Tuesday 19 June 2012

రక్షణ లేని రామప్ప! published in Andhrabhoomi on 17.6.2012

  • --ద్యావనపల్లి సత్యనారాయణ

తెలుగుదేశాన్ని పరిపాలించిన అతి గొప్ప రాజవంశం ఓరుగల్లు కాకతీయులదైతే వారు కట్టించిన అతి గొప్ప దేవాలయం నేటికీ నిలిచి ఉన్నది రామప్ప. తెలంగాణలో ఉన్న రెండున్నర వేల ప్రాచీన దేవాలయాల్లో తలమానికమైనది. వాస్తు శిల్పాలకు మాత్రమే కాకుండా పేరిణి, కోలాటం వంటి శాస్ర్తియ, జానపద నృత్యాలకు కూడా చిరునామా రామప్ప. పాడి పంటలకు నిలయమైన రామప్ప చెరువు ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని మరింత నొక్కి వక్కాణిస్తుంది.
రామప్ప నేపథ్యం రామప్ప కట్టడాలు వరంగల్లుకు సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ములుగు మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్నాయి. రామప్ప అనేది ఈ దేవాలయాలను కట్టించిన శిల్పి పేరని కొందరు భావిస్తే కాదు ప్రధానాలయంలోని దేవుని పేరు రామలింగేశ్వరుడు కాబట్టి ఈ దేవాలయానికి రామప్ప అనే పేరు వచ్చిందని మరి కొందరు అంటారు. రాముడు వైష్ణవ మత సంబంధితుడు కాగా, లింగం లేదా శివుడు శైవ మత సంబంధితుడు. ఈ రెండు మతాలను కలిపి రామలింగేశ్వర ఆలయాలను కట్టించడం అనేది విష్ణుకుండినుల కాలం (క్రీ.శ.5వ శతాబ్దం) నుండి వస్తున్న ఆచారం. కాకతీయులు విష్ణుకుండి మాధవవర్మను తమ మూల పురుషుడిగా చెప్పుకున్నారు. కాబట్టి, ఇప్పటికీ రామప్ప ఆలయ అంతరాళంలో విష్ణుకుండినుల సంప్రదాయ శిల్పం సప్తమాతృకల (హారీతి) శిల్పం కన్పిస్తుంది కాబట్టి ఈ దేవాలయ మూలాలు విష్ణుకుండినుల కాలం నుండే ఉన్నాయంటే కూడా నమ్మవచ్చు.
పాలంపేట, ములుగు ప్రాంతాల్లో కొన్నిచోట్ల కొత్త రాతియుగం, రాకాసి గుళ్లు యుగం నాటి మానవుల స్థావరాలు, ఆయుధాలు, పనిముట్లు కూడా లభించాయి కాబట్టి ఇక్కడ వేల సంవత్సరాల క్రితం నుంచే మానవ జీవనం పరిఢవిల్లిందని చెప్పాలి. ఈ వేల సంవత్సరాల చరిత్రకూ రామలక్ష్మణుల చరిత్రతో కూడా సంబంధం ఉంది. క్రీ.పూ.5077 సం.లో వారు ఇక్కడి అడవుల్లో సంచరించారని, ఆ క్రమంలో వారు నీటికొరకై భూగర్భంలోకి శక్తివంతమైన బాణాలు వేసి రెండు వాగులను సృష్టించారని, వారి పేరు మీద వాటి పేర్లు రామప్ప, లక్నవరం చెరువులుగా స్థిరపడ్డాయని శాస్ర్తియ, జానపద పరిశోధనల సారాంశంగా తెలుస్తుంది. ఈ రెండు చెరువులు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఇక ములుగు ప్రాంతంలో దొరికిన ప్రాచీన మానవుల పనిముట్ల ప్రాచీనత ఆధారంగాములుగుపద ప్రాచీనత ఆధారంగా కొందరు చరిత్రకారులు అశ్మక రాజ్యంతో కలిపి పేర్కొనబడిన ములక రాజ్యంఈ ప్రాంతమేనని వాదించారు. ఈ రెండు రాజ్యాలు సుమారు రెండున్నర వేల సంవత్సరాల కిందటి నుండి మనుగడలో ఉన్నాయి. శాతవాహన సామ్రాజ్యంలో ప్రాంతీయ రాష్ట్రాలుగా కొనసాగాయి. శాతవాహన సామ్రాజ్యం కూడా రెండువేల ఏళ్ల నాటిది. ఈ విధంగా ములుగు - రామప్ప ప్రాంతాలకు వేల సంవత్సరాల వైభవ చరిత్ర కూడా ఉంది.
1213 మార్చి 31నాటి కట్టడాలు
 రామప్పలోని ప్రధాన దేవాలయ ఆవరణలో ఉన్న ఒక దీర్ఘ శాసనంలో రామప్ప ఆలయ దేవతలైన శ్రీ రుద్రేశ్వర స్వామికి, కాటేశ్వర, కామేశ్వర సాములకు శాలివాహన శకం 1135 సం. శ్రీముఖ నామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం ఆదివారంనాడు ఈ ఆలయాల నిర్మాత రేచర్ల రుద్రయ్య తన రాజ్యంలోని కొన్ని గ్రామాలను శాశ్వత ధర్మముగా దానం ఇచ్చినట్లు తెలుగు - కన్నడ లిపిలో రాసి ఉంది. శాసనంలో పేర్కొన్న తేదీ క్రీ.శ.1213 మార్చి 31 అవుతుంది. అప్పటికే అన్ని ఆలయాల నిర్మాణం పూర్తయింది.
