాలు మరచిపోలేని ఆనందాన్నిస్తాయి. ఆ నీటి స్వచ్ఛత, చల్లదనం అక్షరాలకు అందేవీ కావు.

అందరినీ అలరించే నాగార్జునసాగర్:సుమారు అర్థ శతాబ్దం కింద కట్టిన అద్భుత మానవ నిర్మాణం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్. 124 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రాతి డ్యామ్. ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలో వెలికి తీసిన చారిత్రక సంపద, ప్రత్యేకించి బౌద్ధ అవశేషాలు, విశేషాలను ప్రాజెక్ట్ జలాల మధ్యలోగల నాగార్జున కొండపై ఏర్పాటు చేసిన మ్యూజియంలో దర్శించవచ్చు. ఇక్కడికి సాగర్ నీటిలో బోటుపై 9 కిలోమీటర్ల ప్రయాణం ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.

ప్రత్యేక ఆకర్షణ ఎత్తిపోతల:పైలాన్-హిల్ కాలనీ పరిసరాల్లో 279 ఎకరాల్లో బుద్ధుడు ప్రవచించిన అష్టాంగమార్గ స్ఫూర్తితో నిర్మితమైన కట్టడాలు, పార్క్‌లు చూడదగినవి. సాగర్ కిందుగా 11 కిలోమీటర్ల దూరంలో 70 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న ఎత్తిపోతల జలపాత సౌందర్యం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇది గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే, నాగార్జున సాగర్‌లో పర్యాటకులకు కావలసినన్ని సౌకర్యాలున్నాయి.

ఆకుపచ్చని అందం అనంతగిరి:హైదరాబాద్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలున్నాయి. అందంలో విశాఖ జిల్లాలోని అనంతగిరి కొండలను తలదన్నేవి ఇవి. ఈ కొండలమీది అటవీ ప్రదేశంలోనే నిజాం కాలంలోనే క్షయవ్యాధి నివారణా కేంద్రం ఏర్పాటై ఇప్పటికీ పనిచేస్తోంది. ఇక్కడి వాతావరణంలోనే క్షయవ్యాధిని నయం చేయగల మహత్తు ఉందని ఆనాడే గుర్తించారు. ఈ కేంద్రం ముందు విశాలమైన, లోతైన లోయ ఉంది. సాహసికులు అక్కడికి ట్రెక్కింగ్ చేస్తే వారికి అడవుల మధ్య అందమైన చెరువు కన్పిస్తుంది. కాగా, ఈ కేంద్రానికి వెనుక వైపు ఒక దేవాలయం, దానికి కిందుగా జంటగా ఉన్న కోనేరులోని మంచినీటిని (పాలగుండం), మురికినీటిని (నీళ్ళగుండం) దర్శించుకోవచ్చు. కాగా, పర్యాటకశాఖ వారు ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌లో మంచి భోజనం లభిస్తుంది. ఇక్కడ ఏ.సి. గదుల సౌకర్యమూ ఉంది.

నల్ల మలయ పర్వతాలు:తెలంగాణకు దక్షిణాన మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో కష్ణానది సరిహద్దుగా విస్తరించాయి నల్లమల అడవులు. వీటిలో 1978లో పులుల సంరక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం. అధికారిక అంచనాల ప్రకారం ప్రస్తుతం నల్లమలలో చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 164 పులులు ఉన్నాయి. వీటితో పాటు అనేక అటవీ జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, వక్షజాతులు ఇంకా ఎంతో వైవిధ్య భరితమైన జీవజాలానికి నిలయమైన నల్లమల అడవులు దేశంలోనే రెండవ అతిపెద్ద అడవులు. వీటి వైశాల్యం 3,568 చదరపు కిలోమీటర్లు. నల్లమల గుట్టల సరాసరి ఎత్తు 914 మీటర్లు. కాబట్టి చల్లగా ఉంటాయి. ఇక్కడే మరెన్నో జలపాతాలు, వాటి మధ్య నుంచి ఏరులు పారుతున్నాయి.

