Tuesday, 20 March 2012

TRAVELOGUE ON LAXMIPURAM published in Surya on 20-3-2012

నల్లమలో మరో అహోబిలం లక్ష్మీపురం

అందరికీ తెలిసిన అహోబిలం నల్లమల కొండలకు దక్షిణం వైపు ఉంటే అందరూ తెలుసుకోవలసిన మరో అెబలం అవే కొండలకు ఉత్తరం వైపు ఉంది... అంతే అందమైన ప్రకృతిలో, అంతకంటే ప్రాచీనమైన చరిత్రతో ఇప్పుడు చెబుతున్న మరో అెబిలం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరాబాద్‌ మండలంలో లక్ష్మీపూర్‌ తండకు ఉత్తర వాయువ్యంలో ఉంది. ఇది హైదరాబాద్‌ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో 135 కిమీల తరువాత వచ్చే మన్ననూర్‌ చౌరస్తా నుండి ఎడమ వైపు తిరిగి 21 కిమీ లు ప్రయాణించాక వస్తుంది. పర్యాటకులు పూర్వం భక్తితో మాత్రమే ‘యాత్ర’లకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆటవిడుపు కోసం ‘పర్యటన’లు చేస్తున్నారు. ఇటీవల ఆనందం కోసం, అడ్వెంచర్‌ కోసం, ప్రకృతిలో పరవశించడం కోసం పర్యటించాలను కుంటున్నారు. కాని మనం ఆశించేవన్నీ అందించే పర్యాటక స్థలాలు చాలా అరుదు. అలా అరుదైన స్థలాల్లో ఈ లక్ష్మీపురం నవనారసింహాలయ ప్రదేశం ఒకటి. ఈవారం విహారిలో ఆ విశేషాలు మీకోసం...

దర్శనమ్‌-కమ్‌-ట్రెక్కింగ్‌
DSCN6కొందరికి దైవ దర్శనం ఇష్టం. కొందరికి ట్రెక్కింగ్‌ సరదా. ఇక్కడ మాత్రం దైవదర్శనం చేసుకోవాలంటే ట్రెక్కింగ్‌ చేయ వలసిందే. అలా ఒకేసారి పుణ్యమూ, పురుషార్థమూ కలుగు తాయి. జంట కొండల్లోని పడమటి వైపు కొండ తూర్పు పక్క నిటారుగా ఉంటుంది. దాని ఎత్తు సుమారు రెండు వందల మీటర్లుంటుంది. ఆ రెండు వందల మీటర్లూ రెండు వందల మెట్లను (మధ్య మధ్య సమతలం తప్ప) ఎక్కవలసిందే. ఎందు కంటే, కొండ శిఖరం పైన కూడా రెండు మూడు దర్శన విశేషా లను చూడవచ్చు. ఇక కొండ మధ్యలో అటకలు ఏర్పరచి నట్లుగా పొడవాటి గుహలు రెండు ఒకదానిపై ఒకటి ఏర్పడ్డా యి. ఆ గుహలను వీలునుబట్టి ఎక్కడికక్కడ ఆలయాలుగా తీర్చిదిద్దారు. వీటన్నింటిని ఒక గుహాలయం నుండి మరో గుహాలయానికి ఎక్కుతూ, దిగుతూ చూడాలి.