రేచర్ల వంశీయులు కాకతీయుల సామంతులలో ముఖ్యమైనవారు. ఈ రెడ్ల వంశంలో ఆరవ తరానికి చెందిన రుద్ర చమూపతి అతి గొప్ప వీరుడు. అంతే గొప్ప కళాపోషకుడు. ప్రజాసంక్షేమ పక్షపాతియైన ఆర్థికవేత్త. కాకతీయ రాజుల్లో అతి గొప్ప రాజైన గణపతిదేవుని అతని రాజు కాక మునుపు మహారాష్ట్ర యాదవ రాజు జైతుగి చెర నుండి విడిపించి, ఓరుగల్లు సింహాసనంపై నిలిపి కాకతీయ సామ్రాజ్య స్థాపనాచార్యఅనే బిరుదు పొందాడు. ఈయన వరంగల్లు జిల్లా తూర్పుననున్న ప్రాంతాలను పరిపాలించాడు. ఈయన రామప్పలో తన పేరు మీద ప్రధాన దేవాలయం రుద్రేశ్వరాలయాన్ని కట్టించాడు. ఇందుకు నిదర్శనంగా ఈ ఆలయ అంతరాళపు ద్వారం ఉత్తర భాగంలోరేచర్ల రుద్రుని దంపతులవిగ్రహం చూడవచ్చు. ఇతడే తన తల్లిదండ్రులు కాటయ, కామాంబల పేరు మీద ప్రధానాలయానికి ఉత్తర దక్షిణ దిశలలో కాటేశ్వర, కామేశ్వర ఆలయాలను కట్టించాడు. కామేశ్వర ఆలయాన్ని కొంతమంది కల్యాణ మండపమని పొరపడుతున్నారు. కామేశ్వర ఆలయం పక్కనున్న నరసింహాలయాన్ని పాకశాల అంటున్నారు.
ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న నంది మండపంలోని నంది కాకతీయ శైలికే తలమానికంగా పేరొందింది. ప్రధానాలయం నుంచి దక్షిణంగా రామప్ప చెరువు వైపు వెళ్తున్నప్పుడు రోడ్డుకు ఎడమపక్కన పంట పొలాల్లో రెండు మూడు దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. చెరువు గట్టు పైకి ఎక్కగానే మరో రెండు మూడు దేవాలయాలు కన్పిస్తాయి. గట్టుపైన ఒక ఫర్లాంగు దూరం తూర్పు వైపు నడిచి చెరువు కొనను చేరుకోగానే మరిన్ని దేవాలయాలు జీర్ణావస్థలో కన్పిస్తాయి. ఇలా ఇంకెన్ని దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోయాయో తెలియదు. ఈ దేవాలయాల పేర్లేంటి? వీటిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టించారు? అనే విషయాలు చరిత్రకు అందవు.
శిథిలమవుతున్న ఈ చెరువుగట్టు ఆలయాల వాస్తు శిల్ప వైభవాన్ని నెమరువేసుకుంటే హృదయం చెరువవుతుంది. వాస్తు శిల్పాల వైభవం కాకతీయుల ఆలయాల్లో త్రికూటాలయాలు పేరెన్నిక గన్నవి. అయితే రామప్ప దేవాలయం మాత్రం త్రికూటాలయం కాదు. కాని మూడు ప్రవేశ ద్వారాలున్న ఆలయం. ఆలయం తూర్పునకు అభిముఖంగా ఉండగా ఉత్తర, దక్షిణ దిశల్లో కూడా ప్రవేశద్వారాలున్నాయి. ఇదొక ప్రత్యేకత. ప్రధాన ఆలయంలోకి నంది మండపం నుండి కాటేశ్వర ఆలయం నుండి, కామేశ్వర ఆలయం నుండి ప్రవేశించవచ్చు. ప్రధానాలయంలోకి ప్రవేశించి విశాలమైన రంగ మండపంలోకి చేరుకుంటాం. రంగ మంటపంలో జరిగే నాట్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వీలుగా కూర్చునేందుకు మంటపం మూడు పక్కలా అరుగు గద్దెలున్నాయి. ఇది కూడా కాకతీయ వాస్తు ప్రత్యేకత. రామప్ప ఆలయం ఆరున్నర అడుగుల ఎతె్తైన పీఠంపై నిర్మించబడింది. ఆలయం చుట్టూ పది అడుగుల వెడల్పైన ప్రదక్షిణ పథం ఉంది. ఈ ప్రదక్షిణ పథంలో ఆలయం చుట్టూ తిరుగుతూనే రామప్ప ఆలయ శిల్పకళా చాతుర్యాన్ని వీక్షించవచ్చు.
