Tuesday 20 March 2012

TRAVELOGUE ON LAXMIPURAM published in Surya on 20-3-2012

నల్లమలో మరో అహోబిలం లక్ష్మీపురం

అందరికీ తెలిసిన అహోబిలం నల్లమల కొండలకు దక్షిణం వైపు ఉంటే అందరూ తెలుసుకోవలసిన మరో అెబలం అవే కొండలకు ఉత్తరం వైపు ఉంది... అంతే అందమైన ప్రకృతిలో, అంతకంటే ప్రాచీనమైన చరిత్రతో ఇప్పుడు చెబుతున్న మరో అెబిలం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరాబాద్‌ మండలంలో లక్ష్మీపూర్‌ తండకు ఉత్తర వాయువ్యంలో ఉంది. ఇది హైదరాబాద్‌ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో 135 కిమీల తరువాత వచ్చే మన్ననూర్‌ చౌరస్తా నుండి ఎడమ వైపు తిరిగి 21 కిమీ లు ప్రయాణించాక వస్తుంది. పర్యాటకులు పూర్వం భక్తితో మాత్రమే ‘యాత్ర’లకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆటవిడుపు కోసం ‘పర్యటన’లు చేస్తున్నారు. ఇటీవల ఆనందం కోసం, అడ్వెంచర్‌ కోసం, ప్రకృతిలో పరవశించడం కోసం పర్యటించాలను కుంటున్నారు. కాని మనం ఆశించేవన్నీ అందించే పర్యాటక స్థలాలు చాలా అరుదు. అలా అరుదైన స్థలాల్లో ఈ లక్ష్మీపురం నవనారసింహాలయ ప్రదేశం ఒకటి. ఈవారం విహారిలో ఆ విశేషాలు మీకోసం...

దర్శనమ్‌-కమ్‌-ట్రెక్కింగ్‌
DSCN6కొందరికి దైవ దర్శనం ఇష్టం. కొందరికి ట్రెక్కింగ్‌ సరదా. ఇక్కడ మాత్రం దైవదర్శనం చేసుకోవాలంటే ట్రెక్కింగ్‌ చేయ వలసిందే. అలా ఒకేసారి పుణ్యమూ, పురుషార్థమూ కలుగు తాయి. జంట కొండల్లోని పడమటి వైపు కొండ తూర్పు పక్క నిటారుగా ఉంటుంది. దాని ఎత్తు సుమారు రెండు వందల మీటర్లుంటుంది. ఆ రెండు వందల మీటర్లూ రెండు వందల మెట్లను (మధ్య మధ్య సమతలం తప్ప) ఎక్కవలసిందే. ఎందు కంటే, కొండ శిఖరం పైన కూడా రెండు మూడు దర్శన విశేషా లను చూడవచ్చు. ఇక కొండ మధ్యలో అటకలు ఏర్పరచి నట్లుగా పొడవాటి గుహలు రెండు ఒకదానిపై ఒకటి ఏర్పడ్డా యి. ఆ గుహలను వీలునుబట్టి ఎక్కడికక్కడ ఆలయాలుగా తీర్చిదిద్దారు. వీటన్నింటిని ఒక గుహాలయం నుండి మరో గుహాలయానికి ఎక్కుతూ, దిగుతూ చూడాలి.

ఇక కొండ పైన వేల ఏళ్ళనాటి ‘ప్రతాపరుద్ర కోట’ ఉంది. స్థానికంగా ఎవరైనా ఒక పనిని దీర్ఘకాలంగా చేస్తూ ఉంటే వారిని, ‘ఏంటి నువ్వు పటాభద్రుని కోట కడుతున్నట్టున్నవుగా’ అని ఎద్దేవా చేస్తారు. ప్రతాపరుద్ర కోట మొదటి పేరు పటాభద్రుని కోట. అది ఏ నవీన శిలాయుగం (నాలుగు వేల సంవత్సరాల) నుండో నిర్మించబడుతూ వస్తున్నదని దాని మీద లభిస్తున్న పురావస్తు ఆధారాల ఆధారంగా చరిత్రకారులు భావిస్తున్నారు. మనకూ ఆసక్తికరం అనిపిస్తే ఆ కోటగోడ పొడవునా ఎన్ని కిలోమీటర్లైనా ట్రెక్కింగ్‌ చేయవచ్చు. పరిశోధనలు చేసుకోవచ్చు. లోయల్లో పారే చంద్రవాగు, నరసింహులవాగుల వెంట కూడా వాటిపై నుండి వచ్చే చల్లగాలుల్ని ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్‌ చేయవచ్చు. కొండ శిఖరంపై నుండి లోయలోకి చూసినప్పుడు రంగు రంగుల గళ్ళ లుంగీలాగా కనిపించే వివిధ రకాల పంట చేలు కూడా మనల్ని ట్రెక్కింగ్‌ చేయమని టెంప్ట్‌ చేస్తాయి. ట్రెక్కింగ్‌ చేయడానికి ఓపికున్న వారికి ఓపికున్నంత మహదేవ!

తొలి తెలుగు దేవాలయాలు
విష్ణుకుండినుల రాజుల కాలం (క్రీశ 5-6 శతాబ్దాలు) వరకు దేవాలయాలను ఇటుకలతో కట్టేవారు. వారి తరువాతి రాజులు తొలి (లేదా) వాతాపి చాళుక్యులు (క్రీశ 6-8 శతా బ్దాలు) మొట్టమొదటిసారిగా స్పష్టంగా రాతి దేవాలయాలను కట్టించారు. తెలంగాణాలో వారు నాలుగుచోట్ల ఒక్కొక్క దేవుడి పేర తొమ్మిదేసి గుళ్ళను కట్టించారు. అవి... ఆలంపూర్‌లో నవబ్రహ్మాలయాలు, శ్రీశైల ఉత్తర ద్వారం ఉమామహేశ్వరంలో నవలింగాలయాలు, నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం లో నవనంది ఆలయాలు, ఇక్కడి లక్ష్మీపురంలో నవ నార సింహాలయాలు. అయితే ఇక్కడ చెంచుల ప్రాబల్యం ఎక్కువ కాబట్టి నరసింహస్వామికి చెంచులక్ష్మి రెండవ భార్య అయింది. ఈమె పేరు మీదనే ఊరు లక్ష్మీపురంగా ఏర్పడింది.

Aalayamఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు నడుస్తున్నప్పుడు మనకు మొదటి (లేదా పైన ఉండే) అంతస్థు గుహాలయాల్లో నరసింహస్వామి విగ్రహము మొదట కనిపిస్తుంది. దీనికి ఆగ్నేయంలో త్రికూటాలయముంది. మూడు గర్భగుడులు వరుసగా ఉన్నాయి. మధ్య దానిలో హిరణ్యకశిపుణ్ని చీల్చుతున్న నరసింహస్వామి విగ్రహం చాలా అందంగా ఉంది. ఈ ఆలయ ద్వారంపై గజలక్ష్మి పై కప్పుకు పద్మం, ద్వారాలకిరువైపులా పూర్ణకుంభాలుండటం చాళుక్యుల వాస్తుశైలి ప్రత్యేకతలు. స్వామికి ఎడమవైపు గర్భగృహంలో ఆదిలక్ష్మి విగ్రహముంది. కుడివైపున కూడా గత ఏడాది దసరా వరకు చెంచులక్ష్మి విగ్రహం ఉండేదట. ఇప్పుడు లేదు. ఈ గర్భగృహాల పొడవు, వెడల్పు, ఎత్తులు సుమారు నాలుగున్నర నుంచి ఆరు ఫీట్లే.

ఈ ఆలయం నుంచి దక్షిణంగా సాగుతున్నప్పుడు రెండు ఫీట్ల వెడల్పు, ఎత్తు, పది ఫీట్ల పొడవున్న గుహలో ఒక నరసింహస్వామి శిల్పం ఉంది. దాన్ని దాటాక మరో గుహలో వినాయక విగ్రహముంది. అక్కడి నుండి కొండ శిఖరాన్ని ఎక్కాక ఒక పై కప్పు లేని ఆలయంలో ఏడు అడుగుల ఎత్తున్న కాలభైరవుని విగ్రహం గంభీరంగా ఉంది. దేవరకొండ రాజులు భైరవున్ని ఆరాధించారు కాబట్టి వారు ఈ విగ్రహాన్ని పద్నాల్గవ శతాబ్దంలో చెక్కించి ఉంటారు. దాని పక్కనే ప్రతాపరుద్ర కోటగోడ కొండల అంచులను ఆనుకొని కనుచూపు మేర సాగిపోతున్నది. ఆ గోడనెక్కి ఎటు చూసినా పచ్చని కొండలు, లోయలు సోయగాలుపోతూ మనల్ని చూపు తిప్పుకోనివ్వవు. గాలి ఈదర ఒకటి మనల్ని గోడపై నుండి పడేసే ప్రయత్నం చేస్తుంది.

గుహలు గుడులుగా... గుడులు గబ్బిలాల నిలయాలుగా...మహిషాసురమర్దని ఆలయానికి ఉత్తరంలో కొన్ని మెట్లు ఎక్కిన తరువాత కొండలో సుమారు పదిహేను గజాల పొడవు, మూడు గజాల ఎత్తు, లోతులతో ఒక గుహ ఏర్పడింది. ఈ గుహనే ప్రధానాలయంగా మార్చారు. ఇందులో సుమారు రెండు వేల ఏళ్ళ కిందట గర్భగృహం, అంతరాళం, మంటపాలతో వరుసగా మూడు ఆలయాలు కట్టి, వాటిల్లో మధ్యలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి ఇరువైపులా గల గర్భగుడుల్లో ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మిలను ప్రతిష్టించారు. కొంతకాలం తరువాత స్వామికి ఎదురుగా మూడు గదులను కట్టి వాటిల్లో ఇతర నరసింహ రూపాలను ప్రతిష్టించారు. వాటిల్లో ఒకటి వరాహ నరసింహమూర్తి. వరాహం (పంది) చాళుక్యుల లాంఛనం కావడం గమనార్హం. ఇక్కడి లక్ష్మీ విగ్రహాల ముక్కు చెవులకు ఆభరణాలు పెట్టడానికి రంధ్రాలు కూడా తొలిచాడట శిల్పి అని అతని పనితనాన్ని కొనియాడారు స్థానిక చరిత్రకారుడు కపిలవాయి లింగమూర్తి. అంతటి వైభవోపేతమైన గుడులు ఇప్పుడు గబ్బిలాలకు నిలయాలయ్యాయి.

Kondఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా శిల్పకళాశోభితాలైన రెండు నిలువెత్తు ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. అంతే అందమైన ఆరు స్తంభాల ముఖమండపముంది. అంతకంటే దేవతల శిల్పాలు మంటపం ముందు హనుమ, హయగ్రీవ తదితర వాహన దేవతల శిల్పాలు మంటపం ముందున్నాయి. ఇరువురు దేవేరులతో కూడిన రాజు విగ్రహం ముక్కలై పడి ఉండటం చరిత్రకారులకు తీరనిలోటు. ఈ ముఖ మంటపాన్ని కట్టించి, ద్వార పాలకులు, ఆళ్వారుల శిల్పాలను పెట్టించింది క్రీశ 1530 ప్రాంతంలో చింతకుట ప్రభువు రంగ రాయుడు. కారణం, వీటికి ఈ స్థానిక ప్రభువే ఇక్కడికి పొలికేక దూరంలో కట్టించిన రాయనిగండి ఆలయ శిల్పాలతో ఉన్న పోలిక.

ఆలయానికి ఎడమ వైపున అందమైన చతుశ్శిలా మంటపాన్ని, దానికి ఎదురుగా వాగు అవతల బారెడెత్తు ఆంజనేయ విగ్రహాన్ని క్రీశ 12వ శతాబ్దం మధ్య దశాబ్దాల్లో ఈ ప్రాంతాన్ని వశపర్చుకుని అభివృద్ధి పరిచిన ఓరుగల్లు కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు చెక్కించినట్లుంది. ఆయన కోటగోడకు ఇవి సమీపంలో ఉండటం గమనార్హం. ఆలయ శిఖరాన్ని 9ఐఐగీ14ఐఐ, 7ఐఐగీ12ఐఐ అంగుళాల పొడవు, వెడలుపలు గల ఇటుకలతో రెండు విభిన్న కాలాల్లో నిర్మించారు. ఈ ఇటుకలు చాళుక్యులవే.

సినిమా సీన్లు
ఇక్కడి ప్రకృతి అందానికి ఆకర్షితులై ఇక్కడ గత కొద్ది నెలల కింద ‘గతం’ అనే సినిమాకు సంబంధించి కొన్ని పాటలు, ఫైట్లు, సీన్లు కూడా చిత్రీకరించారట. ఆ సినిమా రిలీజైతే అందులో ఇక్కడి అందాలను చూసి ఆనందించవచ్చు. వైశాఖ (మే) మాసంలో వచ్చే నృసింహ జయంతి, సంక్రాంతి తదితర పండుగలకు స్థానికులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారట. కొసమెరుపేంటంటే, తిరిగి వచ్చేటప్పుడు మన్ననూరు గుట్టల మధ్య చేలల్లో చలిలో క్యాంప్‌ఫైర్‌ వేసుకుని, అందులోనే వేరుశెనగ (పల్లి) కాయలు కాల్చుకుని రాత్రి ఏడెనిమిదింటి వరకు వేడివేడిగా తిని ఎంజాయ్‌ చేయడం మేము ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతి. అది సాధ్యం చేసిన రామారావు మేనమామకు కృతజ్ఞులం.

ఇలా ఎన్నో వింత అనుభూతుల్ని అందించే ఈ పర్యావరణ పర్యాటక క్షేత్రానికి ప్రతి ఒక్కరూ వెళ్ళవచ్చు. మొన్నటి శివరాత్రి వరకు... అక్కడి వరకూ పక్కా రోడ్‌ వేయడం పూర్తయింది కాబట్టి ఎటువంటి వాహనంలోనైనా వెళ్ళవచ్చు.

తొలి తెలుగు - కన్నడ శాసనాలు
Narsiమనం మన మూడు తరాల వెనుకటి తాతల రాతలను చూస్తేనే మురిసిపోతాం. అలాంటిది ఏకంగా పద్నాలుగు వందల ఏళ్ళ కిందట పుట్టిన మన మాతృభాష తెలుగు లిపిని చూస్తే... మన ఆనందానికి అవధులు ఉంటాయా! ఆ అవకాశం ఇక్కడుంది. భైరవ విగ్రహం దగ్గర నుండి తిరిగి ఉత్తరం వైపు కొండ దిగుతున్నప్పుడు మధ్యలో మహిషాసురమర్దని ఆలయంగా చెప్పబడుతున్న గుహాలయం కనిపిస్తుంది. దాని ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న రెండు ఎరుపైన స్తంభాలకు ‘త్రైలోకాదిత్య’ అని రాసి ఉంది. ద్వారం కుడివైపు స్తంభానికి అక్షరం కింద అక్షరం రాసిన శాసనంలో కన్నడ లిపి మూలాలు, ఎడమ వైపు స్తంభానికి ఎడమ వైపు నుంచి కుడివైపుకు రాసిన శాసనంలో తెలుగు లిపి (గుండ్రని) మూలాలు కన్పిస్తున్నాయి.

క్రీ.శ. 7వ శతాబ్దం వరకు ఒకే భాషగా ఎదిగిన లిపి అప్పటి నుండి విడిపోయి రెండు వేరు వేరు భాషలుగా రూపాంతరం చెందే తొలి ప్రయత్నాలకు నిదర్శనాలు ఈ శాసనాలు. చాళుక్యులు ఇక్కడి తెలుగు ప్రాంతం నుండి ఎదిగే కన్నడ ప్రాంతంలో రాజ్యస్థాపన చేసి మహారాష్టక్రు కూడా విస్తరించారు. వారి ఈ మూడు ప్రాంతాల పాలనను సూచించే ‘త్రిలోకాల చిహ్నం’ తెలుగు శాసనం కింద చిత్రించబడింది. ఈ శాసనాలను, ఆలయాలను చాళుక్య రాజు రెండవ పులకేశి (క్రీ.శ. 609-642) ఉత్తర భారత సామ్రాట్టు హర్షునిపై విజయానికి సూచనగా గాని, అతని కొడుకు విక్రమాదిత్యుడు క్రీ.శ. 655లో పల్లవులను పారదోలి తమ జన్మస్థానం ‘చాళుక్య విషయాన్ని’ తిరిగి సంపాదించినందుకు నిదర్శనంగా గాని చెక్కించి ఉంటారు.

ఈ చాళుక్యుల జన్మస్థానం ‘అరిమాన్‌ చళ్‌క’ ఇక్కడికి ఆగ్నేయంలో, వీరి కుల దేవత ‘హరితి’ (రేవుల)ఈశాన్యంలో పది-పదిహేను కిలో మీటర్ల దూరాల్లోనే ఉండటం గమనార్హం. హరితి దేవతను స్థానికులు ఇప్పుడు పెద్దమ్మ, దుర్గమ్మ, మరియమ్మ, తదితర రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. విక్రమాదిత్యుని భార్యలు తమ పేర లకే్ష్మశ్వర, లోకేశ్వరాల్లో జైన, హిందూ దేవాలయాలను కట్టించారని వారి శాసనాలు తెలుపుతున్నాయి. ఆ లకే్ష్మశ్వరం ఇక్కడి లక్ష్మీపురమేనేమో?


కొండ కోనల్లో, వాగు వంకల్లో...
సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్లకు పైగా ఎత్తున్న నల్లమల కొండలపైకి మన్ననూర్‌ దగ్గర ఎక్కిన తరువాత 25 కి.మీ.లు ప్రతాపరుద్ర కోటపై ప్రయాణించాక నరసింహుల కొండలు వస్తాయి. నైరుతి వైపు నుంచి ఈశాన్యం వైపు సాగుతున్న ఈ జంట కొండలకు ఉత్తరాన ఒక పొడవై కొండ అడ్డుపడడంతో అవి కలిసిన ప్రాంతంలో రెండు కోనలు (లోయలు) ఏర్పడ్డాయి. అదే ప్రదేశంలో ఉత్తరపు కొండకోనల్లో నుంచి వస్తున్న చంద్రవాగులో జంట కొండల కోనలో నుంచి వస్తున్న నరసింహులవాగు సంగమిస్తుంది. ఇలా కొండలు, కోనలు, వాగులు సుడిగుండంలా సంగమించే లోయలోకి పర్యాటకులు జంట కొండల చుట్టూ తిరిగి పశ్చిమాభిముఖంగా నడిచి చేరుకోవాలి. ఆ సంగమ ప్రదేశంలో మధ్య కొండకొన చాలా ఎత్తుగా ఉంది. దానికి రెండు అంతస్థుల్లో విశాలమైన గుహలు సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. ఆ గుహల్లో విగ్రహాలను ప్రతిష్టించి వాటి చుట్టూ, పైన దేవాలయాలను కట్టారు.


- డా ద్యావనపల్లి సత్యనారాయణ
తెలుగు యూనివర్శిటీ ఆడిటర్‌,
సెల్‌: 9440687250

Monday 12 March 2012

Chinnaiahgutta published in Andhrabhoomi on 11-3-2012

చిన్నయ్యగుట్ట మీద చిత్రమైన చరిత్ర
  • -ద్యావనపల్లి సత్యనారాయణ
గోదావరి నదికి ఇరువైపులా గల ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని గిరిజనులు, వారి ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్లు చిన్నయ్య, పెద్దయ్య. చిన్నయ్య పెద్దయ్య/ చిలుకల్ల భీమయ్య అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో చిన్నయ్య అంటే అర్జునుడు, పెద్దయ్య అంటే ధర్మరాజు, వారితో కూడిన భీముడ్ని పూజిస్తారు అని స్పష్టమవుతోంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలవడానికి కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడు వివాహమాడటంతో స్థానిక గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యాడు. భీముడి కంటే ధర్మరాజు పెద్దవాడు కాబట్టి, అర్జునుడు గొప్పవాడు కాబట్టి వారిని కూడా పూజిస్తారు. ఐతే ఎవర్ని పూజించే చోటనైనా భీముడ్ని పూజించడం తప్పనిసరి. అలా చిన్నయ్య గుడి (ఇల్లారి)లో కూడా మనకు భీముడి చిహ్నాలు, చరిత్రలే ఎక్కువగా కన్పిస్తాయి.
చిన్నయ్య ఇల్లారి ఆదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలంలో ఉంది. ఈ ఇల్లారి ప్రదేశం పవిత్రతకే కాకుండా ప్రకృతి సౌందర్యానికి కూడా పెట్టింది పేరు. హైదరాబాద్ నుంచి సుమారు 230 కి.మీ.లు ప్రయాణించి (కరీంనగర్, చొప్పదండి మీదుగా) లక్షెట్టిపేట చౌరస్తా చేరుకొని, అక్కడి నుంచి 5 కి.మీ.ల దూరంలో వచ్చే వెంకట్రావుపేట మీదుగా 10 కి.మీ లు ప్రయాణించి చెల్లంపేట గూడేనికి చేరుకుంటే దానికి ఒక కి.మీ. దూరంలోనే ఉంటుంది ఈ చిన్నయ్య దేవర స్థలం.
చిత్రమైన విగ్రహాలు
చిన్నయ్య ఇల్లారికి సుమారు రెండు కి.మీ.ల ముందే ఒక సెలయేరు పారుతూంటుంది. అన్ని కాలాల్లోనూ భక్తులు, పర్యాటకులు దీని దగ్గరే ఆగి వంటా వార్పూ చేసుకోవాలి. ఈ సెలయేరు ఎతె్తైన పచ్చని చెట్ల మధ్య నుంచి పారుతూండటం ఒక సుందర దృశ్యం. ఆంధ్రాలోని మారేడుమిల్లి పర్యాటక కేంద్రాన్ని చూసిన వారికి దానితో దీనికి పోలిక కన్పిస్తుంది.
చిన్నయ్య ఇల్లారి తూర్పు అభిముఖంగా ఉన్న ఒక చిన్న గుడిసె లేదా పాక. అందులో మధ్యలో చిన్నయ్య దేవుడిగా చెప్పే నల్లని విగ్రహముంది. దానే్న అల్లుబండ అని కూడా అంటారు. నిజానికి అది గజానమని (వినాయకుని) పోలికలతో ఉంది. దాని చుట్టూ రెండు అడుగుల ఎతె్తైన ఏనుగులు, ఎద్దులు, గుర్రాల బొమ్మలు తమ వీపులపై పల్లకీలను మోస్తున్నట్లుగా గంటలతో అలంకరించబడి ఉంటాయి. ఇవి మట్టితో చేసి కాల్చబడిన టెర్రాకోట్ బొమ్మలు. వీటి వెనుక ముందు కూడా ఇలాంటివి చిన్నచిన్న బొమ్మలు వందల్లో ఉంటాయి. వాటిని భక్తులు తమ కోర్కెలు తీరినందుకు, తమకు సంతానం కలిగినందుకు మొక్కు చెల్లింపుగా చేయించినవి. ఇలా ఇక్కడ చెల్లింపులు జరుగుతాయి. కాబట్టే ఈ ఊరి పేరు చెల్లంపేట అయ్యిందేమో!
చిన్నయ్య ఇల్లారికి ఎడమ పక్కన పెద్దయ్య ఇల్లారి ఉంది. ఇది మొదటి దానికంటే చిన్నగా ఉంటుంది. ఇందులో రెండు అల్లుబండలుంటాయి. మనసులో ఒక పని గురించి తలచుకొని ఒక అల్లుబండను రెండు చేతులతో లేపే ప్రయత్నం చేస్తే ఆ పని విజయవంతంగా జరిగేటట్లయితే ఆ బండ లేవదని, ఆ పని ఫెయిలయ్యేటట్లయితే ఆ బండ అవలీలగా పైకి లేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ అల్లుబండలు/ విగ్రహాల ముందే రైతులు/ భక్తులు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇస్తారు. వాటి రక్తంతో తడిసిన బండారిని (పసుపు) గోండు/ నాయకపు పూజారి మంత్రించి ఇస్తాడు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులు ఆ బండారిని అత్యంత పవిత్రంగా భావించి, తమ పంట పొలాలపై చల్లుకొని, అది కీటకనాశినిగా పనిచేసి తమ పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. నిజంగానే పసుపు కీటకనాశిని కావడం గమనార్హం.
భీముడి చారిత్రక ఆనవాళ్లు
స్థానికంగా గిరిజనులు, రైతుల నోట భీముడికి సంబంధించిన చరిత్ర ఆనవాళ్ల గురించి చాలా వింటాం. మరి వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని ప్రతి విగ్రహాన్ని, రాళ్లను, గుహలను, గుట్టలను సూక్ష్మంగా పరిశీలిస్తూ వెళల్తే ఆశ్చర్యకంగా కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. చిన్నయ్య పెద్దయ్య ఇల్లారుల్లోగల అల్లుబండల/ విగ్రహాలకు ఇరుపక్కలా భీమన్న గదలుగా చెప్పబడే రెండు అడుగుల ఎత్తుగల ఇత్తడి గదలున్నాయి. వాటిల్లో ఒక దానికి భీముడు ఘటోత్కచుని ఎత్తుకున్నట్లున్న చిత్రం కింద హిడింబి చిత్రం చెక్కి ఉంది. ఈ ఇల్లారిల వెనుక రెండు గుహలున్నాయి. అందులో నైరుతి వైపున ఉన్న గుహలోకి కొన్ని గజాల దూరం పాక్కుంటూ వెళితే తరువాత నిలువెత్తు పొడవైన మార్గం కనిపిస్తుంది. అది ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దయ్య ఇల్లారి వరకు సాగుతుందని, పెద్దయ్య చిన్నయ్య మీద ఈర్ష్యతో ఈ మార్గానికి అడ్డంగా రాయి పడేశాడని, లేదు బహిష్టులో ఉన్న ఒక అమ్మాయి ఆ మార్గంలో నడవడంతో ఆ రాయి అడ్డం పడిందని భిన్న కథనాలు విన్పిస్తాయి. నిజమెలా ఉన్నా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుహ ప్రారంభంలోనే దాని పైకప్పును చూస్తే మనకు భీముడు, హిడించి పెళ్లి చేసుకొని సుఖించిన ముత్యాల పందిరికి సంబంధించినవిగా చెప్పబడే గుంజలు, గొడుగు (శిఖర కిరీటం) గుర్తులు కన్పిస్తాయి. మరికాస్త పరిశీలిస్తే చరిత్ర పూర్వయుగ మానవులకు సంబంధించిన చిత్రాలకు మల్లే కన్పిస్తాయి. కాని ఈ గుహలో ఉన్న గబ్బిలాలు, చీకటి సూక్ష్మంగా పరిశీలించే అవకాశాన్నివ్వవు. ఇల్లారికి వాయవ్యంలో ఉన్న గుహలో కూడా చాలా ప్రాచీనమైన విగ్రహాలున్నాయి. కాని అందులో కూడా ఇదే పరిస్థితి.
నైరుతి గుహలోని గుర్తులు గనుక చరిత్ర పూర్వ యుగానికి చెందినవైతే తెలంగాణ చరిత్రకారులకు పండుగే. అవి భీముడికి సంబంధించినవైతే కూడా కావొచ్చు. ఎందుకంటే భీముడు కూడా చరిత్ర పూర్వ యుగానికి చెందినవాడే. ఇటీవల పుష్కర్ భట్నాగర్ అనే ఒక ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి అమెరికా నుండి టైమ్ మెషీన్‌ను దిగుమతి చేసుకొని, అందులో భారతంలో వివరించబడిన ఖగోళ స్థితి వర్ణనలను పొందుపరచి పాండవులు వనవాసం చేస్తూ దక్షిణాదికి (ఆంధ్రప్రదేశ్) వచ్చింది సుమారు క్రీ.పూ. 3150 ప్రాంతంలో అని శాస్ర్తియంగా నిర్ధారించారు. దీన్నిబట్టి ఈ గుహలోని చిత్రాలు 5160 సంవత్సరాల కిందటివని తేలుతుంది.
పాండవులు వనవాసం వచ్చినప్పుడు భీముడు ఇక్కడి స్థానిక గిరిజన యువతి హిడింబిని పెళ్లి చేసుకొని, ఘటోత్కచుడు అనే కుమారుణ్ని కని, ఆమెతో ఉన్నన్నాళ్లు ఇక్కడ ఏదులతో (అడవి దున్నలతో) వ్యవసాయం కూడా చేశాడనేది ఇతిహాసం. అందుకు నిదర్శనంగా మనకు ఈ చిన్నయ్య ఇల్లారి ఉన్న దండెపల్లి మండలంలోనే ఏదులపాడుఅనే గ్రామముందని తెలిపే ఆధునిక శిలాశాసనమొకటి చిన్నయ్య దేవరకు నైరుతి మూలన కన్పిస్తుంది. ఈ ఇల్లారికి వాయవ్యంలో ఒక కిలోమీటరు దూరంలో ఒక పెద్ద పరుపుపై భీముడు ఏదులతో దున్నిన నాగలి కోండ్ర చాళ్లున్నాయి. వాటి కిందుగా భీముడి పాదముద్రలుగా చెప్పబడుతున్న మూడు గజాల పొడవు, గజంన్నర వెడల్పులతో ఉన్న రెండు నీటి గుంటలు కనపడతాయి. వాటిల్లో ఒక గుంట ఒడ్డున భీముడు మలశుద్ధికై కూర్చున్నప్పుడు పడిన అతని కటి కింది భాగపు గుర్తులు, పాదముద్రలు కన్పిస్తాయని చెప్తారు. ఈ గుంటలకు కొంచెం దూరం నైరుతిలో హిడింబి స్నానానికి ఉపయోగించినవిగా చెప్తున్న కుండల ఆకారంలోగల గుంటలు కన్పిస్తాయి. నిజానికి ఈ గుంటల్లో కొన్నింటికి మెట్లు తొలిచిన ఆనవాళ్లు కన్పిస్తాయి కాబట్టి ప్రాచీన కాలంలో ఎవరో వీటిని నీటి సదుపాయాలకు ఉపయోగించు కున్నారనవచ్చు.
భీముణ్ని కొలిచేవారు అందమైన ఏదు కొమ్ములను తలపాగాగా అలంకరించు కోవటం చూస్తూంటాం. భీముడు చంద్రవంశానికి చెందినవాడు. ఈ ప్రాంతంలో సంచరించడానికి ఈ చంద్రవంక జెండాలే దారి చూపుతాయి.
ఇక్కడ సున్నా ఆకారంలో గిరిగీసిన కొండల మధ్య కొలోజియం వంటి ఐదారు వందల ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో రెండు మూడు సెలయేళ్లు పారుతున్నాయి. ఇలా ఈ స్థలం వ్యూహాత్మకంగా ప్రజలను రక్షించే విధంగానూ, వ్యవసాయాభివృద్ధికి దోహదపడే విధంగానూ ఉంది. కాబట్టి ప్రాచీన కాలంలో ఇక్కడ స్థానిక రాజ్యమైనా వర్థిల్లిందంటే నమ్మవచ్చు.
చప్పట్లకు నీళ్లు రాలుతాయా?ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కాని ఇక్కడ మాత్రం మాటలు, చప్పట్ల ప్రతిధ్వనికి నీళ్లు రాల్చే కొండలున్నాయి. అందుకే అవి మంచి కొండలు’, వాటి నుంచి వచ్చే నీళ్లు చల్లగా ఉంటాయి కాబట్టి వాటిని మంచుకొండలుఅని కూడా పిలుస్తారు. ఈ కొండల నుంచి జాలువారే ఒక సెలయేరు
పరిసరాల నుండే సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి ఈ కొండలను చేరుకోవాలి. నీళ్లున్న పరిసరాలలో పచ్చని చెట్లు ఏపుగా పెరుగుతాయి. వాటిని ఆశ్రయించి పక్షులు, జంతువులు జీవిస్తాయి. కాబట్టి మనం వినసొంపైన వాటి అరుపుల మధ్య చిక్కని చెట్ల గుండా సెలయేరును ఆనుకొని నడిచే ట్రెక్కింగ్ ఒక మరిచిపోలేని అనుభూతి.
అలా ఓ అరగంట నడిచిన తరువాత - ఒక కుండ ఆకారంలో కొండల మధ్య ఏర్పడిన లోయ. దాని పొడవు, వెడల్పు, ఎత్తు.. చుట్టు కొలతలు అన్నీ సుమారుగా వందేసి మీటర్లే. ఆ ఇరుకైన లోయలోకి వెళితే మన మాటల స్వరం మారిపోతుంది. కారణం అవి ప్రతిధ్వనిస్తాయి. ఇక మనం గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడితే వాటి ద్వారా వచ్చే ప్రతిధ్వనులు ఆ లోయలోనే చక్కర్లు కొట్టి చుట్టూ ఉన్న కొండల్లో ప్రకంపనలు పుట్టించి వాటిల్లో నిక్షిప్తమైన నీళ్లను బయటికి లాగుతాయి. అలా చప్పట్లకు నీళ్లు రాలుతాయి. ఐతే వర్షాల సీజన్‌లో మాత్రం చప్పట్ల అవసరం లేకుండానే ఆ కొండల మీది నుంచి జలపాతం దుముకుతుంది.
ఈ మంచు కొండలు భీమ - హిడింబిల సయ్యాటలకే కాకుండా క్రీ.శ.1159లో పొలవాస (జగిత్యాల దగ్గర) రాజు రెండవ మేడరాజు, అతని కుమారుడు జగ్గరాజులకు కూడా ఆశ్రయమిచ్చాయి. కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుని చేతిలో ఓడిపోయిన ఈ మేడరాజు రుద్రుడుతన రాజధానిని కాల్చినందుకు బాధపడక ఈ మంచి కొండల్లో ఉన్న వృక్షాలను ఆశ్రయించి ఆనందించాడని రుద్రుని మంత్రి గంగాధరుని హనుమకొండ శాసనంలో ఉంది.
Trekking in Chinnaiah forest

Monday 5 March 2012

TOUR TO 'LONKA' RAMALAYAM PUBLISHED IN ANDHRAJYOTHY ON 4-3-2012

చరిత్ర-పర్యాటకం
'లొంక'లో రామాలయం

'లంక'లో రామాలయం ఉందంటే ఎంత వింతగా ఉంటుందో నిజామాబాద్ జిల్లా 'లొంక'లో ఉన్న రామాలయాన్ని చూస్తే కూడా అంతే వింతైన అనుభూతి కలుగుతుంది.

"ప్రపంచమంతా తిరిగొచ్చాక నా ఇంటి గడప ముందు గాలికి చలిస్తున్న గడ్డిపరక మీది నీటి బిందువును చూసి ప్రపంచపు అందమంతా ఈ బిందువులోనే ఉంది కదా అనుకున్నాను'' అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక కవితలో రాశారు. ఈ కవితను ఆయన సత్యజిత్ రేకు రాసిస్తే ఆయన కూడా గడ్డిపరకలో, నీటి బిందువులో అందాలను చూడడం నేర్చుకుని విశ్వవిఖ్యాతి గాంచిన సినిమాలు తీయగలిగాడు. లొంక రామాలయాన్ని చూశాక మాకు కూడా.. 'అరె ప్రపంచమంతా చూడాలనుకుంటాం. కాని పక్కనే ఉన్న ప్రకృతి అందాలను మాత్రం చూడలేకపోతాం, అలా ఎంతో మిస్ అవుతాం కదా' అనిపించింది.
'లొంక' హైదరాబాద్ నుండి కామారెడ్డి, రథాల రామారెడ్డి, తూంపల్లిల మీదుగా వెళ్తే 150 కిలోమీటర్ల దూరంలో సిరికొండ మండలంలో ఉంటుంది. లొంక గురించి కొద్దిగా విని కుతూహలంతో నేను, మా మామయ్య శుభాకర్, తన ఇద్దరు ఫ్రెండ్స్ నరసింహులు, ఆంజనేయులు కలిసి కామారెడ్డి నుంచి కారులో వెళ్ళాం.
ప్రయాణమే ఒక పరవశం
కామారెడ్డి నుంచి 23 కి.మీలు ప్రయాణించాక అడవి ప్రారంభమవుతుంది. ఆ అడవిలో ప్రయాణించడమే ఒక పరవశం. అంత అందంగా ఉంటుంది ఆ మార్గం. చుట్టూ పచ్చని చెట్లు, వాటి మధ్య వంకలు తిరిగే ఇరుకైన దారి, దారికి అటూ ఇటూ గెంతుతున్న కోతులు, కొండెంగలు. ఇంకా నెమళ్ళ సోయగాలు, పక్షుల కిలకిలలు, అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్న ఆదివాసులు... వీటన్నింటినీ వీక్షిస్తూ కన్నుల పండుగగా సాగింది మా ప్రయాణం. పచ్చని అడవుల్లోని ఆ నల్లని (బ్లాక్‌టాప్) రోడ్డు ఒక వంద మీటర్లు కూడా తిన్నగా సాగదు. వంకలు, ఎత్తు పల్లాలతో గమ్మత్తుగా సాగుతుంది ప్రయాణం. తూంపల్లి క్రాస్‌రోడ్ నుంచి ఏడెనిమిది కిలోమీటర్లు ప్రయాణించాక ఆదివాసుల ఆరాధ్యదైవమైన చంద్రదేవ్ మహరాజ్ గుడి కనిపిస్తుంది. ఆ ప్రదేశం పేరు బుగ్గతాండ. గుట్టల్లో నుండి పెల్లుబుకుతున్న నీటి బుగ్గ సెలయేరుగా మారి ప్రవహించే ప్రాంతంలో ఈ తాండ-గుడి ఉన్నాయి. అక్కడి నుండి కొండపూర్ వెళ్ళాం.

