మరో ఎత్తిపోతల
Updated : 8/17/2014 12:02:59 AM
Views : 133
ఎవరైనా ఎత్తిపోతల జలపాతం ఎక్కడుందంటే ఠక్కుమని నాగుర్జునసాగర్ దగ్గరుందని చెప్తారు. కానీ, మెదక్ జిల్లాలోని జహీరాబాద్ దగ్గర కూడా అదే పేరుతో మరో జలపాతముంది. ఆ సంగతి మీకు తెలుసా?
అందరికీ తెలిసిన ఎత్తిపోతల జలపాతం రాతి గుట్టల మీది నుంచి దూకితే మనం తెలుసుకోబోతున్న ఈ జలపాతం రాతిమట్టి గుట్టల మీది నుంచి దూకుతుంది.
ఈ ఎత్తిపోతల జలపాతం మూడు జలపాతాల సముదాయం. ఉత్తరం నుంచి దక్షిణం వైపు వడివడిగా ప్రయాణిస్తున్న వాగు ఒక జలపాతంగా మారగా, దీనికి కుడివైపు నుంచి జలజల పారుతున్న ఏరు మొదటి జలపాతం ప్రవాహంలోకి దూకుతున్నది. ఈ రెండు జలపాతాలు మళ్ళీ కలిసిపోయి ఒకే ప్రవాహంగా మారి కొద్దిదూరం ఎత్తయిన మట్టి గుట్టల మధ్య ప్రవహించి, అక్కడ చదునైన 30 మీటర్ల వెడల్పైన బండమీది నుంచి 40 అడుగుల లోతు లోయలోకి దూకుతాయి. పచ్చని ఇరుకైన లోయలో కనిపించే ఈ దృశ్యాలు మనోహరమైన అనుభవం పంచుతాయి. అన్నట్టు, ఈ జలపాతం పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది.
ఇక్కడకు వస్తే, మట్టి గుట్టల మధ్య చిక్కుకుపోయినట్లు కనిపించే చెరువు, భూమి నుంచే ఇటుక రాళ్ళను చెక్కుకొని వాటితోనే ఇళ్ళు కట్టుకోవడం, మెట్ట పంటలు, చిన్నచిన్న తండాలు...ఈ విశేషాల మధ్య జరిపే ప్రయాణం ఆకర్షణీయంగా ఉంటుంది.
ఆసక్తి, సమయం ఉన్నవారు పక్కనున్న మొగ్డంపల్లి మీదుగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గొట్టంగుట్ట అనే మరో పర్యాటక స్థలాన్ని కూడా దర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్ళేవారు దారిలో నందికందిలో నక్షత్రాకార శివాలయం (వెయ్యేళ్ళ నాటిది) చూడవచ్చు. దేశంలో మొట్టమొదటి శాస్త్రీయ పట్టణమైన సదాశివపేటనూ దర్శించవచ్చు.
ఇప్పటికి మన రాష్ట్రంలోని ఒకే ఒక ఆర్గానిక్ హోటల్ జహీరాబాద్‌లోనే ఉంది. కాబట్టి, అక్కడ ఆర్గానిక్ ఫుడ్ లాగించేయొచ్చు. ప్రత్నామ్నాయంగా పర్యాటకాభివృద్ధి సంస్థ వారి హరిత హోటల్ కూడా అక్కడే ఉంది.
ఇలా వెళ్ళాలి: ఈ ఎత్తిపోతల హైదరాబాద్‌కు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎటునుంచి వచ్చేవారైనా ముంబై రహదారిలోని జహీరాబాద్‌కు రైలులోగాని, బస్సులో గాని, ప్రైవేటు వాహనంలోగాని చేరుకోవచ్చు. ఆ తరువాత 10 కిలోమీటర్లు మాత్రం ప్రైవేటు వాహనాలు లేదా ఆటోలే శరణ్యం. జహీరాబాద్ రైల్వే ట్రాక్ దాటిన వెంటనే ఎడమ వైపుకి తిరిగి హోతి-బి, పర్వతాపూర్, ఉప్పుతాండలు మీదుగా మన ఎత్తిపోతలను చేరుకోవచ్చు.
ద్యావనపల్లి సత్యనారాయణ, 94909 57078
No comments:
Post a Comment