Monday, 18 August 2014

Maro Eththipothala published in Namasthe Telangaana on 17.8.2014

మరో ఎత్తిపోతల
Updated : 8/17/2014 12:02:59 AM
Views : 133
zeherabadd
ఎవరైనా ఎత్తిపోతల జలపాతం ఎక్కడుందంటే ఠక్కుమని నాగుర్జునసాగర్ దగ్గరుందని చెప్తారు. కానీ, మెదక్ జిల్లాలోని జహీరాబాద్ దగ్గర కూడా అదే పేరుతో మరో జలపాతముంది. ఆ సంగతి మీకు తెలుసా?
అందరికీ తెలిసిన ఎత్తిపోతల జలపాతం రాతి గుట్టల మీది నుంచి దూకితే మనం తెలుసుకోబోతున్న ఈ జలపాతం రాతిమట్టి గుట్టల మీది నుంచి దూకుతుంది.

ఈ ఎత్తిపోతల జలపాతం మూడు జలపాతాల సముదాయం. ఉత్తరం నుంచి దక్షిణం వైపు వడివడిగా ప్రయాణిస్తున్న వాగు ఒక జలపాతంగా మారగా, దీనికి కుడివైపు నుంచి జలజల పారుతున్న ఏరు మొదటి జలపాతం ప్రవాహంలోకి దూకుతున్నది. ఈ రెండు జలపాతాలు మళ్ళీ కలిసిపోయి ఒకే ప్రవాహంగా మారి కొద్దిదూరం ఎత్తయిన మట్టి గుట్టల మధ్య ప్రవహించి, అక్కడ చదునైన 30 మీటర్ల వెడల్పైన బండమీది నుంచి 40 అడుగుల లోతు లోయలోకి దూకుతాయి. పచ్చని ఇరుకైన లోయలో కనిపించే ఈ దృశ్యాలు మనోహరమైన అనుభవం పంచుతాయి. అన్నట్టు, ఈ జలపాతం పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది.

ఇక్కడకు వస్తే, మట్టి గుట్టల మధ్య చిక్కుకుపోయినట్లు కనిపించే చెరువు, భూమి నుంచే ఇటుక రాళ్ళను చెక్కుకొని వాటితోనే ఇళ్ళు కట్టుకోవడం, మెట్ట పంటలు, చిన్నచిన్న తండాలు...ఈ విశేషాల మధ్య జరిపే ప్రయాణం ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆసక్తి, సమయం ఉన్నవారు పక్కనున్న మొగ్డంపల్లి మీదుగా 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గొట్టంగుట్ట అనే మరో పర్యాటక స్థలాన్ని కూడా దర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్ళేవారు దారిలో నందికందిలో నక్షత్రాకార శివాలయం (వెయ్యేళ్ళ నాటిది) చూడవచ్చు. దేశంలో మొట్టమొదటి శాస్త్రీయ పట్టణమైన సదాశివపేటనూ దర్శించవచ్చు.

ఇప్పటికి మన రాష్ట్రంలోని ఒకే ఒక ఆర్గానిక్ హోటల్ జహీరాబాద్‌లోనే ఉంది. కాబట్టి, అక్కడ ఆర్గానిక్ ఫుడ్ లాగించేయొచ్చు. ప్రత్నామ్నాయంగా పర్యాటకాభివృద్ధి సంస్థ వారి హరిత హోటల్ కూడా అక్కడే ఉంది.

ఇలా వెళ్ళాలి: ఈ ఎత్తిపోతల హైదరాబాద్‌కు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎటునుంచి వచ్చేవారైనా ముంబై రహదారిలోని జహీరాబాద్‌కు రైలులోగాని, బస్సులో గాని, ప్రైవేటు వాహనంలోగాని చేరుకోవచ్చు. ఆ తరువాత 10 కిలోమీటర్లు మాత్రం ప్రైవేటు వాహనాలు లేదా ఆటోలే శరణ్యం. జహీరాబాద్ రైల్వే ట్రాక్ దాటిన వెంటనే ఎడమ వైపుకి తిరిగి హోతి-బి, పర్వతాపూర్, ఉప్పుతాండలు మీదుగా మన ఎత్తిపోతలను చేరుకోవచ్చు.

Friday, 16 May 2014

Telangana summer resorts written by Dr. Dyavanapalli Satyanarayan and published in Namasthe Telangaana daily on 11.5.2014
మన చల్లని విడుదులు
Updated : 5/11/2014 2:58:58 AM
Views : 750
coolplaceమంట పుట్టించే ఈ వేసవి గాడ్పుల నుంచి సేద దీరడానికి కొండంత చల్లదనం కావాలి. అందుకని ఏ కూర్గ్, ఊటి, కొడై కెనాల్, కులూ మనాలి వంటి దూరతీరాలకే వెళ్లాలా? ఒక్కసారి తెలంగాణలోని ఈ చల్లని ప్రదేశాలను సందర్శించి చూడండి. ఆహా అని మీరు ఆనందించకుండా ఉండరు.

తెలంగాణలోనూ చల్లని పర్యాటక స్థలాలు లేకపోలేదు. ఎత్తైన గుట్టలు, జలపాతాలు, నదులతో అలరారే మన దక్కన్ పీఠభూమి ఎత్తుగా ఉంటుంది. పైగా నల్లమల పర్వతాలు, దండకారణ్య పర్వత సానువులు కూడా తెలంగాణలో ఉండటంతో అద్భుత ప్రకతికి లోటు లేకుండా పోయింది. ఎత్తయిన గుట్టలకు, వాటి పై నుండి దూకే జలపాతాలకు, వాటి మధ్య నుండి పారే నదులకు మన దగ్గర చోటు లేకపోతే కదా, వేరే ప్రాంతాలను ఆశ్రయించాలి.

రామాయణంలో అరణ్యకాండ, సుందరకాండ సుందరమైనవి. కారణం అవి అడవుల్లో నడిచే కథాంశాలు. సుందరకాండ శ్రీలంకలో జరిగితే అరణ్యకాండ ఎక్కువగా దండకారణ్యంలో, అదికూడా తెలంగాణలోని దండకారణ్యంలో జరిగింది. తెలంగాణ దండకారణ్యం గోదావరి నదికి ఇరువైపులా విస్తరించిన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో నెలకొని ఉంది. ఇది రాముడు, సీత, లక్ష్మణుడు ఆహ్లాదకరంగా సంచరించిన నేల. రావణాసురుడి బంధుగణంతో వారు యుద్ధాలు చేసిన నేల. ఈ ప్రాంతపు పర్వత సానువులు, వాటి మధ్య పారే నదులు, వాగులు వంకలు, అక్కడక్కడ అవి జలపాతాలుగా మారే వైనం, వాటిపైన కట్టిన ఆనకట్టలు- ఇవన్నీ ప్రకతి సౌందర్యంతోపాటు చల్లదనాన్ని కూడా ఇచ్చేవిగా ఉన్నాయి. అయితే, వీటిల్లో ఈ ఎండాకాలంలో సందర్శనీయ ప్రదేశాలూ కొన్ని లేకపోలేదు. వాటి గురించే ఈవారం కవర్‌స్టోరీ.

పొచ్చెరలో విశాలమైన స్నానకుండం:ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ నుండి 8 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొచ్చెర జలపాతం వస్తుంది. ఇది చిన్నదే అయినా దీని నీటిలో స్నానం చేసే వీలుండటం ఇక్కడి ప్రత్యేకం. దీని కింద ఏర్పడిన విశాలమైన కుండం అందాలు ఆస్వాదించాల్సిందే.

కాళేశ్వరంలో పవిత్ర స్నానాలు:మంథని నుంచి సుమారు 50 కిలోమీటర్లు కాళేశ్వరం వరకు పచ్చని కొండలు, కోనల గుండా సాగే ప్రయాణం ఆహ్లాదకరమైన అనుభూతిని మిగులుస్తుంది. కాళేశ్వరం గోదావరిపాణహిత నదుల సంగమ ప్రదేశంలో ఉన్న త్రిలింగ క్షేత్రం. ఇక్కడి ప్రధానాలయంలో ఒకే పానవట్టంపై ముక్తేశ్వర-కాళేశ్వర అనే రెండు శివలింగాలున్నాయి.
ముక్తేశ్వర లింగం మీద పోసిన అభిషేక జలం దాని మధ్యలో ఉన్న రంధ్రం గుండా గోదావరిపాణహిత నదుల్లోకి పారి ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమం చేస్తుంది. యాత్రికులు ఇక్కడా పవిత్ర స్నానాలు చేయవచ్చు. ఈ క్షేత్రంలో ఇంకా ఎన్నో ప్రాచీన ఆలయాలు వాస్తు శిల్ప సౌందర్యాలతో అలరారుతున్నాయి.

మినీ నయాగరా బొగత:మల్లూరు తరువాత గోదావరి నది వరంగల్, ఖమ్మం జిల్లాలను వేరు చేస్తుంది. ఖమ్మం జిల్లా వైపునే బొగత జలపాతం ఉంది. స్థానిక గోదావరి ఉపనది వర్షాకాలంలో చాలా ఉధతంగా పారి మినీ నయాగరా జలపాతంలా దూకుతుంది. అప్పుడు ఒడ్లపై నుండి మాత్రమే దాని అందాన్ని చూడగలం. ఈ ఎండాకాలంలోనైతే జలపాతం మీద ప్రవాహంలోనూ, కింద గుండంలోనూ కేరింతల మధ్య స్నానాలు మరచిపోలేని ఆనందాన్నిస్తాయి. ఆ నీటి స్వచ్ఛత, చల్లదనం అక్షరాలకు అందేవీ కావు.

అందరినీ అలరించే నాగార్జునసాగర్:సుమారు అర్థ శతాబ్దం కింద కట్టిన అద్భుత మానవ నిర్మాణం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్. 124 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రాతి డ్యామ్. ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలో వెలికి తీసిన చారిత్రక సంపద, ప్రత్యేకించి బౌద్ధ అవశేషాలు, విశేషాలను ప్రాజెక్ట్ జలాల మధ్యలోగల నాగార్జున కొండపై ఏర్పాటు చేసిన మ్యూజియంలో దర్శించవచ్చు. ఇక్కడికి సాగర్ నీటిలో బోటుపై 9 కిలోమీటర్ల ప్రయాణం ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.

