Monday 10 October 2011

PEDDAIAH GUTTA IN ADILABAD DISTRICT

ట్రావెలోకం
పెద్దయ్య గుట్టపై పాండవ క్షేత్రాలు

మన రాష్ట్రంలో చాలా అరుదుగా కనిపించే దేవుడు పెద్దయ్య. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మాత్రమే పూజింపబడుతున్నాడు. ఆయన ప్రధాన నెలవు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. పెద్దయ్య దేవుడి గురించి చాలాసార్లు విని అసలు సంగతేంటో తెలుసుకుందామని ఆగస్ట్ 14 ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌లో బస్సెక్కి కరీంనగర్, చొప్పదండి మీదుగా 230 కి.మీ. ప్రయాణించి లక్సెట్టిపేట చౌరస్తాలో 10 గంటలకు దిగాను. వెళ్లవలసిన చోటు దండకారణ్య ప్రాంతం కాబట్టి, అక్కడ పులులు, జిట్టకుర్రలు (చిరుతలు), ఎలుగుబంట్లు బెడద ఉంటుంది.

కాబట్టి నాతోపాటు మా బంధువులు అనిల్, లక్షీనారాయణలను తీసుకెళ్లాను. మమ్మల్ని ఆ చౌరస్తా నుండి దండెపెల్లికి (16 కి.మీ), అక్కడి నుండి పెద్దయ్య గుట్ట వరకు (8 కి.మీ) ఆటోలో తీసికెళ్లిన జగ్గారావు కూడా తన కొడుకుతో పాటు మాతో వచ్చాడు. పెద్దయ్య గుట్ట దండకారణ్యంలో భాగమైన సత్మాల కొండల్లో ఉంది. ఈ కొండలు గోదావరి నది ఎడమ ఒడ్డున తూర్పు పడమరలుగా ఉంటాయి. ఇక్కడి అడవుల్ని, జంతువుల్ని రక్షించడానికి ప్రభుత్వం 1985లోనే 893 చ.కి.మీ.ల వైశాల్యంలో కవ్వాల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది.


జీడి వాగులో ట్రెక్కింగ్ పెద్దయ్యగుట్ట చూడ్డానికి ఒక నిటారు స్తంభంలా కనిపిస్తుంది. ఎత్తు సుమారు వేయి అడుగులుంటుంది. గుట్ట చుట్టూ అంతే ఎత్తైన కొండల వరుసలు వలయాకారంగా ముసురుకొని ఉండడంతో ... అవన్నీ దాటుకొని వెళ్లేంతవరకు పెద్దయ్యగుట్ట మనకు కనిపించదు. గుట్టకు ఈశాన్యంగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిగుండంలో పుట్టి ఒక సెలయేరు పారుతున్నది. ఆ నీళ్లు నిజంగానే జీడి రంగులో ఉన్నాయి. దోసిళ్లలోకి తీసుకోగానే స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి. తాగితే తియ్యగా ఉన్నాయి. వనమూలికలు కలిసిన నీరు కదా! ఈ సెలయేరు పచ్చని చెట్ల గుబుర్ల మధ్య ఒక కి.మీ. పొడవున పారుతూ తెల్లని దారిలా కనిపిస్త్తుంది.

ఆ సెలయేరు వెంటే, దాని గలగల శబ్దాలు వింటూ ఒక కి.మీ. దూరం ఉత్తరం వైపు నడిస్తే ఏరుకి ఇరువైపులా పొడవాటి చెట్లు మనకు నేత్రానందాన్ని కలిగిస్తాయి. ఆ ప్రాంతంలో సీజనల్‌గా పుట్టే ఒక చెట్టు తీగతో చేసే మందు ఎంతటి తలనొప్పినైనా, తీవ్రమైన పార్శ్వపు నొప్పినైనా శాశ్వతంగా నివారిస్తుందట. అయితే ఈ తీగను గుర్తించి సేకరించడం అక్కడి స్థానిక గోండులు, నాయకపోడ్‌లకు మాత్రమే తెలుసట. ఆ తీగ దొరికే పరిసరాల్లోనే ఇంతకు పూర్వపు గోండు పూజారి సమాధి ఉంది. దాన్ని దాటగానే ఒక నీటి గుండం కనిపిస్తుంది. ఇక అక్కడి నుండి పవిత్ర స్థలం. పాదరక్షలు లేకుండానే ముందుకు సాగాలి. కొన్ని అడుగులు ఉత్తరం వైపు నడిచాక ప్రధాన గుండం వస్తుంది.