శ్రీశైలం వష్టజలాల సందర్శన:వనమయూరి గెస్ట్‌హౌస్ కష్ణానది ఒడ్డున ఉంది. కాబట్టి, శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ (వష్టజలాలు), నల్లమల పర్వత సానువుల్లో చిక్కుకున్న అందమైన దశ్యాన్ని, ఆ నీటిపై నుంచి వచ్చే చల్లగాలులను ఇక్కడ్నించి ఆస్వాదించవచ్చు. చీతల్ రెస్టారెంట్ (వనమాలి గెస్ట్‌హౌస్), వనమయూరి గెస్ట్‌హౌస్- ఈ రెండూ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. కాబట్టి, సందర్శకులు ముందే వాటిని బుక్ చేసుకోవలసి ఉంటుంది. వనమాలి గెస్ట్‌హౌస్‌లో ఉన్న వారు ఆ చుట్టుపక్కల్లోని ఎన్విరాన్‌మెంటల్ సెంటర్, చెంచు లక్ష్మీ అనే గిరిజన మ్యూజియంను, దగ్గరలోని ఉమామహేశ్వరం అనే గుహాలయాన్ని, ప్రతాప రుద్రకోటను, షావలి దర్గాను కూడా సందర్శించవచ్చు.

వింత గొలిపే లొద్ది జలాలు:వనమాలి గెస్ట్‌హౌస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్నప్పుడు 16 కిలోమీటర్ల దూరంలో రోడ్‌కు కుడివైపు లొద్ది అనే ప్రదేశం ఉంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి వాచ్‌మన్ గది దగ్గర తమ వాహనాలను ఆపి సుమారు అర కిలోమీటరు దూరం అడవిలో నడిస్తే ఒక వింతయిన లొద్ది కనిపిస్తుంది. మూడు దిక్కులా వేయి అడుగుల ఎత్తయిన గుట్టలు వర్తులాకారంలో మూసుకోగా తూర్పు నుండి పడమరకు ప్రవహించే చంద్రవాగు సుమారు 150 అడుగుల ఎత్తు నుండి ఇక్కడే లోయలోకి దూకుతుంది. ఎంతో అరుదైన, అందమైన ఈ దశ్యాన్ని చూడడానికి మనకు రెండు కళ్లూ చాలవు.

మనం తూర్పు వైపున చంద్రవాగును దాటి దక్షిణం వైపు నుండి పావు కిలోమీటరు ప్రయాణించి ఉత్తరం వైపుకి తిరిగి లోయలోకి చేరుకోవాలి. మళ్ళీ పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకి తిరిగి లొద్ది జలపాతం వైపుకు చేరుకోవలసి ఉంటుంది. ఇక్కడ నడవ లేని వారు జలపాతం పై నుంచే లోయలోకి చూసి అందులో నుండి వేగంగా వచ్చే ఈదురుగాలులను చల్లదనాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు.
లొద్ది జలపాతం కింద ఒక విశాలమైన గుండం ఏర్పడింది. అందులోని నీళ్ళు చాలా తేటగా, స్వచ్చంగా ఉంటాయి. నీళ్ళపైకి గుండం చుట్టూ పెరిగిన పెద్ద చెట్లు వంగి అద్భుత దశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. గుండం నీళ్ళల్లో ఎవరైనా స్నానం చేయవచ్చు. లోతు తక్కువగా ఉండి అడుగు పైకి కనిపిస్తుంది. కాబట్టి, ఈత రాని వారు కూడా భయపడనక్కర్లేదు.

పుష్కరతీర్థం మహిమ:ఈ గుండం తూర్పు అంచున జలపాతం కింద ఒక చదునైన బండ ఉంది. దానిపై నిల్చుని కూడా జలపాతపు హొయలు దర్శించవచ్చు. ఆ బండమీద నిల్చున్న వారు పాపాత్ములైతే వారి మీద జలపాతం దూకకుండా పక్కకు తప్పుకుంటుందని, అది ఈ పుష్కర తీర్థం మహిమ అని 17వ శతాబ్దానికి చెందిన నాగలూటి శేషనాథాచార్యులు శ్రీ పర్వత పురాణంలో వివరించారు.