ప్రత్యేక ఆకర్షణ ఎత్తిపోతల:పైలాన్-హిల్ కాలనీ పరిసరాల్లో 279 ఎకరాల్లో బుద్ధుడు ప్రవచించిన అష్టాంగమార్గ స్ఫూర్తితో నిర్మితమైన కట్టడాలు, పార్క్‌లు చూడదగినవి. సాగర్ కిందుగా 11 కిలోమీటర్ల దూరంలో 70 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న ఎత్తిపోతల జలపాత సౌందర్యం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇది గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే, నాగార్జున సాగర్‌లో పర్యాటకులకు కావలసినన్ని సౌకర్యాలున్నాయి.

ఆకుపచ్చని అందం అనంతగిరి:హైదరాబాద్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలున్నాయి. అందంలో విశాఖ జిల్లాలోని అనంతగిరి కొండలను తలదన్నేవి ఇవి. ఈ కొండలమీది అటవీ ప్రదేశంలోనే నిజాం కాలంలోనే క్షయవ్యాధి నివారణా కేంద్రం ఏర్పాటై ఇప్పటికీ పనిచేస్తోంది. ఇక్కడి వాతావరణంలోనే క్షయవ్యాధిని నయం చేయగల మహత్తు ఉందని ఆనాడే గుర్తించారు. ఈ కేంద్రం ముందు విశాలమైన, లోతైన లోయ ఉంది. సాహసికులు అక్కడికి ట్రెక్కింగ్ చేస్తే వారికి అడవుల మధ్య అందమైన చెరువు కన్పిస్తుంది. కాగా, ఈ కేంద్రానికి వెనుక వైపు ఒక దేవాలయం, దానికి కిందుగా జంటగా ఉన్న కోనేరులోని మంచినీటిని (పాలగుండం), మురికినీటిని (నీళ్ళగుండం) దర్శించుకోవచ్చు. కాగా, పర్యాటకశాఖ వారు ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌లో మంచి భోజనం లభిస్తుంది. ఇక్కడ ఏ.సి. గదుల సౌకర్యమూ ఉంది.

నల్ల మలయ పర్వతాలు:తెలంగాణకు దక్షిణాన మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో కష్ణానది సరిహద్దుగా విస్తరించాయి నల్లమల అడవులు. వీటిలో 1978లో పులుల సంరక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం. అధికారిక అంచనాల ప్రకారం ప్రస్తుతం నల్లమలలో చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 164 పులులు ఉన్నాయి. వీటితో పాటు అనేక అటవీ జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, వక్షజాతులు ఇంకా ఎంతో వైవిధ్య భరితమైన జీవజాలానికి నిలయమైన నల్లమల అడవులు దేశంలోనే రెండవ అతిపెద్ద అడవులు. వీటి వైశాల్యం 3,568 చదరపు కిలోమీటర్లు. నల్లమల గుట్టల సరాసరి ఎత్తు 914 మీటర్లు. కాబట్టి చల్లగా ఉంటాయి. ఇక్కడే మరెన్నో జలపాతాలు, వాటి మధ్య నుంచి ఏరులు పారుతున్నాయి.

శ్రీశైలం వష్టజలాల సందర్శన:వనమయూరి గెస్ట్‌హౌస్ కష్ణానది ఒడ్డున ఉంది. కాబట్టి, శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ (వష్టజలాలు), నల్లమల పర్వత సానువుల్లో చిక్కుకున్న అందమైన దశ్యాన్ని, ఆ నీటిపై నుంచి వచ్చే చల్లగాలులను ఇక్కడ్నించి ఆస్వాదించవచ్చు. చీతల్ రెస్టారెంట్ (వనమాలి గెస్ట్‌హౌస్), వనమయూరి గెస్ట్‌హౌస్- ఈ రెండూ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. కాబట్టి, సందర్శకులు ముందే వాటిని బుక్ చేసుకోవలసి ఉంటుంది. వనమాలి గెస్ట్‌హౌస్‌లో ఉన్న వారు ఆ చుట్టుపక్కల్లోని ఎన్విరాన్‌మెంటల్ సెంటర్, చెంచు లక్ష్మీ అనే గిరిజన మ్యూజియంను, దగ్గరలోని ఉమామహేశ్వరం అనే గుహాలయాన్ని, ప్రతాప రుద్రకోటను, షావలి దర్గాను కూడా సందర్శించవచ్చు.

వింత గొలిపే లొద్ది జలాలు:వనమాలి గెస్ట్‌హౌస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్నప్పుడు 16 కిలోమీటర్ల దూరంలో రోడ్‌కు కుడివైపు లొద్ది అనే ప్రదేశం ఉంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి వాచ్‌మన్ గది దగ్గర తమ వాహనాలను ఆపి సుమారు అర కిలోమీటరు దూరం అడవిలో నడిస్తే ఒక వింతయిన లొద్ది కనిపిస్తుంది. మూడు దిక్కులా వేయి అడుగుల ఎత్తయిన గుట్టలు వర్తులాకారంలో మూసుకోగా తూర్పు నుండి పడమరకు ప్రవహించే చంద్రవాగు సుమారు 150 అడుగుల ఎత్తు నుండి ఇక్కడే లోయలోకి దూకుతుంది. ఎంతో అరుదైన, అందమైన ఈ దశ్యాన్ని చూడడానికి మనకు రెండు కళ్లూ చాలవు.

మనం తూర్పు వైపున చంద్రవాగును దాటి దక్షిణం వైపు నుండి పావు కిలోమీటరు ప్రయాణించి ఉత్తరం వైపుకి తిరిగి లోయలోకి చేరుకోవాలి. మళ్ళీ పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకి తిరిగి లొద్ది జలపాతం వైపుకు చేరుకోవలసి ఉంటుంది. ఇక్కడ నడవ లేని వారు జలపాతం పై నుంచే లోయలోకి చూసి అందులో నుండి వేగంగా వచ్చే ఈదురుగాలులను చల్లదనాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు.
లొద్ది జలపాతం కింద ఒక విశాలమైన గుండం ఏర్పడింది. అందులోని నీళ్ళు చాలా తేటగా, స్వచ్చంగా ఉంటాయి. నీళ్ళపైకి గుండం చుట్టూ పెరిగిన పెద్ద చెట్లు వంగి అద్భుత దశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. గుండం నీళ్ళల్లో ఎవరైనా స్నానం చేయవచ్చు. లోతు తక్కువగా ఉండి అడుగు పైకి కనిపిస్తుంది. కాబట్టి, ఈత రాని వారు కూడా భయపడనక్కర్లేదు.

పుష్కరతీర్థం మహిమ:ఈ గుండం తూర్పు అంచున జలపాతం కింద ఒక చదునైన బండ ఉంది. దానిపై నిల్చుని కూడా జలపాతపు హొయలు దర్శించవచ్చు. ఆ బండమీద నిల్చున్న వారు పాపాత్ములైతే వారి మీద జలపాతం దూకకుండా పక్కకు తప్పుకుంటుందని, అది ఈ పుష్కర తీర్థం మహిమ అని 17వ శతాబ్దానికి చెందిన నాగలూటి శేషనాథాచార్యులు శ్రీ పర్వత పురాణంలో వివరించారు.

సొరికెల్లో నడక గొప్ప థ్రిల్లింగ్:గుండం చుట్టూ గుట్టల సొరికెలు (గుహలు)న్నాయి. వాటిల్లో సునాయాసంగా మనం నడవచ్చు. జలపాతం వెనుక ఉన్న గుహలో నడవడం మరువలేని మధురానుభూతిని ఇస్తుంది. ఉత్తరపు గుహ చాలా విశాలమైంది, లోతైంది. కాబట్టి, అందులో 1600 సంవత్సరాల కిందనే ఈ ప్రాంతం నుంచి ఎదిగిన విష్ణుకుండి రాజులు శివాలయం కట్టించారు. కాకతీయుల కాలం నకీ.శ.1200)లో మరిన్ని విగ్రహాలు చేర్చారు. ఇక్కడ ప్రతి యేటా నాలుగు రోజులు జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం తొలి ఏకాదశి అంటే జూలై మొదటివారంలో జాతర జరుగనుంది.
ప్రకతి ప్రేమికులు, చల్లదనాన్ని ఆస్వాదించాలనుకునే వారు దీనిని మిస్ కావద్దు. ఈ జాతర స్థానిక చెంచు గిరిజనుల ఆధ్వర్యంలో జరుగుతుంది. గుండం నుంచి పారుతున్న ఏరు వెంట కొంత దూరం వెళితే నిటారైన ఒక గుట్ట కనిపిస్తుంది. స్త్రీ బాలవద్ధులు కూడా చీమలదండులా నిజాం కాలం నాటి నిచ్చెన నెక్కుతూ వత్తున్నాం వత్తున్నాం లింగమయ్యా అని అరుస్తూ అక్కడ ఎలా ఆనందిస్తారో చూసి తీరాల్సిందే.

ఫరహాబాద్ గేట్ వద్ద టైగర్ సఫారీ:గుండం నుంచి శ్రీశైలం వైపు ఫర్లాంగు దూరం ప్రయాణించగానే ఫరహాబాద్ గేట్ వస్తుంది. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు ఆరుగురికి ఆరు వందల రూపాయలు తీసుకొని ఫారెస్ట్ జీప్‌లో టైగర్ సఫారీకి తీసుకెళ్తారు. మీ అదష్టాన్ని బట్టి పులి, జింకలు, ఎలుగుబంట్లు, అడవిపందులు వంటి జంతువులు అక్కడక్కడా ఉంటే నీటి గుంటల్లో నీళ్ళు తాగడానికి వస్తూ కన్పిస్తాయి. మార్గమధ్యలో నిజాం కట్టించిన గెస్ట్‌హౌస్‌ను, వంటశాల, గుర్రాలశాలను చూపి ఏడెనిమిది దశాబ్దాల క్రితం ఈ అడవుల్లో నిజాం రాకుమారులు వేటాడి ఆ జంతువుల మాంసాన్ని వండించుకుని, తిని, తాగి ఆనందించిన వైనాన్ని ఊహించుకుంటే కూడా థ్రిల్ అనిపిస్తుంది.