ప్రధాన గుండంలోకి పది అడుగుల ఎత్తు నుండి ఒక జలపాతం దుముకుతోంది. దాని కింద కేరింతలు కొడుతూ స్నానం చేయడం ఒక మధురమైన అనుభూతి. ఆ జలపాతపు నీరే అభిషేకానికి, వంటావార్పులన్నింటికి ఉపయోగిస్తారు. దాని కింది గుండం ఎంత ఎండాకాలం కూడా ఎండిపోదట. అక్కడి అటవీ జంతువులకు అదే ప్రధాన నీటి వనరు.

పెద్దయ్య ఇల్లారి
ప్రధాన గుండానికి పడమటి దిక్కున పెద్దయ్య దేవుని గుడి ఉంది. దీనిని స్థానికంగా ప్రజలు దేవుని ఇల్లారి అంటారు. అది గోడలు లేని గుడిసె. అందులో ఒక గద్దపై దక్షిణాభిముఖంగా ఏనుగులు, ఎద్దులు, గుర్రాలు, పులుల మట్టిబొమ్మలు అనేకం రెండు అంగుళాల ఎత్తునుండి రెండున్నర అడుగుల ఎత్తు వరకు ఎన్నో సైజుల్లో ఉన్నాయి. అవన్నీ ఎన్నో ఏండ్ల నుండి భక్తులు సమర్పించినవే. టెర్రాకోట బొమ్మలుగా పిలివబడే ఈ కాల్చిన మట్టిబొమ్మలు రెండున్నర వేల ఏళ్ల నాటివి. ఇక్కడికి సమీపంలోని కోటిలింగాల, రాయపట్నం, కర్ణిమావిడి తదితర గ్రామాల్లో అనేకం లభించాయి.

పరిసరాలు - చరిత్ర
పెద్దయ్య అంటే పాండవాగ్రజుడు ధర్మరాజు. అతని తమ్ముడు భీముడు గోండుల ఆడపడుచు హిడింబిని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆ ప్రదేశం ఇప్పుడు 'పెండ్లి మడుగు'గా ప్రసిద్ధమై పెద్దయ్య గుట్టకు వెళ్లే దారిలో అడవి ప్రారంభమయ్యే చోట ఉంది. దానికి ఉత్తరాన ఫర్లాంగు దూరంలో 'భీముని ఇల్లారి' ఉంది. ఈ ఇల్లారికి పడమరన ఫర్లాంగు దూరంలో 'అర్జు గూడ' ఉంది. అర్జు గూడ అంటే భీముని తమ్ముడు అర్జునుని పేరున వెలిసిన గిరిజన గూడెం. జీడి గుండానికి పైన ఉత్తరాన కొంతదూరంలో కొండలపైన 'అర్జున లొద్ది' అనే నీటి గుండం కూడా ఉందట.

అర్జుగూడకు దక్షిణాన కి.మీ. దూరంలో సామ్‌గూడ ఉంది. నిజానికి అది 'సహ గూడ'. పాండవుల్లో ఒకడైన సహదేవుని పేర వెలసింది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులపై గెలిచాక సహదేవుడు చేసిన దక్షిణ దిగ్విజయ యాత్రలో 'ఆంధ్రు'లను ఓడించాడని మహాభారతంలో ఉంది. ఇక్కడి గోండుల్లో 'అంధ్' అనే ఒక తెగ ఉంది. ఆనాటి యుద్ధ సమయంలో గోండు ప్రముఖులు తమ వద్ద ఉన్న బంగారాన్ని ఒక బావిలో పడేశారట. ఆ బావిని ఇప్పటికీ కాంచనబావి లేదా బంగారు బావి అని పిలుస్తారు. ఆ బావి అర్జుగూడకు దక్షిణాన ఫర్లాంగు దూరంలో ఉంది. ఆ బావి ఒడ్డున ఒక స్తంభం వింతగా ఊగుతోంది కాని విరగట్లేదు.

గుజరాత్‌లోని ద్వారకా నగరం ఇప్పుడు అరేబియా సముద్రంలో మునిగిపోయింది. మెరైన్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ ఎస్.ఆర్. రావ్ దాని శిథిలాలపై పరిశోధన చేసి భారతంలోని ఆధారాలతో పోల్చి శ్రీకృష్ణుడు క్రీ. పూ. 3102 ఫిబ్రవరి 17వ తేదీన చనిపోయాడని నిర్ధారించారు. దీన్ని నాసా, అమెరికా టైమ్ మిషన్ ధృవపర్చాయి కూడా. కాబట్టి అంతకంటే కొన్ని దశాబ్దాల ముందు పెద్దయ్య గుట్ట ప్రాంతంలో భీమ - హిడింబిల వివాహం, సహదేవుని దిగ్విజయ యాత్ర జరిగి ఉంటాయని అంచనా. పరిశోధనల ప్రకారం చూసినా ఇక్కడ సుమారు 5 వేల సంవత్సరాల పూర్వం నుంచి పాండవులు పూజింపబడుతున్నారన్నమాట. ఇక్కడ పాండవులను 'చిన్నయ్య పెద్దయ్య చిలుకల్ల భీమయ్య' అంటారు.

పెద్దయ్య ఇల్లారిలోని విగ్రహాల ముందు పసుపు, కుంకుమలు, రక్తపు మరకలు కనిపించాయి. దేవుడికి దండం పెట్టి పసుపు కుంకుమలు సమర్పించి గొర్రెలు, మేకలను కోస్తారట. దేవుడికిచ్చే ఆ జంతుబలి వల్ల తమ పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు భావిస్తారు. గోండు పూజారులు లేదా నాయకపోడ్ పూజారులు మంత్రించి ఇచ్చిన పసుపు కుంకుమలను తీసికెళ్లి తమ పంట పొలాలపై చల్లుకుంటారు. తద్వారా తమ పంటలకు కీటకాల బారి నుండి రక్షణ లభిస్తుందని నమ్మతారు.

గుట్టనెక్కేది పూజారే
పెద్దయ్య దేవుడి దగ్గర గతంలో గోండులు పూజారులుగా ఉండేవారట. ఇప్పుడు నాయకపోడ్‌లు పూజారులుగా ఉన్నారు. పూజారి మాత్రమే ఇక్కడి ఇల్లారిలోని దేవుడికి దండం పెట్టుకొని పూనకంతో నిట్టనిలువున్న పెద్దయ్య గుట్టను అవలీలగా ఎక్కుతాడు. అదీ పది నిమిషాల సమయంలోనే. ఎక్కుతున్నప్పుడు రెండు మూడు చోట్ల మాత్రమే మనకు కన్పిస్తాడు. ఇతరులెవరూ ఈ గుట్టను ఎక్కలేరు. గుట్ట ఎత్తును చూసేటప్పుడు రైతుల తలపాగలు (రుమాళ్లు), కళ్లద్దాలు తల వెనక్కి పడిపోతాయి.