సొరికెల్లో నడక గొప్ప థ్రిల్లింగ్:గుండం చుట్టూ గుట్టల సొరికెలు (గుహలు)న్నాయి. వాటిల్లో సునాయాసంగా మనం నడవచ్చు. జలపాతం వెనుక ఉన్న గుహలో నడవడం మరువలేని మధురానుభూతిని ఇస్తుంది. ఉత్తరపు గుహ చాలా విశాలమైంది, లోతైంది. కాబట్టి, అందులో 1600 సంవత్సరాల కిందనే ఈ ప్రాంతం నుంచి ఎదిగిన విష్ణుకుండి రాజులు శివాలయం కట్టించారు. కాకతీయుల కాలం నకీ.శ.1200)లో మరిన్ని విగ్రహాలు చేర్చారు. ఇక్కడ ప్రతి యేటా నాలుగు రోజులు జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం తొలి ఏకాదశి అంటే జూలై మొదటివారంలో జాతర జరుగనుంది.
ప్రకతి ప్రేమికులు, చల్లదనాన్ని ఆస్వాదించాలనుకునే వారు దీనిని మిస్ కావద్దు. ఈ జాతర స్థానిక చెంచు గిరిజనుల ఆధ్వర్యంలో జరుగుతుంది. గుండం నుంచి పారుతున్న ఏరు వెంట కొంత దూరం వెళితే నిటారైన ఒక గుట్ట కనిపిస్తుంది. స్త్రీ బాలవద్ధులు కూడా చీమలదండులా నిజాం కాలం నాటి నిచ్చెన నెక్కుతూ వత్తున్నాం వత్తున్నాం లింగమయ్యా అని అరుస్తూ అక్కడ ఎలా ఆనందిస్తారో చూసి తీరాల్సిందే.

ఫరహాబాద్ గేట్ వద్ద టైగర్ సఫారీ:గుండం నుంచి శ్రీశైలం వైపు ఫర్లాంగు దూరం ప్రయాణించగానే ఫరహాబాద్ గేట్ వస్తుంది. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు ఆరుగురికి ఆరు వందల రూపాయలు తీసుకొని ఫారెస్ట్ జీప్‌లో టైగర్ సఫారీకి తీసుకెళ్తారు. మీ అదష్టాన్ని బట్టి పులి, జింకలు, ఎలుగుబంట్లు, అడవిపందులు వంటి జంతువులు అక్కడక్కడా ఉంటే నీటి గుంటల్లో నీళ్ళు తాగడానికి వస్తూ కన్పిస్తాయి. మార్గమధ్యలో నిజాం కట్టించిన గెస్ట్‌హౌస్‌ను, వంటశాల, గుర్రాలశాలను చూపి ఏడెనిమిది దశాబ్దాల క్రితం ఈ అడవుల్లో నిజాం రాకుమారులు వేటాడి ఆ జంతువుల మాంసాన్ని వండించుకుని, తిని, తాగి ఆనందించిన వైనాన్ని ఊహించుకుంటే కూడా థ్రిల్ అనిపిస్తుంది.