ఇదే నిజాం రాజులు మరో ఏడెనిమిది కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వచ్చే పర్వత సానువు అంచున కూడా గెస్ట్‌హౌస్ కట్టించారు. పదిహేనేళ్ళ క్రితం దాన్ని పునరుద్ధరించి వసతి యోగ్యంగా చేశారు. కానీ, నక్సలైట్లు పేల్చేశారు. అట్లని నిరుత్సాహ పడకండి. ఆ శిథిల గెస్ట్‌హౌస్‌ల ముందర ఉన్న గుట్ట కొనకెళ్ళి చూడండి. భయం ప్లస్ అనిర్వచనీయమైన ఆనందం ఒకేసారి కలిగే దశ్యం కన్పిస్తుంది. ఆ గుట్ట అంచున ఉన్న మన కింద కిలోమీటరు లోతైన లోయ, మైదానాలు, వాటిల్లో చిక్కటి అడవుల్లో చిక్కుకున్న పెద్ద చెరువులు కాన్వాస్ మీద గీసిన రంగుల చిత్రాల్లా కన్పిస్తాయి.
మనం ఆ లోయలోకి పడిపోతామేమోనన్న భయం కలుగుతుంది. తల తిరిగినట్లనిపిస్తుంది. అందుకే అక్కడ రైలింగ్ (ఇనుప కంచె) ఏర్పాటు చేశారు. ఈ కంచె కడీలను పట్టుకొని లోయలోకి చూస్తుంటే ఆ పల్లపు ప్రాంతపు చెట్ల పుప్పొడి (వాసన)ని నీటి తుంపర్లను మోసుకొంటూ మనల్ని వెనక్కి తోసి పడేసేంత వేగంగా వీస్తున్న గాలులను ఆస్వాదిస్తుంటే గాల్లో తేలినట్టుందే అని అరవక మానం.

ఆక్టోపస్ వ్యూ పాయింట్:ఇలాంటి వ్యూపాయింట్ మరొకటి ఫరహాబాద్ గేట్ నుండి శ్రీశైలం రూట్‌లో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని పేరు ఆక్టోపస్ వ్యూ పాయింట్. కష్ణానది ఎడమ ఒడ్డున అర కిలోమీటరు ఎత్తులో ఉంది. అక్కడ వ్యూ పాయింట్ కియోస్క్ (మెట్ల గూడు) కట్టారు. దానిపై నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ ఆక్టోపస్ ఆకారంలో పచ్చగా ఉన్న కొండల మధ్య చిక్కిపోయిన సౌందర్యం, ఆ నీళ్ళల్లో శ్రీశైలంలోని పాతాళగంగ నుంచి అక్కమహాదేవి గుహల వైపు ప్రయాణిస్తున్న బోట్లు, చేపలు పట్టేవాళ్ళ పడవలు, పుట్టీలు నయానానందాన్ని కలిగిస్తాయి.

కష్ణా నీటిపై నుంచి వీచే చల్లగాలులకు ఎగిరే మన ముంగురులను సవరించుకుంటూ ఆ ప్రాంతంలో ఎక్కువగా నెమళ్ళను, 2300 ఏళ్ళనాటి చంద్రగుప్త పట్టణపు శిథిలాలను చూస్తూ ఆనందంతో కడుపు నిండిన స్మతులతో వెను దిరగవచ్చు.
ఇలా ఈ వేసవిలో మన తెలంగాణలోని చల్లని విడుదలను తనివితీరా దర్శించుకుని మనసుకు ఉల్లాసాన్ని పొందుదాం.

మధురానుభూతినిచ్చే లక్నవరం

వరంగల్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని సుప్రసిద్ధ రామప్ప దేవాలయ ప్రాంగణం యావత్ తెలంగాణలోని అపురూప హిందూ వాస్తు శిల్ప నిర్మాణరీతులకు నిలువెత్తు నిదర్శనం. గుడిని దర్శించిన తర్వాత సమీపంలోనే ఉన్న విశాలమైన రామప్ప చెరువులో బోటు విహారం చేయవచ్చు. రామప్పకు కుడివైపున ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నవరం చెరువు, అక్కడి కొండలు అడవుల్లో చిక్కుకుని మరింత సౌందర్యవంతంగా కన్పిస్తుంది.

నీళ్ళమధ్య ద్వీపాలు, పచ్చని కొండలు ఇక్కడ విశేష ఆకర్షణ. ఈ నాలుగు దీవుల మీదికి ఊగే తాళ్ళ వంతెనలు ఏర్పాటు చేశారు. వాటిపై నడుస్తూ ఒక ద్వీపానికి చేరుకొని, అక్కడ ఒకరోజు బసచేయవచ్చు. అడవులు, నీళ్ళ మీదుగా వీచే చల్లగాలులను ఆస్వాదిస్తూ గడపడం ఒక మరిచిపోలేని మధురానుభూతిని మిగులుస్తుంది.

చక్కగా ఇక్కడి చెరువు నీళ్ళలో స్నానం చేయవచ్చు, బోట్లలో విహరించవచ్చు. సరస్సు మధ్యలో ఉన్న కాకరకాయల బోడుపై రాష్ట్ర పర్యాటకాభివద్ధి సంస్థ గత సంవత్సరం కోటి 14 లక్షల రూపాయల ఖర్చుతో కాటేజీలను నిర్మించింది. కిటికీల్లో నుంచి చూస్తే సరస్సుతోపాటు చుట్టూ ఉన్న ప్రకతి అందాలన్నీ కనిపించేలా గదులను ఏర్పాటు చేశారు. ఒక అధునాతన రెస్టారెంట్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటిల్లో ఒక్కరోజు గడిపినా ఆ అనుభూతిని మరవలేం.

నర్సన్నకు దండం, చింతామణిలో స్నానం:లక్నవరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరు నాగారం నుండి అందమైన అటవీ మార్గంలో మంగపేట మీదుగా మరో 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, మల్లూరు చేరుకోవచ్చు. మల్లూరుకు 8 కిలోమీటర్ల దూరంలో అడవుల మధ్య గోదావరి నదికి అల్లంత దూరంలో వెలసిన నరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికానందానికి, ప్రకతి సౌందర్యానికి నెలవు. స్వామి పొట్టలో వేలు పెడితే వేలికి అంటిన ద్రవం రక్తపు వాసన రావడం ఇక్కడి ప్రత్యేకత. పురాతన కాలంలో ఒక గిరిజనుడు చూసుకోకుండా స్వామి పొట్టలో గునపం దింపాడట. అందుకే రక్తం ఇప్పటికీ కారుతూనే ఉందంటారు. ఈ ఆలయం పక్కనే ఉన్న చింతామణి జలపాతం, సమీపంలోని గోదావరి స్నానాలు తప్పక ఆస్వాదించదగినవే.

పులకరింపజేసే మల్లెల తీర్థం

హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో వటవర్లపల్లి మీదుగా రోడ్డుమార్గంలో ప్రయాణించి మల్లెల తీర్థం జలపాతాన్ని చేరుకోవచ్చు. మొత్తం 165 కిలోమీటర్ల ప్రయాణం. ఇందులో 40 కిలోమీటర్లు మాత్రం నల్లమల అడవుల్లో రోడ్డుకు ఇరువైపులా జుమ్‌మ్ మని వీచే ఈదురు గాలినిచ్చే ఎత్తయిన చెట్లు. దారిలో కోతులు, కొండెంగలు, అడవి కోళ్ళు, నల్లమల ఉడతలు, నెమళ్లు సైతం దర్శనమిస్తాయి. ఇంకా ఒక్కోసారి అయితే ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులనూ చూడవచ్చు. ఈ జలపాతం నిర్వహణ స్థానిక చెంచు గిరిజనుల అధీనంలో ఉంది.

వారి దగ్గర టికెట్లు తీసుకుంటుండగానే మనకు జలపాతపు హోరు వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి సుమారు మూడు వందల మెట్లు దిగవలసి ఉంటుంది. సగం మెట్లు దిగుతుండగానే ఎడమవైపు చెట్ల మధ్య నుంచి నురగలు కక్కుతూ దూకే జలపాతం మనల్ని ఉవ్విళ్ళూరిస్తుంది. ఇక కాళ్ళకు ఎక్కడ లేని శక్తి వచ్చి జలపాతం వైపు పరుగెత్తుతాం. దగ్గరికి వెళ్ళీ వెళ్ళకముందే మన కళ్ళ ముందు అద్భుతమైన జలపాతం ఆవిష్కారమవుతుంది.

మల్లెల తీర్థం జలపాతం ఎత్తు సుమారు వంద అడుగులు. రెండు పర్వత సానువుల మధ్యనున్న లోయలోంచి పారుతూ వచ్చి అకస్మాత్తుగా మరో లోయలోకి దూకుతుంది. ఈ క్రమంలో జలధారలు మల్లెపూవుల ఆకారం తీసుకోవడమేకాక మల్లెల వలె చల్లగానూ ఉంటాయి. కాబట్టే, ఈ జలపాతానికి మల్లెల తీర్థమని పేరు వచ్చింది.

చంద్రావతి పూజించిన శివలింగం:అయితే ఈ జలపాతానికి కుడివైపునున్న ప్రాచీన శివలింగాన్ని సుమారు 2300 సంవత్సరాల కిందట మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని కూతురు చంద్రావతి మల్లెపూలతో పూజించినట్లు చరిత్ర కథనం. జలపాతం కొండమీద నుంచి గుండంలోకి దూకేటప్పుడు కొండచరియకు, గుండానికి మధ్య ఖాళీ స్థలం ఏర్పడింది. ఇక్కడిదాకా మనం వెళ్ళి ఎంచక్కా జలపాత ధారల కింద స్నానం చేయవచ్చు. జలపాతం ముందున్న నీటి గుండం కూడా చాలా లోతైంది, విశాలమైంది, అందమైంది. పెద్ద వట వక్షాలు ఆ గుండం నీటి ఉపరితలంపై తమ కొమ్మలను వేలాడదీసినట్లున్న దశ్యం ఒక సుందరకాండ.

కనిపించని ఆరు జలపాతాలు:రెండు గుట్టలను చీలుస్తూ పారే గుండం నీళ్ళు అలా ఉత్తరం వైపు ముందుకు సాగుతూ దూరంలో ఒకటి తర్వాత మరొకటిగా మొత్తం ఆరు జలపాతాలను ఏర్పరిచాయని అంటారు. ఆ ఎరుకతో ఇరువైపులా ఉండే ఒడ్లమీది నుంచి నడుచుకుంటూ వెళ్ళి వాటిని చూడవచ్చేమో. కానీ, మధ్యలో చాలా గుబురు పొదలు అడ్డుకుంటాయి. అంతేకాదు, వెళ్ళిన కొద్దీ పొదలు చిక్కబడుతుంటాయి. అడవి జంతువుల సంచారం కూడా ఉంటుంది. కాబట్టి, ఈ ప్రయత్నం ప్రమాదకరం. మానుకోవడమే మంచిది. కానీ, గుండం ముందు ఫర్లాంగు దూరంలో ఉన్న విశాలమైన స్థలంలో నీటి అంచున చెట్లనీడలో కావలసినంత సేపు గడిపి వెనుదిరగడం శ్రేయస్కరం.