ఇక కొండ పైన వేల ఏళ్ళనాటి ‘ప్రతాపరుద్ర కోట’ ఉంది. స్థానికంగా ఎవరైనా ఒక పనిని దీర్ఘకాలంగా చేస్తూ ఉంటే వారిని, ‘ఏంటి నువ్వు పటాభద్రుని కోట కడుతున్నట్టున్నవుగా’ అని ఎద్దేవా చేస్తారు. ప్రతాపరుద్ర కోట మొదటి పేరు పటాభద్రుని కోట. అది ఏ నవీన శిలాయుగం (నాలుగు వేల సంవత్సరాల) నుండో నిర్మించబడుతూ వస్తున్నదని దాని మీద లభిస్తున్న పురావస్తు ఆధారాల ఆధారంగా చరిత్రకారులు భావిస్తున్నారు. మనకూ ఆసక్తికరం అనిపిస్తే ఆ కోటగోడ పొడవునా ఎన్ని కిలోమీటర్లైనా ట్రెక్కింగ్‌ చేయవచ్చు. పరిశోధనలు చేసుకోవచ్చు. లోయల్లో పారే చంద్రవాగు, నరసింహులవాగుల వెంట కూడా వాటిపై నుండి వచ్చే చల్లగాలుల్ని ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్‌ చేయవచ్చు. కొండ శిఖరంపై నుండి లోయలోకి చూసినప్పుడు రంగు రంగుల గళ్ళ లుంగీలాగా కనిపించే వివిధ రకాల పంట చేలు కూడా మనల్ని ట్రెక్కింగ్‌ చేయమని టెంప్ట్‌ చేస్తాయి. ట్రెక్కింగ్‌ చేయడానికి ఓపికున్న వారికి ఓపికున్నంత మహదేవ!

తొలి తెలుగు దేవాలయాలు
విష్ణుకుండినుల రాజుల కాలం (క్రీశ 5-6 శతాబ్దాలు) వరకు దేవాలయాలను ఇటుకలతో కట్టేవారు. వారి తరువాతి రాజులు తొలి (లేదా) వాతాపి చాళుక్యులు (క్రీశ 6-8 శతా బ్దాలు) మొట్టమొదటిసారిగా స్పష్టంగా రాతి దేవాలయాలను కట్టించారు. తెలంగాణాలో వారు నాలుగుచోట్ల ఒక్కొక్క దేవుడి పేర తొమ్మిదేసి గుళ్ళను కట్టించారు. అవి... ఆలంపూర్‌లో నవబ్రహ్మాలయాలు, శ్రీశైల ఉత్తర ద్వారం ఉమామహేశ్వరంలో నవలింగాలయాలు, నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం లో నవనంది ఆలయాలు, ఇక్కడి లక్ష్మీపురంలో నవ నార సింహాలయాలు. అయితే ఇక్కడ చెంచుల ప్రాబల్యం ఎక్కువ కాబట్టి నరసింహస్వామికి చెంచులక్ష్మి రెండవ భార్య అయింది. ఈమె పేరు మీదనే ఊరు లక్ష్మీపురంగా ఏర్పడింది.

Aalayamఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు నడుస్తున్నప్పుడు మనకు మొదటి (లేదా పైన ఉండే) అంతస్థు గుహాలయాల్లో నరసింహస్వామి విగ్రహము మొదట కనిపిస్తుంది. దీనికి ఆగ్నేయంలో త్రికూటాలయముంది. మూడు గర్భగుడులు వరుసగా ఉన్నాయి. మధ్య దానిలో హిరణ్యకశిపుణ్ని చీల్చుతున్న నరసింహస్వామి విగ్రహం చాలా అందంగా ఉంది. ఈ ఆలయ ద్వారంపై గజలక్ష్మి పై కప్పుకు పద్మం, ద్వారాలకిరువైపులా పూర్ణకుంభాలుండటం చాళుక్యుల వాస్తుశైలి ప్రత్యేకతలు. స్వామికి ఎడమవైపు గర్భగృహంలో ఆదిలక్ష్మి విగ్రహముంది. కుడివైపున కూడా గత ఏడాది దసరా వరకు చెంచులక్ష్మి విగ్రహం ఉండేదట. ఇప్పుడు లేదు. ఈ గర్భగృహాల పొడవు, వెడల్పు, ఎత్తులు సుమారు నాలుగున్నర నుంచి ఆరు ఫీట్లే.