ఇదే నిజాం రాజులు మరో ఏడెనిమిది కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వచ్చే పర్వత సానువు అంచున కూడా గెస్ట్‌హౌస్ కట్టించారు. పదిహేనేళ్ళ క్రితం దాన్ని పునరుద్ధరించి వసతి యోగ్యంగా చేశారు. కానీ, నక్సలైట్లు పేల్చేశారు. అట్లని నిరుత్సాహ పడకండి. ఆ శిథిల గెస్ట్‌హౌస్‌ల ముందర ఉన్న గుట్ట కొనకెళ్ళి చూడండి. భయం ప్లస్ అనిర్వచనీయమైన ఆనందం ఒకేసారి కలిగే దశ్యం కన్పిస్తుంది. ఆ గుట్ట అంచున ఉన్న మన కింద కిలోమీటరు లోతైన లోయ, మైదానాలు, వాటిల్లో చిక్కటి అడవుల్లో చిక్కుకున్న పెద్ద చెరువులు కాన్వాస్ మీద గీసిన రంగుల చిత్రాల్లా కన్పిస్తాయి.
మనం ఆ లోయలోకి పడిపోతామేమోనన్న భయం కలుగుతుంది. తల తిరిగినట్లనిపిస్తుంది. అందుకే అక్కడ రైలింగ్ (ఇనుప కంచె) ఏర్పాటు చేశారు. ఈ కంచె కడీలను పట్టుకొని లోయలోకి చూస్తుంటే ఆ పల్లపు ప్రాంతపు చెట్ల పుప్పొడి (వాసన)ని నీటి తుంపర్లను మోసుకొంటూ మనల్ని వెనక్కి తోసి పడేసేంత వేగంగా వీస్తున్న గాలులను ఆస్వాదిస్తుంటే గాల్లో తేలినట్టుందే అని అరవక మానం.

ఆక్టోపస్ వ్యూ పాయింట్:ఇలాంటి వ్యూపాయింట్ మరొకటి ఫరహాబాద్ గేట్ నుండి శ్రీశైలం రూట్‌లో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని పేరు ఆక్టోపస్ వ్యూ పాయింట్. కష్ణానది ఎడమ ఒడ్డున అర కిలోమీటరు ఎత్తులో ఉంది. అక్కడ వ్యూ పాయింట్ కియోస్క్ (మెట్ల గూడు) కట్టారు. దానిపై నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ ఆక్టోపస్ ఆకారంలో పచ్చగా ఉన్న కొండల మధ్య చిక్కిపోయిన సౌందర్యం, ఆ నీళ్ళల్లో శ్రీశైలంలోని పాతాళగంగ నుంచి అక్కమహాదేవి గుహల వైపు ప్రయాణిస్తున్న బోట్లు, చేపలు పట్టేవాళ్ళ పడవలు, పుట్టీలు నయానానందాన్ని కలిగిస్తాయి.

కష్ణా నీటిపై నుంచి వీచే చల్లగాలులకు ఎగిరే మన ముంగురులను సవరించుకుంటూ ఆ ప్రాంతంలో ఎక్కువగా నెమళ్ళను, 2300 ఏళ్ళనాటి చంద్రగుప్త పట్టణపు శిథిలాలను చూస్తూ ఆనందంతో కడుపు నిండిన స్మతులతో వెను దిరగవచ్చు.
ఇలా ఈ వేసవిలో మన తెలంగాణలోని చల్లని విడుదలను తనివితీరా దర్శించుకుని మనసుకు ఉల్లాసాన్ని పొందుదాం.

మధురానుభూతినిచ్చే లక్నవరం

వరంగల్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని సుప్రసిద్ధ రామప్ప దేవాలయ ప్రాంగణం యావత్ తెలంగాణలోని అపురూప హిందూ వాస్తు శిల్ప నిర్మాణరీతులకు నిలువెత్తు నిదర్శనం. గుడిని దర్శించిన తర్వాత సమీపంలోనే ఉన్న విశాలమైన రామప్ప చెరువులో బోటు విహారం చేయవచ్చు. రామప్పకు కుడివైపున ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నవరం చెరువు, అక్కడి కొండలు అడవుల్లో చిక్కుకుని మరింత సౌందర్యవంతంగా కన్పిస్తుంది.

నీళ్ళమధ్య ద్వీపాలు, పచ్చని కొండలు ఇక్కడ విశేష ఆకర్షణ. ఈ నాలుగు దీవుల మీదికి ఊగే తాళ్ళ వంతెనలు ఏర్పాటు చేశారు. వాటిపై నడుస్తూ ఒక ద్వీపానికి చేరుకొని, అక్కడ ఒకరోజు బసచేయవచ్చు. అడవులు, నీళ్ళ మీదుగా వీచే చల్లగాలులను ఆస్వాదిస్తూ గడపడం ఒక మరిచిపోలేని మధురానుభూతిని మిగులుస్తుంది.