రామప్ప ఆలయంలో మూడు ముఖ్యమైన శిల్పరీతులు కన్పిస్తాయి. ఒకటి - దేవతా మూర్తుల శిల్పాలు, రెండు - ఊత శిల్పాలు, మూడు - జానపద శిల్పాలు. మొదటి రెండు తరగతులకు చెందిన శిల్పాలు నల్లరాతితో చేసినవి కాగా మూడవ తరగతికి చెందిన శిల్పాలు స్థానికంగా లభించే ఎర్ర రాతితో చేసినవి. దేవతా మూర్తుల శిల్పాలు దేవాలయ అంతర్భాగాల్లో ఉండగా, ఊత శిల్పాలు దేవాలయం చుట్టూ గోడలు, స్తంభాల పైనున్న చూరుని ఎత్తిపట్టుకున్నట్లుగా ఉన్నాయి. ఇలాంటివి ఆలయ మూడు ప్రవేశ ద్వారాలకు రెండు వైపులా రెండేసి ద్వారానికి నాలుగు చొప్పున మొత్తం పనె్నండు నిలువెత్తు శిల్పాలున్నాయి. నృత్య భంగిమల్లో ఉన్న ఈ స్ర్తి శిల్పాలను మదనికలు, సాలభంజికలు, నర్తకీమణులు తదితర పేర్లతో పిలుస్తున్నారు. కాకతీయ శిల్పరీతికే ఇవి తలమానికాలు. ఈ మదనికల వలెనే ఆలయం చుట్టూ 28 గజ-కేసరి (ఏనుగుపై సింహాలు) శిల్పాలున్నాయి. ఇక ఆలయం చుట్టూ గోడలపై వరుసలు వరుసలుగా ఏనుగులు, వివిధ మత శాఖలు, శృంగారం తదితర అంశాలను వ్యక్తపరిచే జానపద శిల్పాలున్నాయి. ఆలయం లోపలి స్తంభాలకు కూడా ఇలాంటి శిల్పాలు చెక్కారు. ఇంకా నిలువెత్తు ఏకశిలా ఏనుగు విగ్రహాలు కొన్ని ప్రవేశ ద్వారాల్లో కన్పిస్తాయి. లేచి పరుగెత్తడానికి సిద్ధంగా ఉందనేట్లు చెక్కిన ఏకశిలా నంది విగ్రహం కాకతీయ శైలికి ప్రతీకగా వెలుగొందింది. అలాగే గర్భ గృహంలోని నాలుగు అడుగుల ఎతైన శివలింగం కూడా కాకతీయ శైలీ ప్రత్యేకతను చాటి చెప్తుంది.
రంగ మంటపం నైరుతి స్తంభానికి చెక్కిన రతీ మన్మధులు, పాల సముద్ర మథనం, వాయవ్య స్తంభానికి చెక్కిన గోపికలు కృష్ణుల మధుర భక్తి శిల్పాలు నాలుగు అంగుళాల ఎత్తులోనే ఎంత అందాన్నీ నైపుణ్యతను వ్యక్తపరుస్తాయో చూస్తేనే అర్థమవుతుంది. నైరుతి, ఈశాన్య స్తంభాల శిల్పాల మధ్య సూది మాత్రమే దూరేటంత సన్నని రంధ్రాలను తొలవడం శిల్పి నైపుణ్యానికి గీటురాయి. అలాగే అంతరాళ ద్వారపు దక్షిణ పక్కనే తాకితే సప్తస్వరాలు పలికే రాతి చెట్టును శిల్పించడం శిల్పి అనన్య సామాన్య ప్రతిభకు తార్కాణం. అయితే ఈ శిల్పం మీదనే ఒక సన్యాసి అంగాన్ని చూషణ చేస్తున్న వ్యక్తి శిల్పాన్ని శిల్పి చెక్కడంలో ఆంతర్యమేమిటో ఇప్పటికీ అంతుబట్టదు.
పేరిణి నృత్య శిల్పాలు
 ఇటీవలి కాలం వరకు ఆంధ్రప్రదేశ్ నాట్యంగా పేరొందింది కూచిపూడి నాట్యం. అయితే దాని చరిత్రను ఎంత శోధించినా, 15, 16 శతాబ్దాల కంటే వెనుకకు పోవడం లేదు అని ప్రముఖ పరిశోధకుడు ఆరుద్ర తేల్చిచెప్పారు. మరి క్రీ.శ. 1213 కంటే ముందే మనుగడలో ఉన్న పేరిణి నృత్యం మనకు కనీసం తెలియను కూడా తెలియకపోవడం విచారకరం. పేరిణి నృత్యం ఒక జానపద లేదా దేశి నృత్యమని చెప్తూ దాన్ని ఒక ప్రత్యేక ప్రకరణంలో వివరించాడు జాయప సేనాని - తన నృత్తరత్నావళిలో. ఈయన గణపతిదేవ చక్రవర్తికి బావమరిది మాత్రమే కాకుండా ఆయన గజ సాహిణి (గజ సైన్యాధిపతి) కూడా. క్రీ.శ.1200ల ప్రాంతంలో రాజకీయ, మత రంగాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాకతీయ రాజ్యాన్ని మహారాష్ట్ర యాదవ రాజులు ఓడించి రాకుమారుడు గణపతిదేవుని బందీ చేశారు. కర్ణాటకలో ప్రజ్వరిల్లిన వీరశైవ మతం ఇతర మతాల హింసను కూడా ప్రోత్సహించింది. వీరశైవ మత ప్రభావం వల్లనే కాకతీయులు జైనం నుండి శైవానికి మారి తెలుగు దేశమంతటా శైవాలయాలు కట్టించారు. ఈ రాజకీయ, మత మార్పులు దేశభక్తిని, దైవభక్తిని వీరరసంతో మేళవించి పెంపొందించాయి. ఫలితంగా పౌరుల్లో.. ముఖ్యంగా యువకులను ఉత్తేజితులను చేయటానికి ప్రేరణఅనే ఒక కొత్త నృత్యరీతి పురుడు పోసుకుంది. ఇది అప్పటికే ఆచరణలో ఉన్న కొన్ని ఆటవిక, జానపద నృత్యరీతులను వీరరస ప్రధానంగా తీర్చిదిద్దగా ఏర్పడింది.