ఈ ఆలయం నుంచి దక్షిణంగా సాగుతున్నప్పుడు రెండు ఫీట్ల వెడల్పు, ఎత్తు, పది ఫీట్ల పొడవున్న గుహలో ఒక నరసింహస్వామి శిల్పం ఉంది. దాన్ని దాటాక మరో గుహలో వినాయక విగ్రహముంది. అక్కడి నుండి కొండ శిఖరాన్ని ఎక్కాక ఒక పై కప్పు లేని ఆలయంలో ఏడు అడుగుల ఎత్తున్న కాలభైరవుని విగ్రహం గంభీరంగా ఉంది. దేవరకొండ రాజులు భైరవున్ని ఆరాధించారు కాబట్టి వారు ఈ విగ్రహాన్ని పద్నాల్గవ శతాబ్దంలో చెక్కించి ఉంటారు. దాని పక్కనే ప్రతాపరుద్ర కోటగోడ కొండల అంచులను ఆనుకొని కనుచూపు మేర సాగిపోతున్నది. ఆ గోడనెక్కి ఎటు చూసినా పచ్చని కొండలు, లోయలు సోయగాలుపోతూ మనల్ని చూపు తిప్పుకోనివ్వవు. గాలి ఈదర ఒకటి మనల్ని గోడపై నుండి పడేసే ప్రయత్నం చేస్తుంది.

గుహలు గుడులుగా... గుడులు గబ్బిలాల నిలయాలుగా...మహిషాసురమర్దని ఆలయానికి ఉత్తరంలో కొన్ని మెట్లు ఎక్కిన తరువాత కొండలో సుమారు పదిహేను గజాల పొడవు, మూడు గజాల ఎత్తు, లోతులతో ఒక గుహ ఏర్పడింది. ఈ గుహనే ప్రధానాలయంగా మార్చారు. ఇందులో సుమారు రెండు వేల ఏళ్ళ కిందట గర్భగృహం, అంతరాళం, మంటపాలతో వరుసగా మూడు ఆలయాలు కట్టి, వాటిల్లో మధ్యలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి ఇరువైపులా గల గర్భగుడుల్లో ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మిలను ప్రతిష్టించారు. కొంతకాలం తరువాత స్వామికి ఎదురుగా మూడు గదులను కట్టి వాటిల్లో ఇతర నరసింహ రూపాలను ప్రతిష్టించారు. వాటిల్లో ఒకటి వరాహ నరసింహమూర్తి. వరాహం (పంది) చాళుక్యుల లాంఛనం కావడం గమనార్హం. ఇక్కడి లక్ష్మీ విగ్రహాల ముక్కు చెవులకు ఆభరణాలు పెట్టడానికి రంధ్రాలు కూడా తొలిచాడట శిల్పి అని అతని పనితనాన్ని కొనియాడారు స్థానిక చరిత్రకారుడు కపిలవాయి లింగమూర్తి. అంతటి వైభవోపేతమైన గుడులు ఇప్పుడు గబ్బిలాలకు నిలయాలయ్యాయి.

Kondఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా శిల్పకళాశోభితాలైన రెండు నిలువెత్తు ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. అంతే అందమైన ఆరు స్తంభాల ముఖమండపముంది. అంతకంటే దేవతల శిల్పాలు మంటపం ముందు హనుమ, హయగ్రీవ తదితర వాహన దేవతల శిల్పాలు మంటపం ముందున్నాయి. ఇరువురు దేవేరులతో కూడిన రాజు విగ్రహం ముక్కలై పడి ఉండటం చరిత్రకారులకు తీరనిలోటు. ఈ ముఖ మంటపాన్ని కట్టించి, ద్వార పాలకులు, ఆళ్వారుల శిల్పాలను పెట్టించింది క్రీశ 1530 ప్రాంతంలో చింతకుట ప్రభువు రంగ రాయుడు. కారణం, వీటికి ఈ స్థానిక ప్రభువే ఇక్కడికి పొలికేక దూరంలో కట్టించిన రాయనిగండి ఆలయ శిల్పాలతో ఉన్న పోలిక.

