Tuesday 27 November 2012

Matsyagiri published in namasthetelangaana on 25-11-2012

మరో యాదగిరి... మత్స్యగిరి
- డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ
chepa-aakaarapu-saalagraamaమత్స్యం అంటే చేప కదా! మత్స్యగిరి చేప ఆకారంలో ఉంటది. కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. అయితే మత్స్యగిరి దగ్గరనున్న పొట్టిగుట్ట దగ్గర్నుండి వెళ్తే ఈ గిరి అచ్చంగా చేప ఆకారంలో కనిపిస్తది.
మత్య్సగిరిని వేములకొండ పల్లె పరిసరాల నుంచి సగం వరకు ఎక్కగానే ఒక ప్రాచీన శిలా ద్వారం కనిపిస్తది. ఆ ద్వార బంధానికి ఒక చేప శిల్పం చెక్కి ఉండటం మరో విశేషం. ప్రస్తుతం శిథిలమైనప్పటికీ ఆ శిల్పం సుమారు మూడడుగుల పొడవుంటది.

మత్స్యగిరి శిఖరాక్షిగాన చిన్నపాటి చెరువుంది. ఈ చెరువూ ఒక వింత. సాధారణంగా పెద్ద పెద్ద కొండల్లో ఇంకిన వర్షపు నీరు పారి కొండల కింద చెరువు లేర్పడతాయి. కానీ పైన చెరువుండటం నిజంగా వింతే! దీన్నే భక్తులు ‘భగవంతుని లీలా మహత్మ్యం’ అంటున్నరు.

ఈ చెరువులోని చేపలు మరో ముఖ్య విశేషం. ఇందులో ఉండేవన్నీ ఒకే రకపు చేపలు. అవన్నీ ఒక పరిణామంలో...సుమారు అర మీటరు పొడవుతో చిన్న డాల్ఫిన్లలాగా దొమ్మరి గంతలు వేస్తూ కనిపిస్తయి. వాటన్నింటి తలమీద మూడేసి విష్ణు నామాలుంటయి. ఇది మరీ ఆశ్చర్యానందాలకు గురి చేసే అంశం. ఎందుకంటే, ఇదివరకెప్పుడూ మనం ఇలాంటి నామాల చేపలను చూసి ఉండం!

laxminarasimha-svaamiఅయితే, ఈ చేపలుండే గుండం నిజానికి మూడు గుండాల సముదాయం. వీటి పేర్లు నామాలగుండం, విష్ణు గుండం, మాల గుండం. నీటి మట్టం పెరిగినప్పుడు ఇవి మూడూ కలిసిపోయి నైరుతి నుంచి ఈశాన్యం వైపు అర్ధచంవూదాకారపు వంపు తిరిగిన ఒకే గుండం లాగా కనిపిస్తయి. ఈ అర్ధ చంద్రకారపు గుండం మధ్యలో అంటే గుండం పడమటి ఒడ్డున...నీటి అంచున ఆరడుగుల పొడవైన చేప విగ్రహముంది. ఈ విగ్రహం చేప పల్టీ కొట్టేటప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు తిరిగినట్లుగా కనిపిస్తది. చేప మఖం మాత్రం తూర్పువైపుకు తిరిగి ఉంటుంది.

ఈ విగ్రహం చుట్టూనే 1991లో ఆలయం కట్టారు. గుండంలో నీటిమట్టం పెరిగినప్పుడు ఈ చేప సాలక్షిగామం నీటిలో తేలియాడుతున్నట్లు కనపడుతుందని అక్కడి పూజారి లక్ష్మణాచార్యులు చెప్పారు. ఈయన ఈమధ్య ఈ మత్స్యగిరి స్థలపురాణం, ఇటీవలి చరివూతను కూడా నిక్షిప్తం చేసే పనిలో ఉన్నరు. జిన్నం అంజయ్య అనే మరొక కవి కూడా ఈ మధ్యనే మత్స్యగిరిపై శతకం రాసి ప్రచురించారు.