శివుడు నటరాజుగా ప్రతిపాదించిన నాట్యరీతిగా ప్రచారంలోకి వచ్చింది.ప్రేరణఅనే పదం రూపాంతరం చెంది పేరిణి అయ్యింది. పేరిణి శిల్పాలు రంగ మంటపం ఆగ్నేయ స్తంభానికి, ఉత్తర దూలానికి, పై కప్పుకు, అంతరాళ ద్వారానికి ఇరువైపులా చెక్కబడి ఉన్నాయి. స్తంభాలు - చూరుల మధ్య చెక్కిన మదనికల ఊత శిల్పాలలో కూడా కొన్ని పేరిణి తాండవ శిల్పాలే. రంగ మంటపం ఆగ్నేయ స్తంభానికి చెక్కిన ఒక పేరిణి నృత్య శిల్పంలో శివప్రియనాట్య భంగిమ కన్పిస్తుంది. ఈ శిల్పంలో ముగ్గురు స్ర్తిలు నాలుగు కాళ్లతో నాట్యం చేస్తున్నట్లుగా శిల్పించబడ్డారు. మధ్యలో ఉన్న స్ర్తి కుడికాలు తనకు కుడివైపునున్న స్ర్తికి ఎడమకాలు కాగా, ఎడమ వైపున్న స్ర్తికి తన ఎడమ కాలు కుడికాలు అయినట్లుగా శిల్పించబడింది. లేదా ఒకే స్ర్తి వీరరసంతో వేగంగా నాట్యం చేస్తుండగా ప్రేక్షకులకు మూడు రూపాలుగా కన్పిస్తుందన్న భావాన్ని వ్యక్తపరిచాడేమో శిల్పి. రంగ మంటపం ఉత్తర దూలానికి గజాసురుని భక్తికి వశుడై అతని పొట్టలో బంధించబడిన శివుడు ఎనిమిది చేతులతో నాట్యం చేస్తున్న నటరాజుగా శిల్పించబడ్డాడు. ఈ శిల్పంలో కన్పించే కటి వస్త్రం, భుజ కిరీటాలను పేరిణి నృత్య ఆహార్యంలో వాడుతారు. అంతరాళ ద్వారానికి రెండు వైపులా రెండు పొడవైన ఘనాకార శిల్ప పలకలున్నాయి. వీటికి మృదంగాన్ని వాయిస్తున్న వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తున్న స్ర్తి పురుషుల శిల్పాలు అనేకం చెక్కబడ్డాయి. ఇవి పేరిణి శివతాండవానికి చెందిన వివిధ భంగిమలను ప్రతిబింబిస్తున్నాయి. రంగ మంటపం కప్పునకు కూడా పది చేతులతో నర్తిస్తున్న నటరాజ శిల్పం అత్యద్భుతంగా చెక్కబడింది. రంగ మంటపానికి మరో పేరు నాట్య మంటపం. ఈ మంటపం మధ్యలో గుండ్రని ఏకశిలా వేదిక ఉంది. ఈ వేదికపైన దేశంలో పేరొందిన నాట్యకత్తెలు, గణికలు నృత్యం చేసేవారు. వారికి ఆనాడు సమాజంలో చాలా గౌరవం ఉండేది. కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుని భార్యల్లో ఒకామె - మాచల్దేవి. మాచల్దేవి తెలుగు దేశమంతటా ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారిణి. సకల కళావల్లభురాలు. ఈమె ఇక్కడి రంగ మంటపంలో నాట్యంచేసి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.
మదనిక శిల్పాలు పనె్నండు పేరిణీ నృత్య భంగిమలను తెలిపేవే అని వాదించేవారు కూడా కొందరున్నారు. వాటిల్లో ఒక స్ర్తి శిల్పం ఆటవిక నృత్య రీతిని తెల్పేదిగా వుంటే, మరొకటి శాస్ర్తియ నృత్య భంగిమలో ఉంది. ఒక శిల్పం గణిక ఆహార్యంతో రాజసభలో నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడగా, మరొకటి నాగిని నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడింది. ఇటీవలి కాలం వరకు కూడా తెలంగాణలో పెళ్లి మేళాలతో బాజా భజంత్రీలు - సన్నాయిల మోతలకు అనుగుణంగా ప్రత్యేకంగా భూమిపై పాములా పొర్లుతూ నాట్యం చేసే సంప్రదాయం కొనసాగడాన్ని బట్టి నాట్య నాగిని శిల్ప ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ శిల్పాలన్నింటికీ మినీ స్కర్ట్ వంటి కటి వస్త్రం ఉండడాన్ని గమనించవచ్చు. ఒక్క నాగిని శిల్పానికి తప్ప. ఇలాంటి వస్త్రానే్న పేరిణి నృత్య ఆహార్యంగా వాడుతారు. ఒక నర్తకి శిల్పానికి ఎతైన మడమ చెప్పులు (హై హీల్స్) ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక నర్తకి కటి వస్త్రాన్ని ఒక వానరం లాగుతూండగా ఆమె మర్మాంగం బయటపడుతున్నట్లు ఒక శిల్పం చెక్కబడింది. నాగిని నాట్యకారిణి పూర్తిగా నగ్నంగా ఉంది. ఈ శిల్ప అందానికి ముగ్ధుడైన ఒక నిజాం ప్రభుత్వ అధికారి సుమారు వందేళ్ల క్రితం ఈ శిల్పాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడట. పీడకలలు రావడంతో మళ్లీ ఇక్కడికి తెచ్చి పెట్టాడట. ఈ శిల్పం ఇప్పటికీ ఎంతోమంది కవులు, గాయకులు, కళాకారులను అలరిస్తూనే ఉంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె దృష్టినీ ఆకర్షించి ఆయన చేత నాగినివో భోగినివో, నాట్యకళా విలాసినివోఅనే సినిమా పాటను రాయించడం ఈ శిల్ప ఘన చారిత్రకాంశాలలో ఒకటి మాత్రమే. ఎక్కడో విదేశంలో ఉన్న నటరాజ రామకృష్ణ ఇక్కడికి వచ్చి పైన పేర్కొన్న నృత్య శిల్పాలతోపాటు మరెన్నో శిల్పాలను పరిశీలించి, పరిశోధించి, వాటినినృత్తరత్నావళిలోని పేరిణి నృత్య భంగిమలతో పోల్చి చూసి చివరిగా పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించగలిగాడు. దానికి ప్రభుత్వ గుర్తింపు తేగలిగాడు. ఇదంతటికీ రామప్ప శిల్పాలు ఆధారభూతాలు కావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం.