చక్కగా ఇక్కడి చెరువు నీళ్ళలో స్నానం చేయవచ్చు, బోట్లలో విహరించవచ్చు. సరస్సు మధ్యలో ఉన్న కాకరకాయల బోడుపై రాష్ట్ర పర్యాటకాభివద్ధి సంస్థ గత సంవత్సరం కోటి 14 లక్షల రూపాయల ఖర్చుతో కాటేజీలను నిర్మించింది. కిటికీల్లో నుంచి చూస్తే సరస్సుతోపాటు చుట్టూ ఉన్న ప్రకతి అందాలన్నీ కనిపించేలా గదులను ఏర్పాటు చేశారు. ఒక అధునాతన రెస్టారెంట్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటిల్లో ఒక్కరోజు గడిపినా ఆ అనుభూతిని మరవలేం.

నర్సన్నకు దండం, చింతామణిలో స్నానం:లక్నవరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరు నాగారం నుండి అందమైన అటవీ మార్గంలో మంగపేట మీదుగా మరో 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, మల్లూరు చేరుకోవచ్చు. మల్లూరుకు 8 కిలోమీటర్ల దూరంలో అడవుల మధ్య గోదావరి నదికి అల్లంత దూరంలో వెలసిన నరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికానందానికి, ప్రకతి సౌందర్యానికి నెలవు. స్వామి పొట్టలో వేలు పెడితే వేలికి అంటిన ద్రవం రక్తపు వాసన రావడం ఇక్కడి ప్రత్యేకత. పురాతన కాలంలో ఒక గిరిజనుడు చూసుకోకుండా స్వామి పొట్టలో గునపం దింపాడట. అందుకే రక్తం ఇప్పటికీ కారుతూనే ఉందంటారు. ఈ ఆలయం పక్కనే ఉన్న చింతామణి జలపాతం, సమీపంలోని గోదావరి స్నానాలు తప్పక ఆస్వాదించదగినవే.

పులకరింపజేసే మల్లెల తీర్థం

హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో వటవర్లపల్లి మీదుగా రోడ్డుమార్గంలో ప్రయాణించి మల్లెల తీర్థం జలపాతాన్ని చేరుకోవచ్చు. మొత్తం 165 కిలోమీటర్ల ప్రయాణం. ఇందులో 40 కిలోమీటర్లు మాత్రం నల్లమల అడవుల్లో రోడ్డుకు ఇరువైపులా జుమ్‌మ్ మని వీచే ఈదురు గాలినిచ్చే ఎత్తయిన చెట్లు. దారిలో కోతులు, కొండెంగలు, అడవి కోళ్ళు, నల్లమల ఉడతలు, నెమళ్లు సైతం దర్శనమిస్తాయి. ఇంకా ఒక్కోసారి అయితే ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులనూ చూడవచ్చు. ఈ జలపాతం నిర్వహణ స్థానిక చెంచు గిరిజనుల అధీనంలో ఉంది.

వారి దగ్గర టికెట్లు తీసుకుంటుండగానే మనకు జలపాతపు హోరు వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి సుమారు మూడు వందల మెట్లు దిగవలసి ఉంటుంది. సగం మెట్లు దిగుతుండగానే ఎడమవైపు చెట్ల మధ్య నుంచి నురగలు కక్కుతూ దూకే జలపాతం మనల్ని ఉవ్విళ్ళూరిస్తుంది. ఇక కాళ్ళకు ఎక్కడ లేని శక్తి వచ్చి జలపాతం వైపు పరుగెత్తుతాం. దగ్గరికి వెళ్ళీ వెళ్ళకముందే మన కళ్ళ ముందు అద్భుతమైన జలపాతం ఆవిష్కారమవుతుంది.

మల్లెల తీర్థం జలపాతం ఎత్తు సుమారు వంద అడుగులు. రెండు పర్వత సానువుల మధ్యనున్న లోయలోంచి పారుతూ వచ్చి అకస్మాత్తుగా మరో లోయలోకి దూకుతుంది. ఈ క్రమంలో జలధారలు మల్లెపూవుల ఆకారం తీసుకోవడమేకాక మల్లెల వలె చల్లగానూ ఉంటాయి. కాబట్టే, ఈ జలపాతానికి మల్లెల తీర్థమని పేరు వచ్చింది.