మత్స్యగిరి పైన వృద్ధులు, రోగిష్టులు కనిపించడం సాధారణం. కొండ కిందికి ప్రయాణిస్తున్నప్పడు పైకి వెళ్తున్నప్పుడు రోగులు కనిపిస్తుంటరు. విచారిస్తే పైన కొన్నాళ్ళుంటే చాలు ఎంతటి క్లిష్టమైన రోగాలైనా నయమవుతాయని చెప్తరు. దేవుడి మహితో పాటు నీటికి కూడా రోగాలను నయం చేసే శక్తి ఉందన్నది ఇక్కడికి వచ్చేవాళ్ల విశ్వాసం.

నిజానికి కూడా భూ ఉపరితలం పైన నాలుగైదు వందల అడుగుల ఎత్తున ఉన్న ఈ మత్స్యగిరి ఆలయం పైకి స్వచ్ఛమైన, చల్లని గాలులు వీస్తుంటయి. మత్స్యగుండం కూడా కాలుష్యానికి దూరంగా ఉండి స్వచ్ఛమైన నీటికి ఆలవాలంగా ఉంది. ఇటీవలి కాలం వరకూ ఈ గుండంలో ఉన్న తామర చెట్ల ఆకులు కూడా ఆ గుండంలోని మలినాలను, సూక్ష్మజీవులను గ్రహించి నీటిని పరిశుద్ధంగా ఉంచేవి. కాబట్టి, అంటువ్యాధులను వ్యాపింపజేసే సూక్ష్మక్షికిములకు దూరంగా ఈ మత్స్యగిరిపై కొంతకాలం ఉండి, పరిశుద్ధమైన నీటిని తాగితే రోగాలు నయమవుతుండేవని చెబితే నమ్మడానికేమి అభ్యంతరం ఉండదు! ఇక ఈ మత్స్యగుండం నీటిని తాగిన వారికి సంతానమయ్యేదని, పంట పొలాలు, చేలపై చల్లుకుంటే కీటకాలు నశించి పంటలు బాగా పండేవని కూడా స్థానికులు చెబుతుంటరు.

కొచ్చెగుట్టపైన కూడా ఒక మడుగు (గుండం) ఉంది. ఈ గుట్టను ఎక్కితే మంచి ట్రెక్కింగ్ ప్రాక్టీస్ అవుతది. ఇక్కడి మడుగులో రాయి వేస్తే భిన్నమైన శబ్ధం వస్తుంది. బహుశా గుట్ట నిలువునా లోతైనా బావిలాంటి గుండం ఉండడం వల్లనేమో...అలాంటి శబ్దం వస్తది. ఈ గుండం నీటిలో స్నానం చేస్తే చర్మ రోగాలు నయమవుతాయంటారు.

ఇక మాలగుట్ట గుహల్లో కూడా ఒక చిన్న గుంట ఉంది. ఆ గుంటలో నీరును మనం తీసిన కొద్దీ అంతే పరిమాణంలో నీరు మళ్ళీ ఊరడం విశేషం.

matsyagunDam-teeraana-aalayప్రస్తుతం మత్స్యగిరిపై కనిపిస్తున్న, ఆలయ మంటపాదులు 1977 నుంచి నిర్మించబడుతున్నవే. అయితే, ఈ గిరి పరిసరాల్లో కనిపిస్తున్న శిథిల ఆలయాల చరిత్ర మాత్రం వేల ఏళ్ల వెనకాలది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయానికి దక్షిణంగా గుట్టను సగం దిగాక కనిపిస్తున్న శివాలయం చాలా ప్రాచీనమైంది.
ఎక్కడైనా ప్రాచీన ఆలయాలు పూర్తిగా రాతితో గాని, ఇటుకలతో గాని నిర్మించబడుతయి. ఈ శివాలయం గర్భగృహానికి మాత్రం మూడు వైపులా పవేశ దిశ మినహా) ఇటుకల గోడలున్నయి. వాటి లోపల రాతిగోడలున్నయి. ఈ ఇటుకల పొడవు, వెడల్పులు 14X10 అంగుళాలు.

14 అంగుళాల పొడవున్న ఇటుకల వాడకం సుమారు 1400 సంవత్సరాల కిందట ఉండేదని తెలుస్తోంది. ఈ ఇటుకల గుడి వాస్తు నిర్మాణ శైలిని బట్టి ఇది ఆనాడు ‘జైనుల మందిరం’ అని తెలుస్తోంది. ప్రత్యేకించి ఇది శ్వేతాంబర జైనులది. శ్వేత అంటే తెల్లని అని అర్థం. స్థానిక ప్రాకృత తెలుగు భాషలో ‘వలి’ అంటే తెల్లని అని అర్థం. దగ్గర్లోని వలిగొండ అనే ఊరు ఆనాడు శ్వేతాంబర జైన ప్రాబల్యమున్న ఊరే అయ్యుంటుందని భావిస్తున్నరు. పక్కనే వేముల కొండ ఉంది. వేములు అంటే కూడ జైనులే. ఆ పక్కనే మునిపంపుల అనే ఊరుంది. ‘మునులు’ అంటే జైన మతానికి చెందిన ఋషులు. మత్స్యగిరి పక్కనున్న మాలగుట్ట పైనా జైనుల గుహలున్నయి.

జైనులు తమ మతానికి ప్రతీకగా చేపను చూపుతరు. మీననాధుడు అనే ప్రఖ్యాతి చెందిన సిద్ధుడు కూడా జైనుడే. 24 మంది జైన తీర్థంకరుల్లో ఒకరికి ప్రతీక చేపనే. జైనులే మాల, మాదిగలకు ఆలయ ప్రవేశం కల్పించారు. కాబట్టి ఇక్కడ మాలగుట్ట, మాలగుండం, మాదిగగుండం లాంటివి కన్పిస్తున్నయని భావించవచ్చు.

మత్స్యగిరి వెళ్లాలంటే...
ప్రయాణ మార్గంలో చౌటుప్పల్ నుండి ఇరుపక్కలా మూడు రంగుల్లో కొండలు ఆకర్శిస్తయి. అవి పొట్టివి, పొడవైనవి, ఎత్తెనవి. తెల్లనివి, నల్లనివి, పచ్చనివి. ఇలా అన్నేసి కొండలు రంగురంగుల్లో కనిపిస్తుంటే ప్రయాణం మార్గంలోనే ఒక విశిష్టమైన భావన హృదయాలను పావనం చేస్తుంది. ఇక వలిగొండకు చేరుకునే ముందు మనకు కుడివైపున కనిపించే ఎత్తైన కొండల శిఖర ప్రదేశాల్లో శిలా తోరణాలూ కన్పిస్తయి. ఇలాంటి ఒక శిలా తోరణాన్ని తిరుపతిలో చాలామంది చూసే ఉంటరు. ఇక్కడ మాత్రం అలాంటివి మూడు తోరణాలు కనిపించి మనల్ని ముగ్దుల్ని చేస్తయి.

వలిగొండ దగ్గర కొండల మధ్య పారే ‘మూసీ’ హైదరాబాద్‌లో కనిపించినట్లుగా మురుగు నది కాదు, ముచ్చటైన నది. అంతేకాదు, ఇక్కడి పచ్చని చెట్లతోకూడిన లోయ మార్గం మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తది. గోధుమ వర్ణపు రాళ్ళపై నుండి తెల్లని నురగలు కక్కుతూ పారే ఆ నదీ సోయగం చూడవలసిందే. మూసీ పక్కనే వలిగొండ - అరూరుల మధ్యన ఉన్న చెరువు అందమూ ఆస్వాదించదగిందే. ఈ చెరువు పెద్దదే. ఇందులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే మరీ బాగుంటది. అయితే, మత్స్యగిరి ఎక్కిచూస్తే మన చుట్టూ గొలుసు కట్టు చెరువులు ఏడెనిమిది కనిపిస్తయి.