జానపద శిల్పాలు
 జానపద శిల్పాలు అంటే సామాన్య ప్రజల జీవన విధానాన్ని తెలిపేవి మాత్రమే కాకుండా, అంతగా శిల్ప శాస్త్రం తెలియని సామాన్య శిల్పులే చెక్కిన శిల్పాలు అని అర్థం. ఇవి రామప్ప ఆలయం చుట్టూ గోడలపైన ఉన్నాయి. ఆలయం చుట్టూ ఒక వరుసలో ఏనుగులు శిల్పించబడగా, వాటిపైన వరుసలో వజ్రబంధాలు చెక్కారు. ఈ రెండు వరుసల మధ్య వరుసలో వివిధ మతాలకు చెందిన శిల్పాలు, వేట దృశ్యాలు, ఇతర జీవన విధానాలు చెక్కబడ్డాయి. ఆలయం పడమటి వైపున చెక్కిన నాలుగు శిల్పాల్లో మొదటి దానిలో స్ర్తి పురుషుడు ప్రేమించుకోవడం, రెండవ దానిలో పురుషుడు శృంగారానికి ఉద్యుక్తుడవడం, మూడవ దానిలో స్ర్తి ఉద్యోక్తురాలవడం, నాల్గవ దానిలో ఇద్దరూ సంగమించడం శిల్పించబడ్డాయి. జానపద నృత్యాల్లో తెలంగాణలో అత్యంత ప్రధానమైనదీ, ప్రాచీనమైనదీ కోలాటం. ఈ కోలాట దృశ్యాలు అత్యంత మనోహరంగా ఈ దేవాలయ గోడలపై చిత్రించబడ్డాయి. రంగ మంటపపు నైరుతి స్తంభంపై కూడా ఈ కోలాట దృశ్యాలు చెక్కి ఉన్నాయి. మార్చి నెలలో వచ్చే కాముని పౌర్ణమికి ముందు వెనె్నల రాత్రిళ్లలో తెలంగాణలో జాజిరి పాటలతో కోలాటం ఆడి పౌర్ణమినాడు కామ దహనం చేయడం ఆచారంగా వస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. పాడి పంటల ప్రాధాన్యత
కాకతీయ రాజులు స్థానికులు కాబట్టి స్థానిక ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్మాణాలు చేపట్టారు. వాటిల్లో తలమానికమైనవి వారు తవ్వించిన చెరువులు. వారి కాలంలో తవ్వించిన వేల కొలదీ చెరువులను రక్షించుకుంటే చాలు, మన వ్యవసాయ రంగానికి మరో ప్రాజెక్టు కొత్తగా కట్టవలసిన అవసరమే లేదనేది నిపుణుల అంచనా. ప్రజలకు ముందు తిండి కావాలి. ఆ తరువాతే మతం. కాబట్టి రేచర్ల రుద్రుడు రామప్ప గుడి మీదుగా ఒక కిలోమీటరు దూరంలో కొండల మధ్య ఆనకట్ట కట్టించి పెద్ద తటాకాన్ని ఏర్పరిచాడు. దీనికి కూడా రామప్ప చెరువు అనే పేరు వచ్చింది. ఇది ఈ రోజు వరకు కూడా పదివేల ఎకరాల భూమికి సాగునీటిని అందిస్తోంది.
రామప్ప చెరువు గట్టు ఈశాన్య మూలలో పాడి పంటల ప్రాధాన్యాన్ని తెలిపే దేవాలయాన్ని కట్టించారు. అందులో ఇటీవలి కాలం వరకు స్థానికుల చేత వేశ్య గా పిలువబడిన ఒక నగ్న సుందరి శిల్పం ఉండేది. నిజానికది వేశ్యది కాదు అనేది మేధావుల అభిప్రాయం. ఆ శిల్పానికున్న స్తన సంపద, నగ్నత్వం, పాడి పంటలు, సంతాన సృష్టి, అభివృద్ధిలను తెలిపే సంకేతాలు. దురదృష్టవశాత్తు దుండగులు ఈ అందమైన విగ్రహాన్ని నిధి దొరుకుతుందనే ఆశతో ధ్వంసం చేశారు. ఈ చెరువు గట్టు ఆలయంలోని ఒక స్తంభం కింది భాగంలో ఒక శిల్పం ఉంది. అందులో ముగ్గురు స్ర్తిలను నగ్నంగా చెక్కారు. ఒక స్ర్తి కుండలో నుండి పాలను వొంపుతుంటే, మరొక స్ర్తి పంట కంకిని పట్టుకున్నట్లు చెక్కారు. మధ్యలో ఉన్న స్ర్తి పంటను మోసుకొస్తున్నట్లుగా చెక్కబడింది. ఈ విధంగా రామప్ప ప్రాంతం వాస్తు శిల్పకళా కౌశలాలకే కాదు, కాసులు పండించే పంటల వృద్ధికీ నిదర్శనంగా నిలుస్తుంది.