చంద్రావతి పూజించిన శివలింగం:అయితే ఈ జలపాతానికి కుడివైపునున్న ప్రాచీన శివలింగాన్ని సుమారు 2300 సంవత్సరాల కిందట మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని కూతురు చంద్రావతి మల్లెపూలతో పూజించినట్లు చరిత్ర కథనం. జలపాతం కొండమీద నుంచి గుండంలోకి దూకేటప్పుడు కొండచరియకు, గుండానికి మధ్య ఖాళీ స్థలం ఏర్పడింది. ఇక్కడిదాకా మనం వెళ్ళి ఎంచక్కా జలపాత ధారల కింద స్నానం చేయవచ్చు. జలపాతం ముందున్న నీటి గుండం కూడా చాలా లోతైంది, విశాలమైంది, అందమైంది. పెద్ద వట వక్షాలు ఆ గుండం నీటి ఉపరితలంపై తమ కొమ్మలను వేలాడదీసినట్లున్న దశ్యం ఒక సుందరకాండ.

కనిపించని ఆరు జలపాతాలు:రెండు గుట్టలను చీలుస్తూ పారే గుండం నీళ్ళు అలా ఉత్తరం వైపు ముందుకు సాగుతూ దూరంలో ఒకటి తర్వాత మరొకటిగా మొత్తం ఆరు జలపాతాలను ఏర్పరిచాయని అంటారు. ఆ ఎరుకతో ఇరువైపులా ఉండే ఒడ్లమీది నుంచి నడుచుకుంటూ వెళ్ళి వాటిని చూడవచ్చేమో. కానీ, మధ్యలో చాలా గుబురు పొదలు అడ్డుకుంటాయి. అంతేకాదు, వెళ్ళిన కొద్దీ పొదలు చిక్కబడుతుంటాయి. అడవి జంతువుల సంచారం కూడా ఉంటుంది. కాబట్టి, ఈ ప్రయత్నం ప్రమాదకరం. మానుకోవడమే మంచిది. కానీ, గుండం ముందు ఫర్లాంగు దూరంలో ఉన్న విశాలమైన స్థలంలో నీటి అంచున చెట్లనీడలో కావలసినంత సేపు గడిపి వెనుదిరగడం శ్రేయస్కరం.

ఇప్పుడిప్పుడే అక్కడ స్థానిక గిరిజనులు టిఫిన్స్, స్నాక్స్ పర్యాటకులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇక తిండి, వసతి కూడా ఈ జలపాతానికి 25 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వైపు వున్న మన్ననూరిలోని చీతల్ రెస్టారెంట్‌లోను, 25 కిలోమీటర్లు శ్రీశైలం వైపు వున్న దోమలపెంట వనమయూరి గెస్ట్‌హౌస్‌లోను అందుబాటులో ఉంటాయి.


అద్భుత సౌందర్యానికి నెలవు కుంతల

మన రాష్ట్రంలో అతి పెద్ద జలపాతంగా పేరు పడింది కుంతల. ఇది ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్- నేరేడిగొండ రూట్‌లో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి నేరేడిగొండ నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ జలపాతం మూడు దఫాలుగా దూకుతుంది. మొదటి రెండు దఫాలు చిన్న జలపాతాలు. వీటిల్లో హ్యాపీగా స్నానం చేయవచ్చు. మూడవ దఫా పెద్ద జలపాతం. కడెం నదికి రెండు ఒడ్డుల పక్కగా దూకుతుంది.