ఇప్పుడిప్పుడే అక్కడ స్థానిక గిరిజనులు టిఫిన్స్, స్నాక్స్ పర్యాటకులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇక తిండి, వసతి కూడా ఈ జలపాతానికి 25 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వైపు వున్న మన్ననూరిలోని చీతల్ రెస్టారెంట్‌లోను, 25 కిలోమీటర్లు శ్రీశైలం వైపు వున్న దోమలపెంట వనమయూరి గెస్ట్‌హౌస్‌లోను అందుబాటులో ఉంటాయి.


అద్భుత సౌందర్యానికి నెలవు కుంతల

మన రాష్ట్రంలో అతి పెద్ద జలపాతంగా పేరు పడింది కుంతల. ఇది ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్- నేరేడిగొండ రూట్‌లో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి నేరేడిగొండ నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ జలపాతం మూడు దఫాలుగా దూకుతుంది. మొదటి రెండు దఫాలు చిన్న జలపాతాలు. వీటిల్లో హ్యాపీగా స్నానం చేయవచ్చు. మూడవ దఫా పెద్ద జలపాతం. కడెం నదికి రెండు ఒడ్డుల పక్కగా దూకుతుంది.

కుంతల జలపాతం ఎత్తు 46 మీటర్లు. కుడి ఒడ్డు నుంచి వెళితే జలపాతం కిందికి చేరుకోవచ్చు. కింద ఏర్పడిన కుండంలో, అక్కడి నుంచి పారుతున్న నదీ ప్రవాహంలో స్నానం చేయవచ్చు, ఈత కొట్టవచ్చు. ఈ నదికి ఇరువైపులా దట్టమైన అడవులు, గుట్టలు, వాటి మధ్య లోయలు ఉన్నాయి. ఇక్కడి ప్రాకతిక సౌందర్యం అద్భుతం. ఇక్కడ ఈ మధ్యనే పర్యాటకులకు తిండి, వసతి ఏర్పాట్లు చేశారు. పర్యాటకులు ఇక్కడ ఒకరోజు గడపవచ్చు కూడా.

అక్కమహాదేవి గుహల అద్భుతం

ఫరహాబాద్ గేట్ నుండి శ్రీశైలం రూట్‌లో వటవర్లపల్లి మీదుగా సుమారు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత కుడివైపున లోయలో అక్కమహాదేవి గుహలకు దారి అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం ఆహ్లాదకరమైన ప్రకతిలో ట్రెక్కింగ్ చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ అంచున ఉన్న ఈ చారిత్రాత్మకమైన గుహలను చేరుకోవచ్చు. క్రీ.శ. 12వ శతాబ్దంలో ఈ గుహల్లో కర్ణాటక నుంచి వచ్చిన శివ భక్తురాలు శ్రీశైలం శివుణ్ని సేవించి తరించడంతో ఆమె పేరుమీదే వీటిని అక్కమహాదేవి గుహలు (అక్కమ్మ బిలం) అంటున్నారు.

ముందుగా మనల్ని సహజ శిలా తోరణం ఆహ్వానిస్తుంది. తూర్పు పడమర దిక్కుల మధ్య సుమారు 50 గజాల దూరంతో రెండేసి స్తంభాల చొప్పున సహజంగా ఏర్పడగా వాటిపైన రెండు గజాల మందం, నాలుగు గజాల వెడల్పు, 55 గజాల పొడవు ప్రమాణాలతో ఉన్న ఒక చదునైన బండ నిలబెట్టినట్లు ఏర్పడింది. ఈ బండ పందిరి కింద సుమారు వేయి మంది నిల్చోవచ్చు. ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
అన్నట్టు ఇక్కడ స్థానిక చెంచు పిల్లలు అమ్మే బోలు పేలాలు ఓ ప్లేటు తిని టీగాని, మజ్జిగ గాని తాగి వాళ్ళలో ఒకర్ని గైడ్‌గా తీసుకొని కొవ్వొత్తి వెలుతురులో మూడు మలుపుల ద్వారా 108 అడుగులు వేసి గుహ చివరన గజమెత్తు గద్దెపైన సహజంగా ఉన్న శివలింగాన్ని దర్శించుకుని గబ్బిలాల కిలకిలల మధ్య వెనుదిరగడం ఒక థ్రిల్లింగ్ అనుభవం. తూర్పు నుండి పడమర వైపు సాగే ఈ గుహకు ఎదురుగా మరో గుహ, దానికి సమాంతరంగా ఇంకో గుహ, వీటన్నింటిపైన మరో రెండు గుహలు ఉన్నాయి. పై గుహల్లో ఇప్పటికీ కర్ణాటక నుండి వచ్చిన శివభక్తులు నివాసం ఉంటున్నారు.

బ్యాక్‌వాటర్‌లో స్నానం:ఈ గుహల అంచునే ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో స్నానం చేయడం మర్చిపోకండి. చేస్తూ ఎదురుగా అవతలి ఒడ్డుపైన అక్కడక్కడా విసిరేసినట్లు కన్పించే ఆవులపెంట, చేపలోళ్ళ పెంటలు, సూర్యోదయం, సూర్యాస్తమయం నీళ్ళలో ప్రతిఫలిస్తున్న ప్రతిబింబాలనూ చూడండి. పాతాళగంగ నుంచి ఇక్కడికి 22 కిలోమీటర్లు ఏపీటీడీసి బోటులో ప్రయాణించి కూడా చేరుకోవచ్చు. తెలంగాణ వైపున్న నీలిగంగ రేవు నుండి ప్రైవేటు బోట్లనూ ఎంగేజ్ చేసుకోవచ్చు.

Tuesday, 28 January 2014

MANA PRAACHEENA SHIVAALAYAALU written by Dr. Dyavanapalli Satyanarayana and published in Namasthe Telangaana on 26.1.2014