శిథిలం కావడానికి కారణాలు
సుమారు వంద సంవత్సరాల కాలం రాజ పోషణకు, ప్రజాదరణకు నోచుకున్న రామప్ప ఆలయాలు పధ్నాల్గవ శతాబ్ద ప్రారంభంలో కాకతీయ రాజ్యంపై దండయాత్రలు చేసిన ఢిల్లీ సుల్తానుల విధ్వంసకాండకు గురైంది. నాలుగైదుసార్లు అలాంటి దండయాత్రలు జరిగాయి. నీటిపై తేలే ఇటుకలతో నిర్మించిన ఆలయ గోపురం ముస్లింల దాడిలో ధ్వంసమైంది. ఇక్కడి విగ్రహాలు విచ్ఛిన్నమయ్యాయి. అయితే రామప్ప ఆలయాలు శిథిలమవడానికి ఇతర కారణాలు కూడా లేకపోలేదు. ఆలయ నిర్మాణంలో ఇసుక పునాదులను ఉపయోగించడం కాకతీయ వాస్తు శైలి ప్రత్యేకత. అయితే ఇసుక పునాది మీద నిర్మించిన బరువైన ఆలయం వత్తిడికి ఇసుక ఇటు అటు జరిగి, కిందికి మీదికి జారిపోయి ఆలయం కుంగిపోవడానికి కారణమయ్యింది. గత ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న చిన్నచిన్న భూకంపాల తాకిడికి కూడా గురైన ఇసుక పునాది ఆలయ కుంగుదలకు అవకాశమిచ్చింది. వర్షపు నీరు పునాదిలోకి ఇంకటం వల్ల కూడా ఆలయం కుంగింది. ఆలయం మీదుగా ఉన్న రామప్ప చెరువు నీటి బరువు కూడా ఆలయ పునాది మీద ప్రభావం చూపింది. ఫలితంగా ఆలయం కుంగి, స్తంభాలు, పైకప్పు, గోడలు పగుళ్లు చూపాయి. కొన్నిచోట్ల విరిగిపోయాయి కూడా.
ఇక ఈ మధ్య చోటు చేసుకుంటున్న మానవ తప్పిదాలు రామప్ప కట్టడాలకు మరింత ముప్పును తెచ్చిపెడుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప ఆలయాల పక్కనే పెద్దపెద్ద బాంబులు పేల్చడం, భూగర్భంలో సొరంగం తీయడం, గ్రానైట్ పేలుళ్లు మొదలైనవి రామప్పకు ఆగర్భ శత్రువులుగా పరిణమించాయి. ఈ మధ్య ఈ ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలున్నాయని నిర్ధారణ అయ్యింది. బొగ్గు కోసం రామప్ప కింద చేసే సొరంగాలతో రామప్ప శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
పునరుద్ధరణ ప్రయత్నాలు
రామప్ప ఆలయాలను కట్టించిన రేచర్ల రుద్రుడే ఇక్కడ వేయించిన శాసనంలో ఎవరికైనా తాము శత్రువు కావచ్చు కాని ఈ ఆలయం కాదు కాబట్టి దీన్ని ధ్వంసం చేయకూడదు అని వేడుకున్నాడు. అయినా ముస్లిం సైన్యాలు చేసిన విధ్వంసకాండల్లో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. అయితే మరో ఆరు వందల సంవత్సరాల తరువాత మళ్లీ ముస్లిం రాజే (నిజాం) సుమారు వంద సంవత్సరాల క్రితం రామప్ప ఆలయాలను పునరుద్ధరించేందుకు పూనుకున్నాడు. 1914లో ఏర్పడిన పురావస్తు శాఖ ఈ ఆలయాలను వీలైనంతగా పునరుద్ధరించింది. 1932లో పింగళి వెంకట రామారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కాకతీయ ఉత్సవాలు జరిగాయి. తత్పర్యవసానంగా వెలువడిన కాకతీయ సంచికలో ఈ ఆలయాల ప్రాధాన్యం గురించి తెలుగు ప్రపంచానికి మొదటిసారిగా తెలిసింది. 1944లో ఆలయంలో పూజారులను నియమించారు. మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఈ ఆలయం దర్శనీయత గురించి ఇంగ్లీషులో రాసి ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో 1966లో ప్రచురించి ప్రపంచానికంతటికీ తెలియజేశాడు.
నటరాజ రామకృష్ణ రామప్ప శిల్పాలను అధ్యయనం చేసి పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించి, 1985 ఫిబ్రవరి 17 శివరాత్రి నాడు ఇక్కడ వేల మంది సమక్షంలో తన శిష్య బృందంతో పేరిణి నృత్య ప్రదర్శన చేశాడు. తిరిగి 1991లో జరిగిన కాకతీయ ఫెస్టివల్‌లో భాగంగా ఫిబ్రవరి 25న తన శిష్యబృందంతో పేరిణి నృత్య ప్రదర్శన ఇప్పించాడు. భారత పురావస్తు శాఖ పూనా నుండి తేలికైన ఇటుకలను తెప్పించి ఆలయ శిఖరాన్ని పునర్నిర్మించి, పైకప్పును బాగుపరచి, ఆలయ పునాదుల్లోకి వాన నీరు ఇంకకుండా ప్లాస్టరింగ్ చేయించింది. 2013లో ఇక్కడ ఆలయం కట్టి ఎనిమిది వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామప్ప చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసింది. పర్యాటకుల వసతి, తిండి కోసం వసతి గృహాలను, రెస్టారెంట్లను కట్టించింది. ఇవి ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయి.
మధ్య ఇక్కడ కొన్ని సినిమాలు తీయడంతో రామప్ప మరింత వెలుగులోకి వచ్చింది. రామప్పకు ఇటీవల ఏర్పడిన ప్రమాదాలపై పోరాడిన రామప్ప పరిరక్షణ కమిటీకృషి మేరకు ప్రభుత్వం నియమించిన కమిటీ రామప్పకు నిజంగానే ప్రమాదం పొంచి ఉందని, ప్రమాద నివారణకై కృషి చేయాలనితన రిపోర్టులో ప్రభుత్వానికి సూచించింది. రామప్ప పరిరక్షణ కమిటీ సాధించిన ఈ చిన్న విజయాన్ని పురస్కరించుకుని 1985లో నటరాజ రామకృష్ణ నిర్వహించినట్లుగానే ఈ నెల 17న రామప్పలో పదివేల దివ్వెల జాతరను నిర్వహించనుంది. రామప్ప పరిరక్షణకు తరలిరండి
రామప్ప కట్టడాలకు 800 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్వహించబోయే ఉత్సవాలకు ముందు రామప్ప పరిరక్షణ కమిటీ ఆందోళనలు నిజమేనని, రామప్ప కట్టడాలను పరిరక్షించాలనిచెప్పిన నగేశ్ (ఎన్‌జిఆర్‌ఐ) నివేదిక రావడం హర్షించాల్సిన విషయం. అయితే రామప్ప పరిరక్షణకు కృషి చేసిన ప్రజల పాత్రని గుర్తించకుండా, వారి భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా జిల్లా యంత్రాంగం ఈ ఉత్సవాలను నిర్వహించడం సరికాదు. ఎన్‌జిఆర్‌ఐ సమర్పించిన 2500 పేజీల నివేదిక చారిత్రకమైనది. దాన్ని అమలుపరచవలసిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపైన ఉంది. రామప్ప పరిరక్షణోద్యమం ఇంతటితో ఆగేది కాదు. రేపు రామప్ప పరిసరాల్లో నేలలో నిక్షిప్తమైన బొగ్గు తవ్వి తీయడానికి ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు ఇంకా పెద్ద ప్రమాదం ముంచుకు వస్తుంది. ఊళ్లకు ఊళ్ళు ఆనవాళ్లు లేకుండా పోయే పెనుముప్పు నుంచి కూడా రక్షించుకునే బృహత్ ప్రణాళికలను కూడా మనం రచించుకోవాలి. మానవ తప్పిదం కారణంగా భారీ ఎత్తున జరిగే ప్రమాదం నుండి రక్షింపబడిన రామప్ప విజయోత్సవ సభ జరపాలని ప్రజా సంఘాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా జూన్ 17 ఆదివారంనాడు రామప్ప ప్రాంగణంలో కట్టడం పరిరక్షణ - జాగ్రత్తలపై ఒక సదస్సు నిర్వహించి, జాతి సంపద ఐన రామప్ప కట్టడాలను, పరిసరాలను శుభ్రం చేసి, పదివేల దివ్వెల జాతరను నిర్వహించాలని రామప్ప కట్టడాల పరిరక్షణ కమిటీ తలపెట్టింది. ఈ ప్రజా విజయోత్సవ సభకు వేలాదిగా తరలివచ్చి రామప్ప పరిరక్షణోద్యమ స్వరంతో గొంతు కలుపవలసిందిగా కోరుతున్నాం. -ప్రొ.జయధీర్ తిరుమలరావు, అధ్యక్షుడు, రామప్ప పరిరక్షణ కమిటీ.
శిల్పుల నైపుణ్య సమగ్రత
         గణపతిదేవుని కాలంనాటి కొండపర్తి శాసనం కాకతీయ శిల్ప నిర్మాణ సామర్థ్యాన్ని కింది శ్లోకంలో వర్ణించింది. ప్రాకారోజయతి త్రికూటమ్ అభితస్తల్ తేన నిర్మాపితః సుశ్లిష్టైః క్రమశీర్షకై రుపచితో నీలోపలైః కల్పితః యశ్చా లక్షిత సంధిబంధ కథనాదేకశిలా తక్షకైః సంతక్ష్యేవ మహీయసీమ్ ఇవ శిలాం యత్నాత్ సముత్తారితః (నల్లని రాళ్లను సమానంగా నున్నగా చెక్కి, సన్నిహితంగా కూర్చి నిర్మించిన త్రికూట ప్రాకారం విలసిల్లుతూ ఉంది. అతుకుల గీతలు కనిపించకుండా ఏకశిలా నిర్మితంగా భాసించే ఈ ప్రాకారాన్ని మహా ప్రయత్నంతో శిల్పులు నిర్మించారు) కాకతీయ దేవాలయాల శిల్పుల నైపుణ్యం ఇటువంటి సమగ్రతను సంతరించుకుంది. ఇందుకు అతి గొప్ప నిదర్శనం పాలంపేటలోని రామప్ప దేవాలయం. -డా.పి.వి.పరబ్రహ్మ శాస్ర్తీ, ‘కాకతీయులురచయిత
స్వతంత్ర రీతికి చెందిన శిల్పాలు
నిజానికి కాకతీయ శిల్పంలో ఏది నృత్య శిల్పం? ఏది కాదు? అని తేల్చి చెప్పటం కష్టం. అలా తేల్చటానికి సాంకేతికంగా కొన్ని ఆధారాలున్నా కళాదృష్టితో చూస్తే, కాకతీయ శిల్పం అంతా అందమైన, లయాన్వితమైన నృత్య శిల్పమనే అనుకోవాలి. ఉదాహరణకు, ఎర్రరాతిలో ఏమంత ప్రాధాన్యత లేని స్థలాల్లో చెక్కిన అలంకార శిల్పంలోని సింహం నడుము మీద నిల్చుని ఒక చేత కత్తి, మరోచేత ఢాలు ధరించి వున్న స్ర్తిమూర్తి యుద్ధం చేస్తున్నట్లూ ఉంటుంది. అదే సమయంలో నృత్యం చేస్తున్నట్లూ ఉంటుంది. రూపకల్పనలో గాని, జీవ చైతన్య స్ఫురణలోగాని కాకతీయ శిల్పాలు స్వతంత్ర రీతికి చెందినవిగా స్పష్టంగా చెప్పుకోవచ్చును. దేశంలోని మరే శిల్పరీతినీ వీటితో పోల్చి చూడగల అవకాశం ఇవ్వని విధంగా ఇవి రూపొందాయి. -చలసాని ప్రసాదరావు, ‘కాకతీయ శిల్పంరచయిత