కుంతల జలపాతం ఎత్తు 46 మీటర్లు. కుడి ఒడ్డు నుంచి వెళితే జలపాతం కిందికి చేరుకోవచ్చు. కింద ఏర్పడిన కుండంలో, అక్కడి నుంచి పారుతున్న నదీ ప్రవాహంలో స్నానం చేయవచ్చు, ఈత కొట్టవచ్చు. ఈ నదికి ఇరువైపులా దట్టమైన అడవులు, గుట్టలు, వాటి మధ్య లోయలు ఉన్నాయి. ఇక్కడి ప్రాకతిక సౌందర్యం అద్భుతం. ఇక్కడ ఈ మధ్యనే పర్యాటకులకు తిండి, వసతి ఏర్పాట్లు చేశారు. పర్యాటకులు ఇక్కడ ఒకరోజు గడపవచ్చు కూడా.

అక్కమహాదేవి గుహల అద్భుతం

ఫరహాబాద్ గేట్ నుండి శ్రీశైలం రూట్‌లో వటవర్లపల్లి మీదుగా సుమారు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత కుడివైపున లోయలో అక్కమహాదేవి గుహలకు దారి అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ఆహ్లాదకరమైన ప్రకతిలో ట్రెక్కింగ్ చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ అంచున ఉన్న ఈ చారిత్రాత్మకమైన గుహలను చేరుకోవచ్చు. క్రీ.శ. 12వ శతాబ్దంలో ఈ గుహల్లో కర్ణాటక నుంచి వచ్చిన శివ భక్తురాలు శ్రీశైలం శివుణ్ని సేవించి తరించడంతో ఆమె పేరుమీదే వీటిని అక్కమహాదేవి గుహలు (అక్కమ్మ బిలం) అంటున్నారు.

ముందుగా మనల్ని సహజ శిలా తోరణం ఆహ్వానిస్తుంది. తూర్పు పడమర దిక్కుల మధ్య సుమారు 50 గజాల దూరంతో రెండేసి స్తంభాల చొప్పున సహజంగా ఏర్పడగా వాటిపైన రెండు గజాల మందం, నాలుగు గజాల వెడల్పు, 55 గజాల పొడవు ప్రమాణాలతో ఉన్న ఒక చదునైన బండ నిలబెట్టినట్లు ఏర్పడింది. ఈ బండ పందిరి కింద సుమారు వేయి మంది నిల్చోవచ్చు. ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
అన్నట్టు ఇక్కడ స్థానిక చెంచు పిల్లలు అమ్మే బోలు పేలాలు ఓ ప్లేటు తిని టీగాని, మజ్జిగ గాని తాగి వాళ్ళలో ఒకర్ని గైడ్‌గా తీసుకొని కొవ్వొత్తి వెలుతురులో మూడు మలుపుల ద్వారా 108 అడుగులు వేసి గుహ చివరన గజమెత్తు గద్దెపైన సహజంగా ఉన్న శివలింగాన్ని దర్శించుకుని గబ్బిలాల కిలకిలల మధ్య వెనుదిరగడం ఒక థ్రిల్లింగ్ అనుభవం. తూర్పు నుండి పడమర వైపు సాగే ఈ గుహకు ఎదురుగా మరో గుహ, దానికి సమాంతరంగా ఇంకో గుహ, వీటన్నింటిపైన మరో రెండు గుహలు ఉన్నాయి. పై గుహల్లో ఇప్పటికీ కర్ణాటక నుండి వచ్చిన శివభక్తులు నివాసం ఉంటున్నారు.

బ్యాక్‌వాటర్‌లో స్నానం:ఈ గుహల అంచునే ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో స్నానం చేయడం మర్చిపోకండి. చేస్తూ ఎదురుగా అవతలి ఒడ్డుపైన అక్కడక్కడా విసిరేసినట్లు కన్పించే ఆవులపెంట, చేపలోళ్ళ పెంటలు, సూర్యోదయం, సూర్యాస్తమయం నీళ్ళలో ప్రతిఫలిస్తున్న ప్రతిబింబాలనూ చూడండి. పాతాళగంగ నుంచి ఇక్కడికి 22 కిలోమీటర్లు ఏపీటీడీసి బోటులో ప్రయాణించి కూడా చేరుకోవచ్చు. తెలంగాణ వైపున్న నీలిగంగ రేవు నుండి ప్రైవేటు బోట్లనూ ఎంగేజ్ చేసుకోవచ్చు.