Monday, 20 January 2014

TELANGANA TOURISM POLICY 2014 By Dr. Dyavanapalli Satyanarayana published in NamastheTelangaana on 19.1.2014
Power point presentation బంగారు తెలంగాణ: టూరిజం
భౌగోళికంగా దక్కను పీఠభూమిలో ప్రధాన భాగం తెలంగాణలోనే ఉంది. కనుక, ఇది సమశీతోష్ణస్థితిని కలిగి ఉంటోంది. మరోవైపు ప్రకతి వనరులకు, సోయగాలకు నెలవై పుష్కలమైన పర్యాటక వనరులనూ మనకందిస్తున్నది. సమద్రాలకు బదులు పెద్ద చారిత్రాత్మకమైన చెరువులు, గోదావరి నదీ జలాలు, ఇసుక తిన్నెలు తెలంగాణలో ఉన్నాయి. తెలుగునేలను ఏలిన 80 శాతం రాజవంశాలు ఈ గడ్డపైనే పుట్టాయి. వారంతా తెలంగాణ పర్యాటకానికి మరింత శోభనిచ్చారు.
ఇలా తెలంగాణ ప్రాంతం అన్ని రకాల పర్యాటకానికి అనువైంది కనుక, ప్రపంచంలోనే అతి వేగంగా వద్ధి చెందుతున్న టూరిజం రంగాన్ని రాబోయే తెలంగాణ ప్రభుత్వం కీలక అభివద్ధి రంగంగా గుర్తించాలి. ఫలితంగా వచ్చే ఆదాయాన్ని పేదరిక నిర్మూలనకు వాడుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ కింది అంశాలు గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2009 సంవత్సరంలో నియమించిన ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ అనే అధ్యయన సంస్థ ఇదే విషయాన్ని ఇలా చెప్పింది.
2020 దాకా ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలో 25 శాతం మార్కెట్‌ను దేశీయంగా, విదేశీ పర్యాటకంలో 15 శాతం మార్కెట్‌ను వినియోగించుకోగలిగితే 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక స్థలాలను 61.2 కోట్ల మంది దేశీ పర్యాటకులు, 37.3 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తారని అంచనా.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ భూభాగం 42 శాతం కనుక పై అంచనాలతో అంత శాతం అంచనాలను సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ దిశగా చర్యలు తీసుకుంటే తెలంగాణలో ఒక్కో జిల్లాకు కనీసం లక్ష ఉద్యోగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థిరీకరించవచ్చు. ఇందుకు తెలంగాణ 2020 నాటికల్లా 1,30,975 కోట్ల రూపాయలను దశల వారీగా మౌలిక వసతుల కల్పనకోసం ఖర్చు చేయాలని పై అధ్యయన సారాంశం.
-2010 నాటి పర్యాటక విధానం పేర్కొన్నట్లుగా ప్రభుత్వం ముందుగా జిల్లాకొక పర్యాటక అభివద్ధి సమన్వయ మండలిని ఏర్పాటు చేయాలి. ఈ మండళ్ళ ద్వారా ఆయా జిల్లాల్లో ఉన్న కొత్త పర్యాటక వనరులను గుర్తించి వాటి పూర్తి అధ్యయన వివరాలను ప్రచురించి నిపుణుల సాయంతో స్థానిక పర్యావరణాన్ని ప్రజలకు హానీ కలగని రీతిలో మెరుగు పరచాలి.
-వెనుకబడిన ప్రాంతాల ప్రజలు అభివద్ధి చెందేలా పర్యాటక కూడళ్ళను (టూరిజం సర్క్యూట్స్) నిర్ధారించి వాటిల్లో మౌలిక వసతులను అభివద్ధి చేయాలి.
-జిల్లా కొకటి లేదా విశ్వవిద్యాలయానికొకటి చొప్పున పర్యాటక శిక్షణ కళాశాలలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పదవ తరగతి ఆ పైన చదువుకొన్న స్థానిక విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పర్యాటక రంగ అవకాశాలను వినియోగించుకోడంలో కావలసిన తర్ఫీదు నివ్వాలి.
-తెలంగాణలోని అన్ని పర్యాటక స్థలాలు, వాటికి అందుబాటులో ఉన్న అన్ని రవాణా సౌకర్యాల వివరాలను, వసతి సౌకర్యాలను సమన్వయ పరచి ప్రత్యేక పుస్తకాలుగా ప్రచురించాలి. వీటిని ప్రజలకు, పర్యాటకులకు ఉచితంగా అందించాలి. ఇవే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి.
-అన్ని రాష్ర్టాల రాజధానుల్లో, విదేశీ రాజధానుల్లో ఉన్న పర్యాటక సౌధాల్లో తెలంగాణ పర్యాటక కార్యాలయాలను ప్రారంభించి, వాటిల్లో పై వివరాల బ్రోచర్లను పర్యాటకులకు ఉచితంగా అందించాలి.
-ప్రతి జిల్లాలో వెనుకబడిన ప్రాంతానికి సమీపంలో ఉన్నదైన, ఆ జిల్లా పర్యాటక వనరులకు, రహదారులకు దగ్గరలో ఉన్న పట్టణాన్ని పర్యాటక కూడలిగా గుర్తించి మౌలిక వసతులతో అభివద్ధి చేయాలి. (ఈ విషయమై జిల్లాకొకటిగా కింది పట్టణాలను గుర్తించవచ్చు. ఆదిలాబాద్‌లో ఉట్నూర్, నిజామాబాద్‌లో సదాశివనగర్, మెదక్‌లో జహీరాబాద్, రంగారెడ్డిలో అనంతగిరి (వికారాబాద్), కరీంనగర్‌లో మంథని, ఖమ్మంలో భద్రాచలం, వరంగల్‌లో ములుగు, నల్లగొండలో సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో ఆలంపూర్ పట్టణాలు) ఆయా జిల్లాల్లో సుమారుగా మధ్యలో నెలకొని పేద ప్రజలకు, పర్యాటక స్థలాలకు (వనరులకు) ఇవి సమీపంలో ఉన్నాయి.
-రాష్ట్ర రాజధాని నుండి, పైన పేర్కొన్న పట్టణాల నుండి అన్ని పర్యాటక స్థలాలకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిటిడిసి), ఆర్టీసీ, క్రమానుగతంగా నియత పర్యటన (కస్టమైజ్డ్ టూర్స్) వాహనాలను నడపాలి. నిరుద్యోగులకు పన్నులు లేకుండా వాహనాలను నడుపుకొనే వెసులుబాటు కల్పించాలి.
-తెలంగాణలో ఉత్తరాన దండకారణ్యం, దక్షిణాన నల్లమల అడవులు ఉన్నాయి. కాబట్టి, పర్యావరణ పర్యాటకాన్ని (ఎకో టూరిజం) అభివద్ధి చేయాలి. గోదావరికి ఉత్తరాన ఉన్న ఆదిలాబాద్, దక్షిణాన ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అడవుల్లోని జలపాతాలకు జలపాత పర్యటనలు (వాటర్ ఫాల్స్ టూర్) నిర్వహించాలి.
-ఆదిలాబాద్‌లోని కెరమెరి, శంకర్ లొద్ది, ఖమ్మం జిల్లాలోని చర్ల ప్రాంతం, మహబూబ్‌నగర్, అక్క మహాదేవి గుహలు మొదలైన స్థలాల్లో కేవ్ టూరిజం అభివద్ధి పరచాలి. ఈ ప్రాంతాల్లో స్థానికులను ట్రెక్కింగ్ గైడులుగా నియమించి వారికే ట్రెక్కింగ్ సైకిళ్ళను కిరాయికి ఇచ్చి ఆ మేరకు హోమ్ స్టేలను ప్రోత్సహించాలి. వారి ఆదాయవద్ధికి కషి చేయాలి.
-ఆదిలాబాద్ జిల్లాలోని తలై, తుమ్మిడి హట్టి, గాడిద గుండం, కనకాయి గూడెం, కొమురం భీం ప్రాజెక్ట్ వంటి ప్రాంతాలను కొత్తగా అభివద్ధి చేయాలి.
-మేడారం జాతరతో పాటు కేస్లాపూర్, గాంధారి ఖిల్లా, మోతెగడ్డ (భద్రాచలం దగ్గర), సలేశ్వరం (మహబూబ్‌నగర్ జిల్లా) మొదలైన గిరిజన జాతరలను ప్రభుత్వ జాతరలుగా గుర్తించి నిర్వహించాలి.
-ఒక్కొక్క జిల్లాలో నెలకు ఒకటి చొప్పున పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలి.
-నిర్మల్, ఖడికి, కేస్లగూడ (ఆదిలాబాద్), కరీంనగర్ (ఫిలిగ్రీ), చేర్యాల (వరంగల్), బొంతుపల్లి (మెదక్), సిద్దిపేట (బాతిక్ చిత్రాలు), గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల చీరెలు మొదలైన హస్తకళలను ప్రోత్సహించడానికై శిక్షణనిచ్చి ఆయా కళాకతులను రాష్ట్ర పర్యాటక స్థలాలన్నింటిలో పర్యాటకులకు అందుబాటులో ఉంచాలి.
~ డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ, 94909 57078dyavanapalli@gmail.com

Tuesday, 8 October 2013

Dr. D. Satyanarayana receiving Best Tourism Book of the year Award by the State Government of Andhra Pradesh

Friends, I am posting the photos shot while I was receiving the State Government Award for Best Tourism Book (Telangaanalo Kotta Paryaataka Sthalaalu) of the year 2012-13 conferred on me on the eve of World Tourism Day on 27th September 2013 held in the National Institute of Tourism and Hospitality Management, Gachibowli, Hyderabad.



Tuesday, 28 May 2013

Telangana Vihara Sthalalu published in Namasthe Telangaana on 26.5.2013

తెలంగాణ విహారస్థలాలు
tg-tour
- డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ, 94909 57078

స్థూలంగా చెప్పాలంటే పర్యాటకం రెండు రకాలు... వారసత్వ కట్టడాలు (హెరి టూరిజం), పర్యావరణ పర్యాటకం (ఎకో టూరిజం). ఈ రెండు రకాల పర్యాటక స్థలాలు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి. యావత్ తెలుగుదేశాన్ని పాలించిన రాజవంశాలన్నింటికీ తెలంగాణే పుట్టినిల్లు కావడంతో వారు కట్టించిన కోట గోడలు, దేవాలయాలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ భౌగోళికంగానూ పీఠభూమి కావడంతో గుట్టలు, లోయలు, వాటి మధ్య పారే నదీ నదాలు, వాగులు వంకలతో తద్వారా ఏర్పాటైన చెరువులతో, పచ్చని అడవులతో పర్యావరణ పర్యాటకానికి కూడా అనువుగా ఉంది. ఒక్క సమువూదతీర పర్యాటకం (బీచ్ టూరిజం) తప్ప అన్ని రకాల పర్యాటక స్థలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో సముద్రం లేదని తెలంగాణ రాజులు, ప్రత్యేకించి కాకతీయులు పెద్ద చెరువులను నిర్మించి వాటికి ‘సమువూదాల’నే పేర్లు పెట్టారు.ఈ విధంగా అన్ని రకాల పర్యాటక విశేషాలకు ఆలవాలమైన తెలంగాణను పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు వీలున్నప్పుడల్లా పరిచయం చేయవలసిందే. ఆయా స్థలాలకు వెళ్లేలా ప్రోత్సహించవలసిందే. తద్వారా వచ్చే ఆదాయంతో పర్యాటక స్థలాలలోని స్థానికులూ ఆత్మ విశ్వాసాన్ని పెంచుకొని ఆర్థికంగానూ ఎదుగుతారు. అంతేకాదు, సమాచార సాంకేతికత (ఐ.టి) పరిక్షిశమ తరువాత ఆర్థికాభివృద్ధికి దోహదపడే పరిక్షిశమ పర్యాటక రంగానిదే కాబట్టి, తెలంగాణ పర్యాటకాన్ని పరిచయం చేసుకొని, దర్శించి, తెలంగాణ ప్రజలు తమ వారసత్వ సంపదపట్ల సగర్వం పెంచుకోవాలని, వాటిని అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేయాలన్నదే మన ఆకాంక్ష. కాగా, ఎండాకాలంలో కావలసినవి నీడ, నీళ్ళు. కాబట్టి వాటిని ఇచ్చే అడవులు, నదుల ప్రాంతాల్లోని పర్యావరణ, పర్యాటక స్థలాలను సంక్షిప్తంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. గమనించగలరు. 

హైదరాబాద్ - కుంతాల మార్గంలో సందర్శించాల్సినవి...
హైదరాబాద్ నుంచి తూప్రాన్, రామాయంపేటల మీదుగా 110 కిలోమీటర్లు ప్రయాణించి మెదక్ చేరుకోవచ్చు. మెదక్‌లో సుమారు వందేళ్ళ కిందట (1914లో) పోస్నేట్ అనే క్రైస్తవ సన్యాసి కట్టించిన 173 అడుగుల ఎత్తైన చర్చి ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్దది (వాటికన్ చర్చి తర్వాత). ఇందులో ఒకేసారి 5000 మంది ప్రార్థనలు చేయవచ్చు. బయట నుంచి వచ్చే వెలుతురును ప్రతిఫంపజేస్తూ చర్చి లోపలున్న జీసస్ తదితర పేయింటింగ్స్ రంగులతో మెరిసిపోతూ మనల్ని మురిపిస్తాయి. ఈ చర్చి ఎదురుగా కిలోమీటరు దూరంలోనే మెదక్ దుర్గం కోట గోడలు కన్పిస్తాయి. యాత్రికులు ఎక్కి ఆనందించవలసినవి అవి.అలాగే, మెదక్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మంజీరా నది ఏడు పాయలుగా చీలి పారుతుంది. వాటి మధ్య అమ్మవారి దేవాలయం కొండగుహలో ఉంది. ఈ ఏడుపాయల్లో స్నానం చేసి ఆలయం చుట్టూ గుహలో ప్రదక్షిణ చేయడం మరిచిపోలేని అనుభూతి. ఆలయానికి ఎదురుగా ఫర్లాంగు దూరంలో కట్టిన చెక్‌డ్యామ్ పైనుంచి దూకే నీళ్ళు చిన్న జలపాతం లాగా ఏర్పడతాయి. వాటిలో చెంగు చెంగున ఎదుక్కుతున్న వేలాది చేపలు మనకు నయనానందాన్ని కలిగిస్తాయి.మెదక్ నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే 1922లో కట్టిన పోచారం ప్రాజెక్టు ఉంది. దీనిమీది నుంచి దూకే చిన్న జలపాతం లాంటి మత్తడి నీళ్ళలో కేరింతలు కొడుతూ స్నానం చేయవచ్చు. అప్పుడు నిజాం కట్టించిన గెస్ట్‌హౌజ్‌ను, పెట్టించిన బోటు సౌకర్యాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. పర్యాటకులను ప్రాజెక్ట్ నీటి మధ్యలో ఉన్న ద్వీపం (ఐలాండ్) వరకు తీసుకెళ్ళి పక్షుల దర్శనం చేయించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ ప్రాజెక్ట్ నీళ్ళు పక్కనే ఉన్న వన్య ప్రాణుల ఉద్యానవనం (వైల్డ్ లైఫ్ పార్క్)లోకి కూడా చొరబడతాయి. ఈ ఉద్యానవనంలో సొంత వాహనంలో వెళ్ళి, అందులో స్వేచ్ఛగా తిరిగే లేళ్ళు, ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి పందులు తదితర జంతువులను ప్రత్యక్షంగా చూడటం చాలా థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది.