 తెలుగు శిల్పుల కళారాధన
రామప్ప గుడిలోని స్ర్తిమూర్తులు దాదాపు మానవ సహజ ఎత్తు కలిగి, పరిమిత అలంకరణములతో అలరారుచున్నవి. ఇవన్నియు నల్లని రాతితో మలచబడినవి. నల్లని కఠిన శిలలు ఆ అమర శిల్పుల చేతిలో నల్లని వెన్నగా, మైనముగా మారినవా! కర్రతో సైతము ఇంతటి పనితనమును ప్రదర్శించుట కష్టమే! అలాంటప్పుడు ఆ శిల్పుల నైపుణ్యం, అంకిత భావము, చిత్తశుద్ధి ఎంత గొప్పదో కదా! ఈ విగ్రహములలోని ఏ అంశమునకు ఆ అంశము ఎంతో స్పష్టంగా ఉన్నవి. ఉదాత్తతకు ఏ వంక పెట్టలేని విధముగా మలచబడినవి. వీని వొంపులు, సొంపులు, ఇంపులు, పట్టుపుట్టములు, నగలు, నఖశిఖ పర్యంతము ప్రతి అంశములో తెలుగు శిల్పుల కళారాధన పరాకాష్టత నందుకొనిన విధమును, తెలుగు యువతుల సౌందర్యమును పవిత్ర దృష్టితో దర్శించి ప్రశంసించవలసినదే కాని వర్ణించుట ఎవరి తరము కాదనుటలో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు. ఆ శిల్పుల ఉలి విన్యాసము, హృదయము అంతటి గొప్పవి. వీని అమరికలో చూపబడిన నైపుణ్యమూ అద్భుతమే మరి! ఉపగ్రహము ద్వారా సేకరించబడిన ఛాయాచిత్రము గుడి ప్రాంతములో నేల పగులును సూచించుచున్నది. ఈ గుడి రక్షణను గూర్చి అందరూ ఆలోచించి రక్షించుకోవాలి. ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించి ఆదుకోవాలి. అందుకు వెంటనే ముమ్మర ప్రయత్నం చేయాలి.
-మందల మల్లారెడ్డి, ‘రామప్పగుడిరచయిత
ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలు పట్టించుకుంటారు
ప్రజలు, పర్యాటకులు, కళాభిమానులు రామప్పను కేవలం ఒక దేవాలయంగా కాక ఒక సాంస్కృతిక కేంద్రంగా భావిస్తారు. అలాంటి సాంస్కృతిక చిహ్నానికి దేవాదుల ప్రాజెక్టు అండర్‌గ్రౌండ్ కాలువ పనుల వల్ల, భూగర్భ బొగ్గు గనుల తవ్వకాల వల్ల ముప్పు వాటిల్లుతున్నది. ఈ పనులు చేస్తున్న వారు ఈ కట్టడాల పరిరక్షకులైన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అనుమతి తీసుకోకపోవడం, ఇంత జరుగుతున్నా ఆర్కియాలజీ వారు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం. రామప్ప కట్టడాల పట్ల ప్రభుత్వ శాఖల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసించి ప్రజలే తమ వారసత్వ చిహ్నాన్ని రక్షించుకునేందుకు సిద్ధం కావాలి. -వేదకుమార్, తెలంగాణ రిసోర్స్ సెంటర్
అత్యున్నత సంస్కృతికి ప్రతీక
మధ్యయుగాలలో యావత్ తెలుగుదేశాన్ని ఒక్క త్రాటిపైకి తెచ్చి ప్రజల సుఖ సంతోషాలే లక్ష్యంగా ఆదర్శన పాలన నెరిపింది కాకతీయ చక్రవర్తులు. వారు కట్టించిన అత్యద్భుత నిర్మాణాలు వరంగల్ కోటలోని స్వయంభూ దేవాలయం వంటి వాటిని దురదృష్టవశాత్తు మనం చూడటానికి నోచుకోలేక పోయాం. ఇక వారి సామంతుడు రేచర్ల రుద్రయ్య పాలంపేటలో కట్టించిన రామప్ప దేవాలయమే వారి అత్యున్నత సంస్కృతికి ప్రతీకగా నిలిచి ఉంది. దీనిని మనం దర్శించి, పరిరక్షించి మన భావి తరాలకు ఈ వాస్తు శిల్ప వారసత్వాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వమూ ప్రజల ప్రతినిధే కాబట్టి ఈ అద్భుత నిర్మాణ పునర్వైభవం కోసం కృషి చేయాలి. -ప్రొ.అడపా సత్యనారాయణ, చరిత్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం
కళల కాణాచికి కరువాయె ఆదరణ
సాహిత్యం, నృత్యం, వాస్తు శిల్పాలు, ఆర్థిక వ్యవస్థలు మొదలైన కళలు వర్థిల్లిన రామప్ప కట్టడాలకే ప్రభుత్వ పనితీరు ఎసరు పెడితే ఇక పట్టించుకునే నాథుడెవరు అని మిన్నకుండిపోయే పరిస్థితి పోయింది. ప్రజలు చైతన్యవంతులయ్యారు. తమ జాతి వారసత్వ సంపదను సంరక్షించుకోవలసిన బాధ్యతను వారు గుర్తెరిగారు. అందుకొక నిదర్శనమే ఈ నెల 17న రామప్పలో జరుగుతున్న పదివేల దివ్వెల జాతర. -జూలూరి గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక.

No comments:

Post a Comment