Monday 5 September 2011

My Tour to ''Loddi'' published in Sunday Booklet of Sakshi Daily on 28.8.2011

నల్లమల అడవుల్లో ఒక వింత ‘లొద్ది’


హిమాలయ పర్వతాల తర్వాత దక్షిణ భారతీయులు పవిత్రంగా భావించే కొండలు నల్లమలలు. నల్లమల అంటేనే పవిత్రమైన కొండలు అని భాషావేత్తలు పద వ్యుత్పత్తి చెప్పారు (నల్ల=పవిత్రమైన, మల=కొండ). ఈ కొండలు, అడవులు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని అయిదు జిల్లాల్లో 3,568 చ.కి.మీ. మేర విస్తరించాయి. ఇవి దేశంలో రెండవ పెద్ద అడవులు.

ఇంతటి ప్రాధాన్యం గల ఈ అడవుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ గుట్టల్లో ఒక వింత లోయ ఉంది. దాన్ని స్థానికులు ‘లొద్ది’ అని, ‘గుండం’ అని, ఆ ప్రాంతాన్ని ‘నీలగిరి’ అని పిలుస్తారు. ఆ గిరి సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తున ఉండటం వల్ల అక్కడ చల్లగా ఉంటుంది. ఎత్తయిన గుట్టలు, అడవులు, సమీపంలోని కృష్ణానది, జలపాతాలు, నీటి గుండాలు... ఆ ప్రాంతానికి మరింత శోభను చేకూరుస్తాయి.

లోయలోకి ట్రెక్కింగ్:
లొద్ది అనే ఈ ప్రదేశం హైదరాబాద్‌కి 145 కిలోమీటర్ల దూరంలో, శ్రీశైలానికి 60 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్-శ్రీశైలం హైవేలో ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్లేటపుడు ‘నేచర్ ట్రెక్’ అనే బోర్డు కనిపించగానే, అక్కడి నుండి కుడివైపుకి సాగిపోవాలి. ఆ మలుపును ‘పులి మడత’ అంటారు. అలా ఒక పావు కిలోమీటరు నడవగానే ఒక కిలోమీటరు లోతైన లోయ కనిపిస్తుంది. గుండె నిబ్బరం లేనివారికి ఆ లోయని చూసి కళ్లు తిరుగుతాయి కూడా. అయితే అడ్వెంచర్ ట్రెక్కింగ్, నేచర్ వాక్ ఇష్టపడేవారికి ఆ లోయ మార్గం ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.

మేము వెళ్లినరోజు ఏకాదశి. ప్రతి యేటా ఆ పండుగ రోజు అక్కడ జాతర జరుగుతుంది. అడవిమార్గం గుండా ఒక ఫర్లాంగు దక్షిణం వైపు వెళ్లి, పడమర వైపుకి తిరిగి లోయలోకి దిగాలి. అలా అరగంట తర్వాత లోయ అడుగు భాగానికి చేరుకున్నాం. అక్కడి ధారవాగు ఒడ్డున నిలబడి పరిసరాలను చూస్తే, ఒక ఎత్తయిన కొండ అడుగున ఉన్న అనుభూతి కలిగింది.

ధారవాగు నుండి తూర్పు వైపుకి తిరగగానే ఓ గుహ కనిపిస్తుంది. కిలోమీటరు ఎత్తయిన గుట్ట నుండి గొడుగులాగా ఒక దరి పడమటి వైపుకి పొడుచుకొచ్చి ఉంటుంది. ఆ దరి కింద సుమారు రెండు వేల మంది మసలవచ్చు. దాని ముందర విశాలమైన గుండం ఉంది. కొంతకాలం క్రితం వరకు ఆ గుండంలోకి వంద మీటర్ల ఎత్తు నుండి ఒక జలపాతం దుమికేది. కాని ఇప్పుడు ఆ జలపాతపు నీటిని స్థానికులు చెరువుల్లోకి మళ్లించుకుపోవడంతో అదృశ్యమైంది. గుండం ఒక పెద్ద బండరాయి మీద ఏర్పడటంతో వందలమంది అందులో స్నానం చేస్తున్నా నీరు మాత్రం మురికి కావడం లేదు.