పోచారం నుంచి గోపాల్‌పేట్ మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి నిజాంసాగర్ ప్రాజెక్టు అంచున ఉన్న ‘త్రిలింగ రామేశ్వరాలయాన్ని’ దర్శించవచ్చు. దీన్ని సుమారు 1100 సంవత్సరాల కిందట వేములవాడ చాళుక్య రాజులు కట్టించినట్లు, వారి రాజలాంఛనమైన ‘విజృంభించే సింహ శిల్పం’ నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక్కడికి మరో 20 కిలోమీటర్ల దూరంలో ఎల్లాడ్డి ఉంటుంది. అక్కడా చారివూతక గుళ్ళున్నాయి. అక్కడ్నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిజాంసాగర్ డ్యాం ఉంది. డ్యామ్ కట్టమీద నడుస్తూ నిండుగ ఉన్న ఆ నీటి సౌందర్యాన్ని చూడవచ్చు. చివరన కనిపించే ఆనాటి రెండంతస్థుల గోల్ బంగ్లాను, స్విమ్మింగ్ ఫూల్‌ను చూడవచ్చు. డ్యాం ప్రారంభంలో ఉన్న గెస్ట్ హౌజ్ నుంచి మర బోట్లలో అల్లంత దూరంలోని విద్యుత్ ప్లాంట్ వరకు విహారం చేయవచ్చు. డ్యాం కింద వర్షాకాలంలో నురగలు కక్కుతూ దూకే నీటి సౌందర్యాన్ని చూసి తీరాలి. డ్యాం కింద సహజంగా ఏర్పడిన విశాలమైన ‘నదీ ద్వీపం’ (రివర్ ఐలాండ్) మీద పూర్వపు నిజాం రాజు ఏర్పాటు చేసినట్లు గార్డెన్స్, పండ్ల తోటలను ఏర్పాటు చేస్తే మైసూర్ కృష్ణరాజసాగర్ డ్యాంను నిజాంసాగర్ డ్యాం తలదన్నుతుంది.కామాడ్డికి దగ్గర్లో ఉన్న తాడ్వాయి గుడి చూసి, అక్కడ్నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి సంతాయిపేట శివార్లలో పారుతున్న భీమేశ్వర వాగు మధ్యలో కట్టిన వేయేళ్ళనాటి భీమేశ్వర క్షేత్రాన్ని, దాని మీదుగా కట్టిన చెక్ డ్యాం పైనుంచి పడుతున్న నీటి సౌందర్యాన్ని డ్యాం నీళ్ళలో సాయం సంధ్యా సమయంలో ప్రతిఫలిస్తున్న పొద్దు గుంకుతున్న సూర్యబింబం సౌందర్యాన్ని చూస్తే గాని ‘జీవితం తరించదు’ అన్పిస్తుంది.

కామాడ్డి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధమైన ఇస్సన్నపల్లి వీరభవూదాలయాన్ని దర్శించుకొని తూంపల్లి-చిమన్‌పల్లి మీదుగా అందమైన అడవులు, లోయలు, వాగు వంకల గుండా ప్రయాణించి హుస్సేన్‌నగర్ సమీపంలో గుట్టల మధ్యలో నెలకొన్న లొంక రామలింగేశ్వరాలయాన్ని చూసి తీరాల్సిందే. ఇక్కడి ప్రకృతి కాశ్మీర్‌ను తలపిస్తుంది.ఆదిలాబాద్‌లోకి ప్రవేశించగానే మనల్ని పలకరించేది సోన్‌పేట. చిన్నదైనా చిత్రమైన కోట అది. దానికి పది కిలోమీటర్ల దూరంలోనే నిర్మల్ కోటగోడలు, బురుజులు కన్పిస్తాయి. నిర్మల్ నుంచి భైంసా రూట్‌లో 12 కిలోమీటర్లు ప్రయాణించి దిలావర్‌పూర్ మీదుగా ‘కదిలె’ చేరుకోవచ్చు. ఇక్కడ చుట్టూ గుమిగూడిన గుట్టల మధ్య లోయలో ఊరుతున్న ఏరు గట్టున చారివూతక పాపన్న గుడి ఉంది. అందులో శివలింగం కదులుతుంది. దాని కింద ఉబికే ఊటల ధాటికి ఇక్కడున్న సప్తగుండాలు ‘సంతానాన్నిచ్చే నీటిని కలిగి ఉన్నాయని’ భక్తులు విశ్వసిస్తారు. జలజలా పారుతున్న ఏరు మధ్యలో ఏపుగా పెరిగిన చెట్ల సౌందర్యాన్ని చూస్తూ ఏరులోనే ట్రెక్కింగ్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది. ఇక్కడి 18 చెట్ల మహావృక్షం కూడా మనలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. దిలావర్‌పూర్ నుంచి భైంసా మీదుగా వెళితే గోదావరి ఒడ్డున నెలకొన్న బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. చాలామంది ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. గోదావరిలో బోటు విహారం చేయవచ్చు. సమీప ప్రాంతాల్లో ఉన్న శిథిల బౌద్ధ, జైన స్థూపాలను ఆసక్తి గలవారు దర్శించవచ్చు.

నిర్మల్ నుంచి ఉత్తరంగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే నేరేడిగొండ వస్తుంది. ఇక్కడ 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో 5 జలపాతాలున్నాయి. నేరేడిగొండ టోల్‌గేట్ రావడానికి ముందు కుడివైపున రోడ్ పక్కనే ఒక చిన్న జలపాతముంది. నేరేడిగొండ నుంచి ఎడమ వైపున పది కిలోమీటర్ల దూరంలో పొచ్చెర జలపాతముంది. దానికింద స్నానం చేయవచ్చు. ముప్పైవేల సంవత్సరాల ముందు కూడా ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారని తెలిపే వారి ఆయుధాలు, పనిముట్లు ఇక్కడ దొరికాయి. పొచ్చెరకు మరికొంచెం దూరంలో ఘన్‌పూర్ గ్రామ పరిధిలో బుంగనాల అనే మరో జలపాతముంది. నేరేడిగొండకు కుడివైపున సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఇప్పటివరకు రాష్ట్రంలోనే పెద్దదిగా పేరుమోసిన కుంతల జలపాతముంది. మూడు దఫాలుగా దూకే దాని సౌందర్యం ఎంతటిదో దానికి సమాంతరంగా సాగుతున్న గుట్టల మధ్య లోయ సౌందర్యమూ అంతటిదే. ఇక్కడ 8 దశాబ్దాల నాటి గెస్ట్‌హౌస్ ప్రాంతంలో ఇప్పుడు కొత్తవి కడుతున్నారు. నేరేడిగొండ దాటి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించగానే రోడ్‌కు ఎడమవైపున కోరటికల అనే మరో చిన్న జలపాతం కన్పిస్తుంది.నేరేడిగొండ నుంచి ఇచ్చోడ వైపు సాగి కొంచెం ముందు నుంచే కుడివైపుకు సుమారు పదిహేను కిలోమీటర్లు ప్రయాణిస్తే సిరిచెల్మ చేరుకోవచ్చు. ఇక్కడ అడవుల మధ్యనున్న చెరువు మధ్యలో హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, శిల్పాలు, శాసనాలు అనేకం ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి, చారివూతక ప్రాధాన్యానికి నెలవు ఈ సిరిచెల్మ.
tg-tour1
హైదరాబాద్ - కాళేశ్వరం మార్గంలో...
హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్గంలో 70 కిలోమీటర్లు ప్రయాణించగా వచ్చే కుకునూరుపల్లి నుండి కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అనంతసాగర్ అనే గ్రామాన్ని చేరుకోవచ్చు. తెలంగాణలోనే ఎక్కువ సరస్వతీ ఆలయాలున్నాయనడానికి ఈ గ్రామ సరస్వతీ దేవాలయం ఒక నిదర్శనం. ఈ ఆలయం సమీపంలో రెండు నీటిదొనలున్నాయి. ఒకటి రాగిదొన. రెండవది పాలదొన. రాగిదొనలో నీళ్ళు ఎర్రగా ఉంటాయి. పాల దొనలోని నీళ్లు తెల్లగా ఉంటాయి. ఈ దొనలు ఆ రెండు కాలాల్లో కూడా ఎండిపోక పోవడం ఇక్కడి ప్రత్యేకత.కుకునూరుపల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటలో కోటిలింగేశ్వరాలయం ఉంది. ఇక్కడొక డ్యాం ఉంది. ఆలయంలో పెద్దలు ఆధ్యాత్మికంగా ఆనందిస్తే... పిల్లలేమో బోటింగ్ చేసి ఆనందించవచ్చు. సిద్దిపేట నుంచి కరీంనగర్, పెద్దపెల్లి మీదుగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మంథని చేరుకోవచ్చు. మంథని తెలంగాణలో అనాదిగా బ్రాహ్మణ పండితులకు, వైదిక సంస్కృతికి కేంద్రంగా భాసిల్లుతూ వస్తున్నది. ఇక్కడ ఎన్నో చారివూతక ఆలయాలున్నాయి. గోదావరి తీరాన ఉన్న శిథిల త్రికూటాలయం వాస్తు శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ తూర్పు నుంచి ఉత్తరం వైపుకు, మళ్ళీ తూర్పు వైపుకు తిరుగుతూ హొయలు పోతున్న గోదావరి సౌందర్యం చూసి తీరవలసిందే.