వలిగొండ చెరువును దాటిం తర్వాత గుట్టలు వింత ఆకారాలతో మనల్ని తన్మయుల్ని చేస్తయి. మొదటగా చెరువు ఒడ్డున కనిపించే చిన్నగుట్ట అందం మనల్ని కట్టి పడేస్తది. అందుకు కారణం...చెరువుపై నుంచి వీచే చల్లగాలులకు అది కేంద్రం కావడమే కాదు, దానిపైన ఉన్న వేయేళ్ళ నాటి ప్రాచీన చెన్నకేశవాలయం సౌందర్యం ఆ చెరువులో ప్రతిఫలించడం!

ఆరూరు దాటిన తర్వాత మత్స్యగిరికి మళ్ళే ముందు రోడ్‌పై నిల్చుని చూస్తే కనిపించే గుట్టల అందం అజరామరమైంది. ‘మాలగుట్ట’, ‘మత్స్యగుట్ట’ల మధ్య గుండ్రని ఎత్తైన ‘కొచ్చెగుట్ట’ పానవట్టంలోని శివలింగం లాగా సహజ సౌందర్యంతో శోభిల్లుతోంది.

మత్స్యగిరిపైకి ఇటీవల ఒక దాత గార్లపాటి సురేందర్‌డ్డి కోటి రూపాయలతో వేయించిన ఘాట్ రోడ్డు పచ్చని చెట్లమధ్య పారే నల్లని తాచుపాములాగా వంకర టింకరగా మెలికలు తిరుగుతూ మనల్ని అలరిస్తది. ఈ రోడ్డుకు వ్యతిరేక దిశలో...పశ్చిమం నుండి మత్స్యగిరి పైకి ఇప్పుడిప్పుడే నిర్మాణమవుతున్న రోడ్డు ఎర్రని మట్టితో గిరి అందానికి మరో రంగును అద్ది ఆకర్శింపజేస్తున్నది.

మత్స్యగిరికి తూర్పు - పడమర పాదాల్లో ఉన్న పల్లెలు వేములకొండపల్లె, ఆరూరుపల్లె, వాటి పరిసరాల పంటచేలు, తాటిచెట్లు, పశువుల మందలు - ఇవన్నీ గిరి ఔన్నత్యం ముందు చిన్న అంశాలుగా కనిపిస్తూ, మనకు విమానం లోంచి కిందికి చూస్తున్న అనుభూతిని కలిగిస్తయ్.

ప్రస్తుతం కనిపిస్తున్న శివాలయం మొదట జైన బసది కాగా సుమారు 12వ శతాబ్దంలో..అంటే కాకతీయుల కాలారంభ దశలో శివాలయంగా మార్చబడిందని దాని వాస్తు శైలిని బట్టి తెలుస్తోంది. ఈ ఆలయ మంటపం చూడదగింది. ఆలయంలోని శివలింగం ప్రస్తుతం ఆలయానికి ఎదురుగా ఉత్తరంలో ఉన్న సహజ కోనేరులో పడి ఉంది. నంది విగ్రహం మత్స్యగుండంలో మునిగిపోయింది. ప్రధానాలయానికి ఉత్తరం దిశలో ఈ మధ్యనే హనుమాన్ ఆలయం కట్టారు. ప్రధానాలయానికి ఎగువన (పడమర) తొలి చాళుక్యుల నాటి నకీ.శ. 600 ప్రాంతం) ఆలయముంది. కాగా, ప్రధానాలయానికి ముందున్న కోనేరుకు ఎదుట తూర్పు దిశలో పెద్ద 16 కాళ్ళ నవరంగ మంటపాన్ని కడుతున్నరు. టోల్‌గేట్ దగ్గర సీతారామాలయం ఈ మధ్యనే పూర్తయింది. ఈ ఆలయం వెనుక, దీనికి చేరే ముందు ఒకప్పటి ప్రాచీన ప్రవేశ మార్గాలు ఇప్పుడు శిథిలమైనా ఆసక్తిని రేకెత్తిస్తున్నయి. అక్కడ సత్రాలున్నయి.