పెద్దయ్య గుట్ట పైన దేవగణికలు ఉంటారట. అక్కడి నుండి పూజారి పసుపు కుంకుమలు, సీజన్‌లో పండే పంట గొలుకలను తీసుకొస్తాడు. గుట్ట దిగి ఇల్లారిలోకి వచ్చాక రైతులకు ఆ సీజన్‌లో ఏ రంగు గల ధాన్యం ఎక్కువ పండుతుందో, వర్షా ల స్థితి ఎలా ఉంటుందో, ఏ ఏ పంటలకు ఎలాంటి వ్యాధులు వస్తా యో తదితర విషయాల గురించి జోస్యం చెప్పి వారికి పొలాలపై చల్లుకోమని పసుపు కుంకాలను పంచిపెడతాడట.

అల్లుబండలు
పెద్దయ్య దేవుని ఇల్లారిలోని విగ్రహాల ముందున్న గద్దె పైన వాలీబాల్ సైజులో రెండు గుండ్రటి అల్లు బండలున్నాయి. మన మనసులో అనుకున్న పని అయ్యేటట్టయితే అవి లేవవట. కానట్లయితే లేస్తాయట. అటు ఇటుగా అయ్యేటట్లయితే అవి కూడా డోలాయమానం చెందుతాయి. ప్రయోగాత్మకంగా నేను మనసులో ఒక పని గూర్చి అనుకొని ఒక అల్లుబండను లేపితే మొదట అది లేవలేదు. కొంత ఎక్కువ బలం ప్రయోగించాక డోలాయమానం చెందింది. మరికొంత బలం ప్రయోగించాక మొత్తం లేచింది.

మొత్తమ్మీద నాకేమనిపించిందంటే, ఆ అల్లు బండలు వేల సంవత్సరాలుగా అబద్ధమాడని పూజారుల ఆధ్వర్యంలో ఉంటున్నాయి కనుక వాటికి సత్యశక్తి (మంత్రశక్తి) అయినా ఉండి ఉండాలి. లేదా అయస్కాంతపు బేస్‌మెంట్ (గద్దె)మీద పెట్టిన అయస్కాంతపు రాళ్లు అయినా అయ్యుండాలని. నమ్మితే దైవశక్తి, సూక్ష్మంగా పరిశీలిస్తే శాస్త్ర శక్తి. రెండూ గొప్ప విషయాలే. అనాగరిక గిరిజనులకు అంత శాస్త్ర శక్తి ఉందని అయినా నమ్మాలి.

పెద్దయ్య దేవుని దగ్గరికి పోతే తప్పకుండా పంటలు బాగా పండుతాయనే విశ్వాసంతో చుట్టపక్కల వందలాది గ్రామాల రైతులు ఆయిటి పూనేటప్పుడు (వర్షాకాలం ప్రారంభంలో), పునాసలప్పుడు (విత్తేటప్పుడు), పంట కోతలప్పుడు ఇక్కడికి తప్పకుండా వస్తారట. ఈ మధ్య ఎండాకాలంలో ఇక్కడికి చల్లదనం కోసం వచ్చే యాత్రికుల సంఖ్య కూడా ఎక్కువైంది. దేవుడి ఇల్లారి నుండి సుమారు కి.మీ. దూరంలో ఉండే గజ్జిబండ వరకు ఎక్కడా ఖాళీ స్థలం కన్పించనంత మేర వంటలు చేసుకొని తినిపోతారట. సహజమైన ఒక పెద్ద కొలోజియంను తలపించే ఈ ప్రాంతంలో పర్యాటకులు చేసే కేరింతల శబ్దాలు చుట్టూ ఉన్న గుట్టలకు తాకి వింతగా ప్రతిధ్వనిస్తాయి.
ప్రకృతి సౌందర్యానికి పరాకాష్ట అనదగిన పెద్దయ్య గుట్ట ప్రాంతంలో రైతులకు పరమాత్ముడు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం దీన్ని గుర్తించి అభివృద్ధిపరిస్తే లక్షల మంది పర్యాటకులు ఆనందిస్తారని హామీ ఇవ్వొచ్చు.

- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94406 87250