ఇక్కడ్నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తే మనకు మొదట కన్పించేది శివ్వారం. ఈ గ్రామంలో ఆటో తీసుకుని లేదా ఎవరినైనా తోడు తీసుకొని ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఎర్రచెరువు మీదుగా పచ్చని కొండల మీదుగా ‘లంజమడుగు’ చేరుకోవచ్చు. లంజమడుగు ముఖ్యంగా మూడు అంశాలకు ప్రసిద్ధి. ఒకటి: ఇది రాష్ట్రంలోనే అరుదైన అందమైన మొసళ్ళ పెంపక కేంద్రం. రెండు: ఇక్కడి ప్రదేశం తెలంగాణలో పారే గోదావరి నదీ సౌందర్యానికి పరాకాష్ట. అది ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో అనేక మలుపులు తిరుగుతూ అడ్డువచ్చిన అడవులు-గుట్టలను చీల్చుకొని పారుతూ, అంతు తెలియని అందమైన పెద్ద మడుగును ఏర్పరచింది. మూడు: తెలంగాణలో గుహలో తొలిచి నిర్మించిన ఆలయాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి.లంజమడుగు ప్రాంతం కేరళలోని సమువూద పర్యాటక స్థలాలను తలదన్నేలా ఉంటుంది. విశాలమైన ఈ మడుగు సమువూదాన్ని లేదా బ్యాక్ వాటర్‌ను పోలి ఉండగా దాని తీరపు ఇసుక తిన్నెలు బీచ్‌లను మరిపిస్తాయి. మడుగు మరో తీరం చెక్కినట్లున్న ఎత్తైన కొండలు, లోయలు, పచ్చని ఎత్తైన అడవులతో ఎనలేని ఆనందాన్నిస్తుంది. వీటన్నింటి ఆనందాన్ని ఈ మడుగులో స్థానిక జాలర్ల బోట్లలో విహరిస్తూ ఆస్వాదించవచ్చు. మనం విహరించే బోట్ల కింద మొసళ్ళూ విహరిస్తుంటాయి. మడుగు ఒడ్డు ఒకచోట మూడు వందల అడుగుల ఎత్తు నిటారుగా ఉంటుంది. దాని అంచునే స్థానికులు ‘లంజగుళ్ళు’ అని పిలుస్తోన్న రెండు గుహాలయాల సముదాయాలున్నాయి. అవి తమ నీడలను కింద ఉన్న గోదావరి నీళ్ళల్లో ప్రతిబింబిస్తూ అందంలో అజంతా గుహలను తలదన్నుతాయి. వీటికి ఎడమ వైపున ఫర్లాంగు దూరంలో మరో గుహాలయాల సముదాయముంది. వాటి పేరు కోమటి గుళ్ళు. గోమఠేశ్వరుడు అనే జైనమత దేవుని భక్తులై కోమట్లు అని పిలువబడిన వారిలో సుమారు ఎనిమిదవ శతాబ్దం ప్రాంతంలో ప్రబలిన వేశ్యాలోలత్వం కారణంగా వారు కట్టించిన గుళ్ళను ‘లంజగుళ్ళు’ అని, ‘కోమటిగుళ్ళు’ అని పిలుస్తున్నారు. ఇది తెలియని వారు స్థానికంగా వేశ్యాతనం చేసిన రాణి కథను కూడా విన్పిస్తుంటారు.మంథని నుంచి సుమారు 50 కిలోమీటర్లు కాళేశ్వరం వరకు పచ్చని కొండలు, కోనల గుండా ప్రయాణించడమే ఆహ్లాదకరమైన అనుభూతిని మిగులుస్తుంది. కాళేశ్వరం గోదావరి-వూపాణహిత నదుల సంగమ ప్రదేశంలో ఉన్నదే త్రిలింగ క్షేత్రం. ఇక్కడి ప్రధానాలయంలో ఒకే పానవట్టంపై ముక్తేశ్వర, కాళేశ్వర పేర్న రెండు శివలింగాలున్నాయి. ముక్తేశ్వర లింగం మీద పోసిన అభిషేక జలం దాని మధ్యలో ఉన్న రంధ్రం గుండా గోదావరి - ప్రాణహిత నదుల్లోకి పారి ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమ క్షేత్రం చేస్తుంది. ఈ క్షేత్రం ఇంకా ఎన్నో ప్రాచీన ఆలయాలు, వాస్తు శిల్ప సౌందర్యాలతో అలరారుతోంది. 

హైదరాబాద్ - మల్లూరు మార్గంలో...
హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ఏటూరు నాగారం, మల్లూరు ప్రయాణించే రూటులో సుమారు 80 కిలోమీటర్లు దాటాక ఆలేరు నుంచి ఎడమ వైపున వచ్చే కొలనుపాకలో అద్భుతమైన వాస్తు శిల్పాలతో ఒప్పారుతున్న చారివూతక జైన దేవాలయాలను, సోమేశ్వరాలయం తదితర హిందూ దేవాలయాలను కళా పిపాసకులు చూసి తీరవలసిందే. ఆలేరుకు 120 కిలోమీటర్ల దూరంలోని రామప్ప దేవాలయాలు తెలంగాణలో హిందూ వాస్తు శిల్ప సౌందర్యాలకు పరాకాష్టగా నిలుస్తాయి. వాటిని చూసి సమీపంలోనే ఉన్న విశాలమైన రామప్ప చెరువులో బోటు విహారం చేయవచ్చు. రామప్పకు కుడివైపున ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నవరం చెరువు కొండలు, అడవుల్లో చిక్కుకుని మరీ అందంగా కన్పిస్తుంది. నీళ్ళ మధ్య ద్వీపాలలాగా ఏర్పడిన ఆ పచ్చని కొండలు నాలుగింటి మీదికి ఊగే తాళ్ళ వంతెనలు ఏర్పాటు చేశారు. వాటి మీద నడుస్తూ ఒక ద్వీపానికి చేరుకొని అక్కడున్న పర్యాటక శాఖ రెస్టాంట్‌లో భోజనం చేసి, వీలైతే అక్కడే ఉన్న కాటేజీల్లో (వసతి గృహాల్లో) ఒకరోజు బసచేయవచ్చు. అడవులు, నీళ్ళ మీదుగా వచ్చే చల్లగాలులను ఆస్వాదిస్తూ అక్కడ గడపడం ఒక మరిచిపోలేని మధురానుభూతిని మిగులుస్తుంది. చెరువు నీళ్ళలో స్నానం చేయవచ్చు, బోట్లలో విహరించవచ్చు. లక్నవరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరు నాగారం నుండి అందమైన అటవీ మార్గంలో మంగపేట మీదుగా మరో 20 కిలోమీటర్లు ప్రయాణించి మల్లూరు చేరుకోవచ్చు. చల్లని గోదావరి నదీ తీరాన పచ్చని కొండకోనల మధ్య వెలసిన నరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికానందానికి, ప్రకృతి సౌందర్యానికి నెలవు. స్వామి పొట్టలో వేలుపెడితే అది రక్తపు వాసన రావడం ఇక్కడి ప్రత్యేకత. పురాతన కాలంలో ఒక గిరిజనుడు చూడక స్వామి పొట్టలో గునపం దింపాడట. అందుకే రక్తం ఇంకా కారుతూనే ఉందంటారు.
tg-tour2
హైదరాబాద్ - పాపికొండలు మార్గంలో...
హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో సూర్యాపేటకు ముందు పిల్లలమర్రి వస్తుంది. ఈ గ్రామం 800 ఏళ్ళ కిందట కాకతీయుల సామంతులైన రేచర్ల రాజులకు రాజధాని. కాబట్టి, ఇక్కడ కోట గోడలుండేవి. ఇప్పుడు అవి లేవు. కాని, వాటి మధ్య ఆ రాజ వంశీకులు కట్టించిన ఎరకేశ్వర, నామేశ్వర దేవాలయ సమూహాలున్నాయి. ఇందులో ప్రధాన దేవాలయ స్తంభాలకు, వాటిమీది దూలాలకు చెక్కిన నల్లరాతి శిల్పాలు అతి సుందరమైనవి. అంతరాళం, మంటపం మధ్యనున్న రెండు శిలా దూలాలపై చిత్రించిన రామ-రావణ యుద్ధం, క్షీరసాగర మథనం చిత్రాలు (పెయింటింగ్స్) తెలంగాణలో ఆ తరహావి అవి రెండే ఇప్పటి వరకు నిలిచి ఉన్నవి. ఇదే గ్రామంలో చాలా ఎత్తైన పీఠం మీద అదే కాలపు దేవాలయం మరొకటుంది.భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా సహజ సౌందర్యానికి నిలయమైన ప్రాంతం కూడా. ఉత్తరం నుండి వస్తున్న గోదావరి ఇక్కడ భద్రగిరి రాయాలయం చుట్టూ తిరిగి మళ్ళీ తూర్పు దిశకు ప్రవహిస్తుంది. ఇక్కడ నదీ స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకోవచ్చు. భద్రగిరికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో వచ్చే మోతెగడ్డ గ్రామ సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఒక ద్వీపకొండపైన వీరభద్ర స్వామి క్షేత్రముంది. నీటిమధ్య కొండ క్షేత్రంపై నిల్చుని చుట్టూ ఉన్న పరిసరాల సౌందర్యాన్ని చూసి పరవశించిపోవచ్చు. భద్రావూదికి ఆవల 13 కిలోమీటర్ల దూరంలో ఇరి గ్రామంలో రుక్మిణీ సత్యభామ సహిత వేణుగోపాలస్వామి ఆలయముంది. దీన్ని చూసే రామదాసు భద్రాచలంలో సీతారామాలయాన్ని కట్టించాడంటారు.భద్రాచలానికి ఉత్తరంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతారాముల పర్ణశాల, అక్కడి నదుల సంగమం చూడదగిన పర్యాటక స్థలాలు. భద్రాచలానికి తూర్పువైపు 40 కిలోమీటర్లు ప్రయాణించి కుకునూర్ - పేరంటాలపల్లి నుంచి గోదావరిలో బోట్లపైన పాపికొండల మధ్య సాగే విహారమూ మరో పేర్గాంచిన పర్యటనే.