మత్స్యగుండంలోని చేప ముఖం ఉగ్ర నరసింహుని రూపంతో ఉండడం గమనార్హం.
నిశ్చయంగా ఈ ప్రాంతం జైన మత ప్రాబల్యం గలదని చెప్పే శిలాశాసనం ఒకటి ఇక్కడికి దగ్గరలోని సైదాపూర్‌లో లభించింది. అందులో అగ్గలయ్య అనే ఒక జైన శస్త్రచికిత్సకారుడు ఈ ప్రాంతంలోని ముచ్చనపల్లి, ఇక్కురికి అనే గ్రామంలో రెండు జైన బసదులను (మఠాలను) కట్టించాడని, ఆయనకు పశ్చిమ చాళుక్య రాజ్యంలో రాజుతో సమానమైన గౌరవం ఉందని రాసి ఉంది. ఈ రెండు బసదులకు స్థానిక గౌండు నగామాధికారి) క్రీ.శ. 1034 జూన్ 4వ తేదీన రెండు గ్రామాల భూములను దానం చేశాడు. ప్రస్తుతం మత్స్యగిరి పై ఉన్న శివాలయం, పొట్టిగుట్ట పైనున్న ఆలయాల నిర్మాణం ఆనాటి జైన బసదుల నాటిదే అంటున్నరు. శాసనంలో పేర్కొనబడ్డ ముచ్చనపప్లూయే తరువాతి శతాబ్దాలలో మత్స్యగిరి అయ్యింది.

పూర్వం ఒక వేటకాడు. మత్స్యగుండంలోని చేపలు పట్టి కూర వండుకోవడానికై వాటిని కోయగా అవి మళ్ళీ అతుక్కుపోయాయని వినిపించే స్థానిక కథ వెనుక కూడా అంతటి శస్త్ర పరిజ్ఞానం కలిగిన అగ్గలయ్య వంటి మేధావుల నేపథ్య కృషి ఉంది. అలాంటి వారే పాదరసంతో మత్స్యగుండం వంటి నీటి గుండాలను గుట్ట బండలపై కూడా ఏర్పరిచారని, ఒక ప్రత్యేకమైన చేప బ్రీడ్‌ను సృష్టించగలిగారన్నట్లు గౌరన ‘నవనాథ చరివూత’ ద్వారా తెలుస్తోంది. మత్స్యగుండంలోని చేప ముఖం ఉగ్ర నరసింహుని రూపంతో ఉండడం ఈ సందర్భంగా గమనార్హం.

మత్స్యగుండంలో చిన్న పెడల్ బోట్లను, వలిగొండ - అరూర్‌ల మధ్యనున్న పెద్ద చెరువులో మరబోట్లను ఏర్పాటు చేసి, దగ్గరలోని మూసీ నది వెంట ట్రెక్కింగ్ మార్గాన్ని కల్పిస్తే మత్స్యగిరి ఒక మంచి ‘ఎకో- టూరిజం స్పాట్’ కాగలదనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఇంతటి అపూర్వ దర్శనా స్థలం ఉండటం నిజంగానే విశేషం.

వ్యాసకర్త చరిత్ర పరిశోధకులు, ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌లో క్యూరేటర్, మొబైల్: 94909 57078

1 comment:

  1. Biggest Venture by Vedasri Developers :
    This property of plots location is at Arrur near historical temple Sri Matsyagiri hills this is a great place

    with spirituality of sri Laxmi Narsimha Swamy, the fishes in the historical pond on the hill are very special

    and god gifted with Swamy namam.

    All the plots in the 100 acres venture are DTCP approved with drainage, current, tap and water tank system

    including very big parks and waterfall, Sarawathi temple, Anjaneya temple.


    Contact our sales experts for any further enquiries 9515117195

    Plots rate started from 2500/- sq yrd to 3500/-


    https://www.facebook.com/vedasridevelopers
    https://twitter.com/vedasridevelope
    https://www.linkedin.com/in/vedasri-developers-196b25117?trk=nav_responsive_tab_profile
    https://plus.google.com/115454908343747432750
    https://www.youtube.com/channel/UCE69dL0mF9hj-GCasegQSsg

    ReplyDelete