మల్లికార్జున లింగం
గుండం నుండి ఉత్తరం వైపు సాగితే మల్లికార్జున ఆలయం ఉంటుంది. ప్రాచీన ఆలయం శిథిలం కాగా, ఆ ఇటుకలతోనే ‘ఎల్’ ఆకారంలో దక్షిణం, తూర్పు వైపు రెండు గోడలు కట్టారు. మల్లికార్జున లింగం పడమర వైపు చూస్తుండగా, దాని ఎదురుగా నంది విగ్రహం ఉంది. సమీపంలో కొద్దిగా తల చెదిరిన వినాయక విగ్రహం ఉంది. భక్తులు కొబ్బరికాయలు కొడుతుండటంతో ఆ ప్రాంతమంతా చిత్తడిగా తయారవుతోంది.

మల్లికార్జున దేవుణ్ణి త్వరగా చేరడానికి వీలుగా అచ్చంపేట పట్టణ ప్రముఖులు 1953లో రైలు పట్టాలతో చేసిన 20 మెట్ల నిచ్చెనను గుట్ట నుండి గుహలోకి వేశారు. కాని అది కాస్త ప్రమాదకరంగా కనిపిస్తుంది.

గుహలో గుహ
భక్తులంతా లింగస్వామిని దర్శించుకుని వెనుదిరిగి వెళ్తున్నారు. కాని మేం ప్రకృతిని కొద్దిసేపు ఆస్వాదిద్దామని చుట్టూ చూస్తుంటే, ఉత్తరాన మరో గుహ కనిపించింది. గుహ చీకటిగా ఉంది. సెల్‌ఫోన్ లైట్లు ఆన్ చేసుకుని ముందుకి నడిచాం. గుహ అర్ధ చంద్రాకారంలో ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపుకి తిరిగింది. అక్కడ మరో శివలింగం ఉండటం చూసి ఆశ్చర్యపోయాం.
చారిత్రక ప్రశస్తి

ఈ ‘లొద్ది’ గుహ ఎంతో పురాతనమైన దనడానికి నిదర్శనంగా త్రిభుజాకారంలో ఉన్న రాతిముక్క ఒకటి దేవుడికి సమీపంలోనే ఉంది. దానిమీది జీవావశేషాలను బ్రహ్మరాత అంటున్నారు. తొట్టతొలి మానవులు సుమారు 5 లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడి గుహల్లో, అడవుల్లో తలదాచుకున్నారని తెలియజేసే ఆనవాళ్లయిన వారి రాతి పనిముట్లు, ఈ గుహ చుట్టుపక్కల పదేసి ప్రాంతాల్లో లభించాయి. అటువంటి పనిముట్లను ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం శ్రీశైలం కేంద్రం వారు కూడా సేకరించారు.

లొద్దికి తూర్పున కొన్ని కిలోమీటర్ల దూరంలో 5 కి.మీ.ల పొడవు, వెడల్పులతో ‘చంద్రగుప్తి’ పట్టణ శిథిలాలున్నాయి. కొందరు చరిత్రకారుల ప్రకారం ఇది, మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని కాలానిది (క్రీ.పూ.300). మరికొందరి ప్రకారం రెండవ చంద్రగుప్తుని కాలానిదని (క్రీ.శ.400), శ్రీశైలఖండం, పండితారాధ్య చరిత్ర, శ్రీ పర్వత పురాణం మొదలైన గ్రంథాల్లో వివరించబడిన ‘గుప్త మల్లికార్జున క్షేత్రం’ ఇదేనని భావిస్తున్నారు.