అత్యంత ఎత్తయిన గుట్ట మీద
'లొంక' కొండాపూర్ నుండి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాని మేము ఆ పరిసరాలన్నీ తిరిగి చూడాలన్న ఉద్దేశంతో అక్కడి నుండి కుడివైపుకు తిరిగి తూంపల్లి మీదుగా పాకాల-పందిమడుగు రూట్‌లో ప్రయాణించాం. ఐదు కిలోమీటర్ల తర్వాత గొప్ప దృశ్యం చూశాం. మేము అప్పుడు ఉన్నది జిల్లాలోనే అత్యంత ఎత్తయిన 'రాతిగుట్ట' మీద. అది సముద్ర మట్టానికి 664 మీటర్ల ఎత్తున ఉండడంతో చల్లగాలులు వీచి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. తిరుపతి కొండల మీద ఉన్నట్లే అక్కడ ఎదురుకొండ వేంకటేశ్వరాలయం ఉంది. ఎదురుకొండ ఎంత ఎత్తయినదో ఆ కొండ కొన నుంచి కిందికి చూస్తే తెలుస్తుంది. కొండ కింద విశాలమైన లోయ. ఆ లోయలో అక్కడక్కడా విసిరివేయబడ్డట్లున్న పాకలు (ఇళ్ళు), వాటి మధ్య విస్తరించిన పంట చేలల్లో పనిచేస్తున్న ఆదివాసులు, పశువుల కోలాహలం... కాశ్మీర్ లోయను తలపించింది.

లోయలో ఏడెనిమిది కిలోమీటర్లు ప్రయాణించి చిమన్‌పెల్లి నుంచి సిరికొండ వైపు తిరిగాక మళ్ళీ అడవి తగులుతుంది. ఈసారి అడవి లోయల్లో, వంకల్లో దిగుడు ప్రయాణం. చుట్టూ ఎన్ని టేకు చెట్లో, ఎన్ని సెలయేళ్ళో. ఏ వంద మీటర్లూ తిన్నగా ప్రయాణం చేయలేము. ప్రతి మూలమలుపులో, దేవతా విగ్రహం దగ్గరా, సెలయేటి దగ్గరా ఆగాలనిపిస్తుంది, ఆడాలనిపిస్తుంది, అడవి అందాలను ఆస్వాదించాలనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. సిరికొండ, హుస్సేన్‌నగర్‌లు దాటి మళ్ళీ అడవిలో కచ్చారోడ్‌పై రెండు కిలోమీటర్లు ప్రయాణించాక 'లొంక' వచ్చింది.

లొంక ఒక లంక
'లంక' అంటే చుట్టూ నీళ్ళు ఉన్న ఒక ప్రదేశం అని కదా. ఈ 'లొంక' చుట్టూ సెలయేరు మాత్రమే కాదు, గుట్టల వరుస కూడా ఉంది. రెండు గుట్టల మధ్య నుంచి వెళ్ళి సెలయేరును దాటినాకే ఈ 'లొంక' లోయను చేరుకుంటాం. వాస్తు ప్రకారం కట్టారేమో అన్నట్లుగా లొంకకు దక్షిణ, పశ్చిమాలలో చాలా ఎత్తయిన గుట్టలున్నాయి. ఉత్తరం వైపు ఇనుపరాళ్ళ గుట్టలు ఉంటే, తూర్పు వైపు మామూలు రాళ్ళగుట్టలు ఉన్నాయి. ఆ ఎత్తయిన గుట్టల్లో పుట్టి రామాలయాన్ని చుట్టి జలజలా పారుతున్న సెలయేరులో మూడు నాలుగు కిలోమీటర్లు హ్యాపీగా ట్రెక్కింగ్ చేయవచ్చు. చెట్లమీద గుడ్లగూబలు, చెట్ల కింద చిట్టి ఉడతల సయ్యాటలు, చెట్ల మధ్య కోతుల గెంతులను మన కెమెరాల్లో బంధించుకోవచ్చు. మరీ లోపలికి వెళ్తే మాత్రం ప్రమాదమట. కారణం సెలయేటి నీటిని తాగడానికి క్రూరమృగాలు కూడా వస్తుంటాయట. ఆఫ్‌కోర్స్ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు మాత్రం అడవులు, గుట్టల మీదుగానే ఇక్కడికి వస్తుంటారు. వారి అనుభవం, అవగాహనలు వేరు.

చెట్టు ముందా, వేరు ముందా?
ఆలయానికి ఈశాన్యంలో ఉన్న విశాలమైన స్థలంలో రెండు వింత వృక్ష సమూహాలున్నాయి. ఒకటి- మఱ్ఱి చెట్టు ఏపుగా పెరిగి పెద్ద ఊడను జారేసింది. ఆ మఱ్ఱి కాండము, ఊడ ఒకే సైజులో ఉన్నా యి. ఏది ఊడో, ఏది కాండమో ఎంత గింజుకున్నా గుర్తుపట్టలేము. ఇక రెండవ వృక్షంలో మఱ్ఱి, జువ్వి, చింతచెట్లు పెనవేసుకుని ఉన్నా యి. ఏది ముందు పుట్టి రెండోదానికి ఆశ్రయమిచ్చిందో చెప్పలేము.

గుహ గుడిగా, గుడి గుండంగా...
అన్ని దేవాలయాల్లోనూ ఈశాన్యంలో కోనేరుంటే ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా నైరుతిలో ఉంది కోనేరు. అయితే ఆ కోనేరుకు దేవాలయం కుడివైపు నుండి వెళ్ళి కాళ్ళు చేతులు, ముఖం కడుక్కుని ఎడమవైపు నుంచి తిరిగి రావడంతో మనకు తెలియకుండానే దేవాలయానికి ప్రదక్షిణ చేసినట్లవుతుంది. నిజానికి ఆ కోనేరు గుండం మొదట ఒక గుహ. గుట్టల్లోనుంచి వడివడిగా వస్తున్న సెలయేరు ఒక పెద్ద గుండు మీద నుంచి చిన్న వాటర్‌ఫాల్స్ లాగా దుముకగా దాని తాకిడికి గుండు కిందుగా గుహ ఏర్పడింది. ఆ గుహలో క్రీ.శ. 5వ శతాబ్దంలో విష్ణుకుండిన రాజులు తమ ఇష్టదైవమైన రాముడిని, రామలింగాన్ని (అక్కడివాళ్లు శివలింగాన్ని ఇలా పిలుస్తారు) చెక్కించి గుహ పైభాగంలో (అంటే గుండు మీద) శంఖు చక్రాలను, రామ పాదాలను, విష్ణు నామాలను చెక్కించారు.

ఇప్పుడా రాముని విగ్రహాన్ని గుహ/గుండం నైరుతి మూలలో, లక్ష్మణ, సీత, రామలింగాన్ని గుండం గోడకు వాయవ్య మూలలో చూడవచ్చు. రామబంటు ఆంజనేయుని విగ్రహం గుండం మీద ఆగ్నేయ మూలలో ఉంది. గుండం ఈశాన్యపు ఒడ్డున గల ఒక రాయిపై వినాయకుని విగ్రహం చెక్కి ఉంది. ఆ విగ్రహానికి కిరీటం, జందెం ఉండడం, కింద ఎలుక లేకపోవడం బట్టి అది చాలా ప్రాచీనమైనదిగా భావించవచ్చు. విష్ణుకుండిన రాజులు తమ శాసనాల్లో "శ్రీపర్వతస్వామి పాదాలను, దంతముఖస్వామిని (వినాయకుణ్ణి) ధ్యానించేవాళ్ళము'' అని చెప్పుకున్న మాటలకు నిదర్శనంగా మనం ఇక్కడ సిరికొండ (శ్రీపర్వతం) పక్కనే స్వామి పాదాలను, వినాయకుణ్ణి చూడవచ్చు. స్థానికులు ఈ ప్రాంతాన్ని రాముడు నడిచిన ప్రాంతంగా భావిస్తారు కాబట్టే అందుకు నిదర్శనంగా ప్రక్కనే రామడుగు (రామ+అడుగు) అనే గ్రామం కనిపిస్తుంది. సహజమైన రాయి మీద శేషశయనమూర్తిని చెక్కించడం విష్ణుకుండినుల ప్రత్యేకత. అలాంటి విగ్రహం సిరికొండలో ఉంది.

విష్ణుకుండినుల సాంప్రదాయాలచే ప్రభావితులైన తొలి చాళుక్యులే (క్రీ.శ. 6,8 శతాబ్దాలు) ఇక్కడి గుహాలయాన్ని గుండంగా మార్చినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఆలయంలో గర్భగృహాన్ని మొదట వారే కట్టించి లింగాన్ని ప్రతిష్ఠించి ఉండొచ్చు.
గర్భగుడి పైకప్పు లోపలి భాగాన మాత్రం జైన శైలీ ప్రభావంతో చెక్కిన పంచ వలయాల (కలశ) చిహ్నం కనిపిస్తుంది. బహుశా ఆది జైన మతానుయాయులైన బోధన్ చాళుక్యుల (క్రీ.శ. 8-10 శతాబ్దాలు) అనంతరం అధికారంలోకి వచ్చిన మలి చాళుక్యులు (క్రీ.శ. 10-12 శతాబ్దాలు) తమ పూర్వం రాజుల వాస్తుశైలి నుండి బయటపడక ముందు చెక్కించిన చిహ్నం అయ్యుంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం కనిపిస్తున్న రామాలయపు గర్భగుడి చివరిసారిగా 10వ శతాబ్దంలో కట్టించబడింది అనుకోవాలి. అదే కాలంలో ఆలయంలో ప్రస్తుతమున్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆలయానికి వాయవ్యంలో ఉన్న భైరవుడు, వీరభద్రుని విగ్రహం కూడా అదే కాలానిది.

బహుశా అది జైన మత విధ్వంసానికి పాల్పడిన వీరశైవ మతస్థుల చేత ప్రతిష్ఠించబడినదై ఉంటుంది. కారణం, దాని ముందు జైన మత శైలిలో చెక్కిన చక్ర కలశం పడి ఉండడం. దీని నేపథ్యాన్ని తెలియజేసే ఒక దీర్ఘ శాసనాన్ని మలి చాళుక్యులు గుహ/గుండం పైన చెక్కించారు. కాని దాని ప్రాముఖ్యత తెలియక ప్రజలు దాన్ని శతాబ్దాలుగా తొక్కుతుండడంతో అరిగిపోయింది. ఇలా వేయిన్నర సంవత్సరాల చరిత్ర కలిగి, అంతకుమించిన అటవీ సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ఈ లొంక రామాలయం ఎకో టూరిజం ఇష్టపడేవారికి ఒక వరం. ఈ ప్రాధాన్యాన్ని గుర్తిస్తే రాష్ట్ర పర్యాటక శాఖ ప్రమోట్ చేస్తున్న పర్యాటక స్థలాల్లో ఇది ఒక మణిపూస కాగలదు.

- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
సెల్ : 94406 87250,
dyavanapalli@gmail.com