ఆలయానికి ఎడమ వైపున అందమైన చతుశ్శిలా మంటపాన్ని, దానికి ఎదురుగా వాగు అవతల బారెడెత్తు ఆంజనేయ విగ్రహాన్ని క్రీశ 12వ శతాబ్దం మధ్య దశాబ్దాల్లో ఈ ప్రాంతాన్ని వశపర్చుకుని అభివృద్ధి పరిచిన ఓరుగల్లు కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు చెక్కించినట్లుంది. ఆయన కోటగోడకు ఇవి సమీపంలో ఉండటం గమనార్హం. ఆలయ శిఖరాన్ని 9ఐఐగీ14ఐఐ, 7ఐఐగీ12ఐఐ అంగుళాల పొడవు, వెడలుపలు గల ఇటుకలతో రెండు విభిన్న కాలాల్లో నిర్మించారు. ఈ ఇటుకలు చాళుక్యులవే.

సినిమా సీన్లు
ఇక్కడి ప్రకృతి అందానికి ఆకర్షితులై ఇక్కడ గత కొద్ది నెలల కింద ‘గతం’ అనే సినిమాకు సంబంధించి కొన్ని పాటలు, ఫైట్లు, సీన్లు కూడా చిత్రీకరించారట. ఆ సినిమా రిలీజైతే అందులో ఇక్కడి అందాలను చూసి ఆనందించవచ్చు. వైశాఖ (మే) మాసంలో వచ్చే నృసింహ జయంతి, సంక్రాంతి తదితర పండుగలకు స్థానికులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారట. కొసమెరుపేంటంటే, తిరిగి వచ్చేటప్పుడు మన్ననూరు గుట్టల మధ్య చేలల్లో చలిలో క్యాంప్‌ఫైర్‌ వేసుకుని, అందులోనే వేరుశెనగ (పల్లి) కాయలు కాల్చుకుని రాత్రి ఏడెనిమిదింటి వరకు వేడివేడిగా తిని ఎంజాయ్‌ చేయడం మేము ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతి. అది సాధ్యం చేసిన రామారావు మేనమామకు కృతజ్ఞులం.

ఇలా ఎన్నో వింత అనుభూతుల్ని అందించే ఈ పర్యావరణ పర్యాటక క్షేత్రానికి ప్రతి ఒక్కరూ వెళ్ళవచ్చు. మొన్నటి శివరాత్రి వరకు... అక్కడి వరకూ పక్కా రోడ్‌ వేయడం పూర్తయింది కాబట్టి ఎటువంటి వాహనంలోనైనా వెళ్ళవచ్చు.

తొలి తెలుగు - కన్నడ శాసనాలు
Narsiమనం మన మూడు తరాల వెనుకటి తాతల రాతలను చూస్తేనే మురిసిపోతాం. అలాంటిది ఏకంగా పద్నాలుగు వందల ఏళ్ళ కిందట పుట్టిన మన మాతృభాష తెలుగు లిపిని చూస్తే... మన ఆనందానికి అవధులు ఉంటాయా! ఆ అవకాశం ఇక్కడుంది. భైరవ విగ్రహం దగ్గర నుండి తిరిగి ఉత్తరం వైపు కొండ దిగుతున్నప్పుడు మధ్యలో మహిషాసురమర్దని ఆలయంగా చెప్పబడుతున్న గుహాలయం కనిపిస్తుంది. దాని ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న రెండు ఎరుపైన స్తంభాలకు ‘త్రైలోకాదిత్య’ అని రాసి ఉంది. ద్వారం కుడివైపు స్తంభానికి అక్షరం కింద అక్షరం రాసిన శాసనంలో కన్నడ లిపి మూలాలు, ఎడమ వైపు స్తంభానికి ఎడమ వైపు నుంచి కుడివైపుకు రాసిన శాసనంలో తెలుగు లిపి (గుండ్రని) మూలాలు కన్పిస్తున్నాయి.

క్రీ.శ. 7వ శతాబ్దం వరకు ఒకే భాషగా ఎదిగిన లిపి అప్పటి నుండి విడిపోయి రెండు వేరు వేరు భాషలుగా రూపాంతరం చెందే తొలి ప్రయత్నాలకు నిదర్శనాలు ఈ శాసనాలు. చాళుక్యులు ఇక్కడి తెలుగు ప్రాంతం నుండి ఎదిగే కన్నడ ప్రాంతంలో రాజ్యస్థాపన చేసి మహారాష్టక్రు కూడా విస్తరించారు. వారి ఈ మూడు ప్రాంతాల పాలనను సూచించే ‘త్రిలోకాల చిహ్నం’ తెలుగు శాసనం కింద చిత్రించబడింది. ఈ శాసనాలను, ఆలయాలను చాళుక్య రాజు రెండవ పులకేశి (క్రీ.శ. 609-642) ఉత్తర భారత సామ్రాట్టు హర్షునిపై విజయానికి సూచనగా గాని, అతని కొడుకు విక్రమాదిత్యుడు క్రీ.శ. 655లో పల్లవులను పారదోలి తమ జన్మస్థానం ‘చాళుక్య విషయాన్ని’ తిరిగి సంపాదించినందుకు నిదర్శనంగా గాని చెక్కించి ఉంటారు.

ఈ చాళుక్యుల జన్మస్థానం ‘అరిమాన్‌ చళ్‌క’ ఇక్కడికి ఆగ్నేయంలో, వీరి కుల దేవత ‘హరితి’ (రేవుల)ఈశాన్యంలో పది-పదిహేను కిలో మీటర్ల దూరాల్లోనే ఉండటం గమనార్హం. హరితి దేవతను స్థానికులు ఇప్పుడు పెద్దమ్మ, దుర్గమ్మ, మరియమ్మ, తదితర రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. విక్రమాదిత్యుని భార్యలు తమ పేర లకే్ష్మశ్వర, లోకేశ్వరాల్లో జైన, హిందూ దేవాలయాలను కట్టించారని వారి శాసనాలు తెలుపుతున్నాయి. ఆ లకే్ష్మశ్వరం ఇక్కడి లక్ష్మీపురమేనేమో?


కొండ కోనల్లో, వాగు వంకల్లో...
సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్లకు పైగా ఎత్తున్న నల్లమల కొండలపైకి మన్ననూర్‌ దగ్గర ఎక్కిన తరువాత 25 కి.మీ.లు ప్రతాపరుద్ర కోటపై ప్రయాణించాక నరసింహుల కొండలు వస్తాయి. నైరుతి వైపు నుంచి ఈశాన్యం వైపు సాగుతున్న ఈ జంట కొండలకు ఉత్తరాన ఒక పొడవై కొండ అడ్డుపడడంతో అవి కలిసిన ప్రాంతంలో రెండు కోనలు (లోయలు) ఏర్పడ్డాయి. అదే ప్రదేశంలో ఉత్తరపు కొండకోనల్లో నుంచి వస్తున్న చంద్రవాగులో జంట కొండల కోనలో నుంచి వస్తున్న నరసింహులవాగు సంగమిస్తుంది. ఇలా కొండలు, కోనలు, వాగులు సుడిగుండంలా సంగమించే లోయలోకి పర్యాటకులు జంట కొండల చుట్టూ తిరిగి పశ్చిమాభిముఖంగా నడిచి చేరుకోవాలి. ఆ సంగమ ప్రదేశంలో మధ్య కొండకొన చాలా ఎత్తుగా ఉంది. దానికి రెండు అంతస్థుల్లో విశాలమైన గుహలు సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. ఆ గుహల్లో విగ్రహాలను ప్రతిష్టించి వాటి చుట్టూ, పైన దేవాలయాలను కట్టారు.


- డా ద్యావనపల్లి సత్యనారాయణ
తెలుగు యూనివర్శిటీ ఆడిటర్‌,
సెల్‌: 9440687250

No comments:

Post a Comment