ఇక్కడికి 15 కి.మీ.ల దూరంలో ఉన్న శ్రీశైల ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమామహేశ్వర దేవాలయానికి ఈశాన్యంలో 3 కి.మీ.ల దూరంలో గల అడవుల్లో ‘గుప్త మహేశ్వరాలయం’ ఉంది. లొద్దిలోని లోపలి గుహలో లింగానికి, గుప్త మహేశ్వరాలయంలోని లింగానికి పోలికలున్నాయి. రెండూ చతురస్రాకార పానవట్టంలో ఉన్నాయి. రెంటికీ ఊర్ధ్వ పుండ్రాలు (నిలువు నామాలు- మధ్యది ఎత్తుగా) ఉన్నాయి.

కృష్ణానది ఎడమ ఒడ్డున గల మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ ప్రాంతంపైన విశేష పరిశోధన (తవ్వకాలు) చేసిన ఐ.కె.శర్మ, డి.ఎల్.ఎన్.శాస్త్రి తదితర చరిత్రకారులు ఈ ప్రాంతంలో మలి శాతవాహనుల కాలం (క్రీ.శ.1, 2 శతాబ్దాలు) నాటికే అదే కృష్ణాతీరం వెంట ఇటుకలతో నిర్మించిన శివాలయాలు వెలిశాయని నిర్ధారించారు. ఇక్కడి మల్లికార్జునాలయం కూడా ప్రాచీన ఇటుకలతో నిర్మించినదే. లొద్దివైపు ప్రారంభమయ్యే దారి మధ్యలో కూడా ప్రాచీన ఇటుక నిర్మాణాలున్నాయి. క్రీస్తు శకారంభ కాలం నాటి శివలింగాలు పురుష లింగాలను పోలి ఎత్తుగా ఉండేవి.

ఇలాంటి లింగాలే మనకు చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో, విశాఖ జిల్లాలోని శంకరం దగ్గర కనిపిస్తాయి. అలాంటి ఎత్తయిన లింగమే, ఇక్కడి గుహలోని గుహలో ఉంది. రెండువేల ఏళ్లనాటి నంది విగ్రహాన్ని ఐ.కె.శర్మ అమరావతిలో గుర్తించారు. అలాంటి మెత్తని సున్నపు రాతితో మలిచిన నంది విగ్రహమే లొద్దిలో ఉంది, గుప్త మహేశ్వరంలో కూడా ఉంది. అలాగే రాతితో మలిచిన తొట్లు కూడా ఈ రెండు ప్రదేశాల్లో ఉన్నాయి. ఇలాంటి రాతి తొట్టి తిరుమల తిరుపతి మ్యూజియం ఆవరణలో ఉండటం గమనార్హం.

ఇక్కడికి సమీపంలోని సలేశ్వరం ఆలయం ముందరి గోడపై ‘సర్వేశ్వరం’ అని రాసి ఉంది కనుక ‘శ్రీ పర్వత పురాణం’లో పేర్కొనబడిన ‘పుష్కర తీర్థం’ లొద్దిలోని గుండమే. ఇక్కడి గుండంలోని బండపై పడే వాటర్ ఫాల్స్ కింద నిలబడినప్పుడు, ఆ నిలబడినవారు పాపాత్ములైతే, ఆ జలధారలు పక్కకి తొలగిపోతాయని ఆ పురాణంలోని ఓ పద్యంలో చెప్పబడింది.

ఇలాంటి వింతైన సన్నివేశాన్ని మనం ఈ మధ్యనే బద్రీనాథ్ సినిమాలో చూశాం. అంతటి పవిత్రత, ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశం కనుకనే ఏటా లొద్దికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. పరమశివుని భక్తులు, సాహస పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు తప్పకుండా దర్శించవలసిన స్థలం ‘లొద్ది’.

డా॥ద్యావనపల్లి సత్యనారాయణ
హైదరాబాద్

No comments:

Post a Comment