నాగార్జునసాగర్
సుమారు అర్థ శతాబ్దం కింద కట్టిన అద్భుత మానవ నిర్మాణం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్. 124 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తైన రాతి డ్యామ్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలో వెలికి తీసిన చారివూతక అవశేషాలు... ప్రత్యేకించి బౌద్ధ అవశేషాలు, విశేషాలను ప్రాజెక్ట్ నీళ్ళ మధ్యలో ఉన్న నాగార్జున కొండపై ఏర్పాటుచేసిన మ్యూజియంలో భద్రపరిచారు. అక్కడికి సాగర్ నీటిలో బోటులో 9 కిలోమీటర్లు ప్రయాణించడం అరుదైన అనుభూతినిస్తుంది. సాగర్ డ్యామ్ కూడా చూశాక పైలాన్-హిల్ కాలనీ పరిసరాల్లో 279 ఎకరాల్లో బుద్ధుడు ప్రవచించిన ‘అష్టాంగమార్గ’ స్ఫూర్తితో నిర్మించిన కట్టడాలు, పార్క్‌లు చూడదగినవి. సాగర్ కిందుగా 11 కిలోమీటర్ల దూరంలో 70 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న ఎత్తిపోతల జలపాతం ఉంది. దీని సౌందర్యం విధిగా చూడదగింది. అయితే, ఇది గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. నాగార్జునసాగర్‌లో పర్యాటకులకు కావలసిన సకల సౌకర్యాలున్నాయి.

హైదరాబాద్ - నల్లమల
రాష్ట్రంలోనే అత్యంత విశాలమైనవి నల్లమల అడవులు. అందుకే దేశంలోనే పెద్దదైన ‘పులుల సంరక్షణా కేంద్రం’ సుమారు నాలుగు దశాబ్దాల కిందట ఇక్కడ ఏర్పాటైంది. నల్లమలలోనే రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన శ్రీశైల క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం ఉత్తరద్వార క్ష్రేత్రమైన ఉమామహేశ్వరంతో తెలంగాణలో (మహబూబ్‌నగర్ జిల్లాలో) నల్లమల అడవులు ప్రారంభమవుతాయి. సర్పాకారంగా కమ్ముకున్న పచ్చని కొండల కంఠ స్థానంలో సహజంగా ఏర్పడిన గుహల్లో పైనుండి పడుతున్న నీటి ధారల కింద ప్రతిష్టితమైన స్వయంభు శివలింగం తేజస్సు చూడదగింది. ఉమామహేశ్వరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్ననూరులో చీతల్ రెస్టాంట్‌లో భోజనం చేసి, అందులోని వనమాలిక కాటేజీల్లో విశ్రాంతి తీసుకొని, అక్కడున్న చెంచులక్ష్మి, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ అనే మ్యూజియంలను సందర్శించవచ్చు. అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండం సందర్శించదగ్గదే. రోడ్ మీదే ఉన్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి టికెట్ రుసుము చెల్లించి వారి వాచ్‌మన్ సహాయంతో సమీపంలో ఉండే ‘గుండం’ వరకు వెళ్ళి నట్టడివిలో వన్యజీవులు, పక్షుల స్వేచ్ఛా విహారాలను వీక్షించవచ్చు.‘గుండం’కు ఫ్లర్లాంగు దూరంలో కిందివైపు లొద్ది ఉంది. దానిలోతు సుమారు వేయి అడుగులు. దాని అడుగున విశాలమైన గుండం ఉంది. సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి ఒక జలపాతం దూకగా ఏర్పడిందది. ఆ జలపాతపు నీటిని ఇప్పుడు స్థానికులు వ్యవసాయం కొరకని చెరువులోకి మళ్ళించుకున్నారు. అయినా వర్షాకాలంలో పారిన వరద నీటికి నిండిన ఈ గుండం ఎండాకాలం కూడా ఎండిపోదు. పైగా ఎండాకాలంలోనే దీని దగ్గర ఎక్కువ ఆనందించే వాతావరణం ఉంటుంది. కాబట్టే, ఎండాకాలంలో వచ్చే వైశాఖ బుద్ధ పౌర్ణమికి జాతర జరుగుతుంది. (ఈ నెలలో 24,25,26 తేదీలలో). గుండానికి రెండువైపులా ఉన్న సహజమైన గుహల్లో విష్ణుకుండిణల కాలపు (1600 సంవత్సరాల) శివాలయాలున్నాయి. వాటి మధ్య ఎత్తైన చెట్ల మధ్యనున్న గుండంలో కేరింతలు కొడుతూ ఈత కొట్టడం, ఆ కేరింతల ప్రతిధ్వనులు కొండల మధ్య వింతగా విన్పించడం... ఇవన్నీ స్వయంగా ఆస్వాదించదగిన అనుభూతులు.

లొద్ది నుంచి 8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే నిజాం కాలం నాటి ఫరహాబాద్ గేట్ వస్తుంది. అక్కడి నుంచి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు తమ జీపులో టైగర్ సఫారీకి తీసుకు చివరన గల ఒక కొండ అంచుకు తీసుకెళ్తారు. ఆ అంచు ఎత్తు భూమి ఉపరితలానికి సుమారు ఒక కిలోమీటరుంటుంది. అంత ఎత్తులో ఉన్న మన మీదికి రయ్య్‌మని వీస్తున్న గాలుల అనుభూతులను ఆస్వాదిస్తూ, పచ్చని అడవుల మధ్య ఎన్నో కిలోమీటర్ల దూరంలో చెలిమలలాగా కనిపిస్తున్న పెద్ద చెరువులను చూస్తూ, పక్కనే నిజాం కట్టించుకున్న శిథిల భవనాలను ఆసక్తిగా వీక్షిస్తూ అక్కడ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి జీపులో ప్రయాణిస్తున్నప్పుడు మనకు మార్గ మధ్యలో జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, పులులు మొదలైన వన్య జంతువులూ కన్పించవచ్చు.ఫరహాబాద్ నుంచి వలవర్లపల్లి మీదుగా సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే మల్లెల తీర్థం అనే జలపాతాన్ని చేరుకోవచ్చు. చుట్టూ ఆవరించుకున్న పచ్చని కొండల మధ్య వంద అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న గిలిగింతలు పెట్టే చల్లని జలపాతపు ధారల కింద, ఏర్పడిన గుండం, దాని నుండి ఎత్తైన చెట్ల గుండా ప్రశాంతంగా పారుతున్న ఏరు హొయలు చూడదగ్గవి.

వటవర్లపల్లి నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అక్కమహాదేవి గుహల క్రాస్ కనిపిస్తుంది. అక్కడి నుండి సుమారు 6 కిలోమీటర్లు అందమైన అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేసి కృష్ణానది ఒడ్డున గల విశాలమైన గుహ సముదాయం చేరుకోవచ్చు. సహజంగా ఏర్పడిన రెండు స్తంభాల మీద విశాలమైన రాతి సల్పపై లాగా అమరి దాని కింద మూడువైపులా వందేసి మూరల గుహలు ఏర్పడ్డాయి. పడమటి వైపు గుహ చివరన స్వయంభు లింగం పీఠం మీద ఉంది. ఆ లింగాన్నే 12వ శతాబ్దంలో అక్క మహాదేవి అనే భక్తురాలు పూజించి, శివున్ని ప్రత్యక్షం చేసుకొని అతనిలో ఐక్యమైందట. ఈ గుహ ప్రాంగణంలో శ్రీశైలం ప్రాజెక్టు నీటి అందాలను చూస్తూ వేల మంది సేదతీరవచ్చు. ఇక్కడి నుంచి శ్రీశైలంలోని పాతాళగంగ వరకు 22 కిలోమీటర్ల దూరం పర్యాటక శాఖ నడుపుతున్న బోట్లలో కూడా ప్రయాణించవచ్చు.
tg-tour3
హైదరాబాద్ - అనంతగిరి
హైదరాబాద్ రాజధానిగా పాలించిన ముస్లిం రాజులకు కూడా పర్యావరణ స్పృహ నాలుగున్నర శతాబ్దాల కింది నుంచే ఉంది. ఆ స్పృహ నుండి పుట్టిన హుస్సేన్‌సాగర్‌లో బోటులో విహరిస్తూ చేసే డిన్నర్, బుద్ధ దర్శనం చక్కటి అనుభూతులు. ఆనాటి కుతుబ్షాహీ రాజులకు (గోల్కొండ కోటపైకి) నీటిని అందించిన దుర్గం చెరువులో బోట్లలో విహరిస్తూ చేపలు పట్టడం, చేప కూరతోనూ భోంచేయడం ఇప్పటికీ సాధ్యమే.
హైదరాబాద్ నుంచి సుమారు డ్బ్బై కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలున్నాయి. అందంలో విశాఖ జిల్లాలోని అనంతగిరి కొండలను తలదన్నే కొండలివి. ఈ అడవుల మధ్య నిజాం కాలంలోనే కుష్టు వ్యాధి నివారణ కేంద్రం ఏర్పాటై ఇప్పటికీ పనిచేస్తోంది. ఇక్కడి వాతావరణంలోనే కుష్టు వ్యాధిని నయం చేయగల మహత్తు ఉందని ఆనాడే గుర్తించారు. ఈ కేంద్రం ముందర విశాలమైన, లోతైన లోయ ఉంది. సాహసికులు అక్కడికి ట్రెక్కింగ్ చేస్తే వారికి అడవుల మధ్య అందమైన చెరువు కన్పిస్తుంది. సాహసించని వారు ఈ కేంద్రానికి వెనుక వైపునున్న దేవాలయాన్ని దర్శించుకుని దాని కిందుగా జంటగా ఉన్న కోనేరులోని మంచి నీటిని, మరోవైపు మురికి నీటిని చూసి, వెనుదిరిగి వచ్చి పర్యాటక శాఖవారు ఏర్పాటుచేసిన రెస్టాంట్‌లో షడ్రసోపేతమైన భోజనం చేయవచ్చు. వీలు చూసుకునేవారు అక్కడే ఉన్న ఏ.సి. గదుల్లో ఉండిపోవచ్చు.
ఈ విధంగా అరకు, హార్స్‌లీ హిల్స్‌లను తలదన్నే చల్లని పర్యాటక కేంద్రాలు మన చుట్టు పక్కలే తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి.